11
1 రెహబాము యెరూషలేము చేరుకొని యూదా బెన్యామీను గోత్రాల వారినందరిని, అనగా 1,80,000 మంది ఉత్తములైన సైనికులను పోగుచేసుకుని, ఇశ్రాయేలు మీద యుద్ధం చేసి, రెహబాముకు రాజ్యాన్ని తిరిగి సంపాదించాలని అనుకున్నాడు.
2 అయితే దైవజనుడైన షెమయాకు యెహోవా నుండి ఈ వాక్కు వచ్చింది: 3 “సొలొమోను కుమారుడును యూదా రాజైన రెహబాముతో, యూదా బెన్యామీనులో ఉన్న ఇశ్రాయేలీయులందరితో చెప్పు, 4 ‘యెహోవా చెప్పే మాట ఇదే: మీరు మీ తోటి ఇశ్రాయేలీయులతో యుద్ధానికి వెళ్లకండి. ఇది నేను చేస్తున్నది కాబట్టి మీరంతా ఇళ్ళకు వెళ్లండి.’ ” కాబట్టి వారు యెహోవా మాటలు విని, యరొబాముతో యుద్ధానికి వెళ్లడం మాని తిరిగి వెళ్లారు.
యూదాను బలపరచిన రెహబాము
5 రెహబాము యెరూషలేములో నివాసముండి యూదాలో రక్షణ కోసం ఈ పట్టణాలను కట్టించాడు: 6 బేత్లెహేము, ఏతాము, తెకోవా, 7 బేత్-సూరు, శోకో, అదుల్లాము, 8 గాతు, మరేషా, జీఫు, 9 అదోరయాము, లాకీషు, అజేకా, 10 జోరహు, అయ్యాలోను, హెబ్రోను. ఇవన్నీ యూదా, బెన్యామీనులో కోటగోడలు గల పట్టణాలు ఉన్నాయి. 11 అతడు వాటి కోటగోడలను బలంగా చేసి, వాటిలో అధిపతులను ఉంచాడు. వారికి ఆహారపదార్థాలు, నూనె, ద్రాక్షరసం సరఫరాచేశాడు. 12 ఆ పట్టణాల్లో డాళ్లను, ఈటెలను ఉంచి వాటిని చాలా బలమైన పట్టణాలుగా చేశాడు. ఈ విధంగా యూదా, బెన్యామీను వారంతా అతని వశంలో ఉండిపోయాయి.
13 ఇశ్రాయేలీయుల మధ్య నివసిస్తున్న యాజకులు లేవీయులు తమ ప్రాంతాలన్నిటి నుండి వచ్చి రెహబాము దగ్గరకు చేరారు. 14-15 యరొబాము, అతని కుమారులు లేవీయులను యెహోవా యాజకులుగా ఉండకుండా తిరస్కరించి, అతడు క్షేత్రాలకు మేక దూడ విగ్రహాలకు తన సొంత పూజారులను నియమించినప్పుడు, లేవీయులు తమ పచ్చికబయళ్లను, ఆస్తిని కూడా విడిచిపెట్టి యూదాకు యెరూషలేముకు వచ్చారు. 16 ఇలా ఉండగా, ఇశ్రాయేలులోని అన్ని గోత్రాల్లో ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను వెదకడానికి తమ హృదయాల్లో నిర్ణయించుకున్న వారు తమ పూర్వికుల దేవుడైన యెహోవాకు బలులు అర్పించడానికి యెరూషలేముకు వెళ్తున్న లేవీయులను వెంబడించారు. 17 వారు యూదా రాజ్యాన్ని బలపరిచారు; ఈ సమయంలో వారు దావీదు సొలొమోనుల మార్గాలను అనుసరించి మూడు సంవత్సరాలు సొలొమోను కుమారుడైన రెహబాముకు మద్ధతు ఇచ్చారు.
రెహబాము కుటుంబం
18 రెహబాము దావీదు కుమారుడైన యెరీమోతు కుమార్తెయైన మహలతును పెళ్ళి చేసుకున్నాడు. ఆమె తల్లి యెష్షయి కుమారుడు ఏలీయాబు కుమార్తెయైన అబీహయిలు. 19 రెహబాముకు యూషు, షెమర్యా, జహము అనే కుమారులు పుట్టారు. 20 ఆ తర్వాత అతడు అబ్షాలోము కుమార్తె మయకాను పెళ్ళి చేసుకున్నాడు. ఆమె ద్వారా అతనికి అబీయా, అత్తయి, జీజా, షెలోమీతు పుట్టారు. 21 రెహబాముకు పద్దెనిమిది మంది భార్యలు, అరవైమంది ఉంపుడుగత్తెలు ఉన్నారు. ఇరవై ఎనిమిది మంది కుమారులు, అరవైమంది కుమార్తెలు పుట్టారు. తన భార్యలందరిలో, ఉంపుడుగత్తెలందరిలో అబ్షాలోము కుమార్తె మయకా అంటే రెహబాముకు ఎక్కువ ప్రేమ.
22 మయకా కుమారుడైన అబీయాను రాజుగా చేయాలనుకొని, రెహబాము అతన్ని తన సోదరులపైన ప్రముఖునిగా నాయకునిగా నియమించాడు. 23 రెహబాము వివేకంతో ప్రవర్తిస్తూ, తక్కిన తన కుమారులను యూదాలో, బెన్యామీనులో వేరు ప్రాంతాలకు, కోటగోడలు గల పట్టణాలకు పంపాడు. వారికి విస్తారమైన ధనం ఇచ్చి వారికి అనేక పెళ్ళిళ్ళు చేశాడు.