27
యూదా రాజైన యోతాము
1 యోతాము రాజైనప్పుడు అతని వయస్సు ఇరవై అయిదు సంవత్సరాలు. అతడు యెరూషలేములో పదహారు సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి పేరు యెరూష. ఆమె సాదోకు కుమార్తె. 2 అతడు తన తండ్రి ఉజ్జియా చేసినట్లే యెహోవా దృష్టిలో సరియైనది చేశాడు, కానీ అతనిలా యెహోవా మందిరంలోకి ప్రవేశించలేదు. ప్రజలు మాత్రం తమ అవినీతి అక్రమాలను కొనసాగించారు. 3 యోతాము యెహోవా ఆలయానికి పై ద్వారాన్ని తిరిగి కట్టించాడు. ఓఫెలు కొండ దగ్గర గోడను చాలా వరకు కట్టించాడు. 4 అతడు యూదా కొండ ప్రాంతంలో పట్టణాలు అడవుల్లో కోటలు బురుజులు నిర్మించాడు.
5 యోతాము అమ్మోనీయుల రాజుతో యుద్ధం చేసి వారిని జయించాడు. ఆ సంవత్సరం అమ్మోనీయులు అతనికి నూరు తలాంతుల*అంటే, సుమారు 3 3/4 టన్నులు వెండి, పదివేల కోరుల†అంటే, సుమారు 1,800 టన్నులు గోధుమలు, పదివేల కోరుల‡అంటే, సుమారు 1,500 టన్నులు యవలు చెల్లించారు. అమ్మోనీయులు రెండవ మూడవ సంవత్సరాల్లో కూడా అదే మొత్తాన్ని అతనికి తీసుకువచ్చారు.
6 యోతాము తన దేవుడు యెహోవా దృష్టిలో యధార్థంగా ప్రవర్తించినందుచేత అతడు బలాభివృద్ధి చెందాడు.
7 యోతాము పరిపాలనకు సంబంధించిన ఇతర విషయాలు అతడు చేసిన యుద్ధాలన్నీ, అతడు చేసిన ఇతర కార్యాలన్ని ఇశ్రాయేలు, యూదారాజు చర్రిత గ్రంథంలో వ్రాసి ఉన్నాయి. 8 అతడు రాజైనప్పుడు అతని వయస్సు ఇరవై అయిదు సంవత్సరాలు. అతడు యెరూషలేములో పదహారు సంవత్సరాలు పరిపాలించాడు. 9 యోతాము చనిపోయి అతని పూర్వికుల దగ్గరకు చేరాడు. ప్రజలు దావీదు పట్టణంలో అతన్ని సమాధి చేశారు. అతని తర్వాత అతని కుమారుడైన ఆహాజు రాజయ్యాడు.