3
సంఘం, దాని నాయకులు
సహోదరీ సహోదరులారా, ఆత్మ సంబంధులైన వారితో మాట్లాడినట్లు మీతో నేను మాట్లాడలేకపోయాను. ఎందుకంటే మీరు ఇంకా ఈ లోక సంబంధులుగానే జీవిస్తూ క్రీస్తులో పసిబిడ్డలుగానే ఉన్నారు. మీరు బలమైన ఆహారాన్ని తినడానికి సిద్ధంగా లేరు కాబట్టి నేను మీకు పాలు ఇచ్చాను. ఇప్పుడు కూడా మీరు దానికి సిద్ధంగా లేరు. మీరు ఇంకా లోకస్థులుగానే ఉన్నారు. మీలో అసూయ, కొట్లాటలు ఉన్నాయి. కాబట్టి మీరు శరీర స్వభావంతో సాధారణ మానవుల్లా జీవించడం లేదా? మీలో, “నేను పౌలును అనుసరిస్తున్నాను” అని ఒకరు, “నేను అపొల్లోను అనుసరిస్తున్నాను” అని ఇంకొకరు చెప్పుకుంటూ ఉన్నప్పుడు మీరు సాధారణ మానవుల్లా లేరా?
అపొల్లో ఎవరు? పౌలు ఎవరు? కేవలం సేవకులే కదా! ఒక్కొక్కరికి ప్రభువు నియమించిన దాని ప్రకారం, వారి ద్వారా మీరు విశ్వాసంలోనికి వచ్చారు. నేను విత్తనం నాటాను, అపొల్లో దానికి నీళ్లు పోశాడు, అయితే వృద్ధి కలుగచేసింది దేవుడే. కాబట్టి నాటేవారిలో కానీ, నీళ్లు పోసేవారిలో కానీ గొప్పతనం ఏమి లేదు, కానీ దేవుడే దానిని వృద్ధి చేయగలరు. నాటేవారు, నీళ్లు పోసేవారు ఒకే ఉద్దేశం కలిగి ఉన్నారు. ప్రతి ఒక్కరు తాను చేసిన కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. కాబట్టి మేము దేవుని సేవలో జతపనివారము: మీరు దేవుని పొలంగా దేవుని కట్టడంలా ఉన్నారు.
10 దేవుడు నాకు అనుగ్రహించిన కృపను బట్టి నేను తెలివైన నిర్మాణకునిగా పునాది వేశాను. అలాగే మరొకరు దాని మీద కడుతున్నారు. అందుకే ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా కట్టాలి. 11 ఎందుకంటే అప్పటికే వేయబడిన పునాది తప్ప మరొకటి ఎవరూ వేయలేరు, ఆ పునాది యేసు క్రీస్తే. 12 ఎవరైనా ఈ పునాది మీద బంగారం, వెండి, వెలగల రాళ్లు, చెక్క, ఎండుగడ్డి లేదా గడ్డి లాంటి వస్తువులతో కడితే, 13 ఆ న్యాయ దినాన వారు చేసిన పని వెలుగులో స్పష్టంగా కనబడుతుంది. అది అగ్నిచేత నిరూపించబడుతుంది, అందరి పనిలోని నాణ్యత అగ్నిచేత పరీక్షించబడుతుంది. 14 పునాది మీద కట్టిన పని ఎవరిది నిలుస్తుందో, వారు జీతాన్ని పొందుతారు. 15 అది కాల్చి వేయబడితే దానిని కట్టిన వారికి నష్టం కలుగుతుంది కానీ వారు తప్పించుకుంటారు. అయితే అది కేవలం మంటల్లో నుండి తప్పించుకున్నట్లుగా ఉంటారు.
16 మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసిస్తుందని మీకు తెలియదా? 17 ఎవరైనా దేవుని మందిరాన్ని పాడు చేస్తే, దేవుడు వారిని పాడుచేస్తారు. ఎందుకంటే దేవుని మందిరం పరిశుద్ధమైనది. మీరందరు కలిసి ఆ ఆలయమై ఉన్నారు.
18 మిమ్మల్ని మీరు మోసగించుకోకండి. ఈ లోకరీతిగా, మీలో ఎవరైనా నేను జ్ఞానినని అనుకుంటే, వారు జ్ఞాని అవ్వడానికి “బుద్ధిలేనివారిగా” కావాలి. 19 ఎందుకంటే ఈ లోక జ్ఞానం దేవుని దృష్టిలో వెర్రితనము. లేఖనాల్లో: “జ్ఞానులను వారి యుక్తిలోనే ఆయన పట్టుకుంటారు”*యోబు 5:13 అని వ్రాయబడి ఉంది. 20 లేఖనాల్లో ఇంకొక చోట: “జ్ఞానుల ఆలోచనలు వ్యర్థమైనవి అని దేవునికి తెలుసు”కీర్తన 94:11 అని వ్రాయబడి ఉంది. 21 కాబట్టి ఎవరు మనుష్యులను బట్టి గర్వించకూడదు. అన్ని మీకు చెందినవే. 22 పౌలు అయినా, అపొల్లో అయినా, కేఫా అయినా, లోకమైనా, జీవమైనా, మరణమైనా, ఇప్పుడు ఉన్న వాటిలోనైనా, రాబోయే వాటిలోనైనా అన్ని మీకు చెందినవే. 23 మీరు క్రీస్తుకు చెందినవారు, క్రీస్తు దేవునికి చెందినవారు.

*3:19 యోబు 5:13

3:20 కీర్తన 94:11