యోహాను
వ్రాసిన మొదటి పత్రిక
1
శరీరధారియైన జీవవాక్యం
1 ఆది నుండి ఉన్న జీవవాక్యం గురించి మేము విన్నది, మా కళ్ళతో చూసింది, మా చేతులతో తాకింది మేము ప్రకటిస్తున్నాము. 2 ఆ జీవం ప్రత్యక్షమైంది; తండ్రి దగ్గర ఉండి మాకు ప్రత్యక్షమై ఆ నిత్యజీవాన్ని మేము చూసి, ఆ జీవాన్ని గూర్చి సాక్ష్యమిస్తూ దాన్ని మీకు తెలియజేస్తున్నాము. 3 తండ్రితో కుమారుడైన యేసు క్రీస్తుతో మాకు గల సహవాసంలో మీరు కూడా మాతో చేరేలా మేము చూసినవాటిని విన్నవాటిని మీకు ప్రకటిస్తున్నాము. 4 మన*కొ.ప్ర.లలో మీ ఆనందం సంపూర్ణమవ్వాలని మేము దీనిని వ్రాస్తున్నాము.
వెలుగు, చీకటి, పాపం, క్షమాపణ
5 మేము ఆయన నుండి విని, మీకు ప్రకటిస్తున్న సందేశం ఇదే: దేవుడే వెలుగు; ఆయనలో ఎంత మాత్రం చీకటి లేదు. 6 ఒకవేళ మనం ఆయనతో సహవాసం కలిగి ఉన్నామని చెప్తూ ఇంకా చీకటిలోనే నడిస్తే మనం అబద్ధం చెప్పినట్లే, సత్యంలో జీవించడం లేదు. 7 అయితే, ఆయన వెలుగులో ఉన్నట్లు మనం వెలుగులోనే నడుస్తున్నట్లయితే, మనం ఒకరితో ఒకరం సహవాసం కలిగి ఉంటాము. ఆయన కుమారుడైన, యేసు రక్తం పాపాలన్నిటి నుండి మనల్ని శుద్ధి చేస్తుంది.
8 ఒకవేళ మనలో ఏ పాపం లేదని చెప్పుకుంటే మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం, మనలో సత్యం లేదు. 9 ఒకవేళ మనం మన పాపాలు ఒప్పుకుంటే, ఆయన నమ్మదగినవాడు నీతిమంతుడు కాబట్టి ఆయన మన పాపాలను క్షమిస్తారు, అన్యాయమంతటి నుండి మనల్ని శుద్ధి చేస్తారు. 10 మనం పాపం చేయలేదని చెప్పుకుంటే, మనం ఆయనను అబద్ధికుని చేస్తాము; మనలో ఆయన వాక్యం లేదు.