3
1 మమ్మల్ని మేమే మరల మెచ్చుకోవడం ప్రారంభించామా? లేదా ఇతరుల్లా మీకు గాని మీ దగ్గరి నుండి గాని మాకు సిఫారసు పత్రికలు అవసరమా? 2 మా హృదయాల మీద వ్రాయబడి, మనుష్యులందరు తెలుసుకుని చదవాల్సిన మా పత్రిక మీరే. 3 రాతి పలక మీద గాని సిరాతో గాని వ్రాయక మానవ హృదయాలు అనే పలకల మీద జీవంగల దేవుని ఆత్మ ద్వారా వ్రాయబడిన క్రీస్తు పత్రిక మీరేనని, మా పరిచర్య ఫలితం మీరేనని మీరు తెలియపరుస్తున్నారు.
4 ఇలాంటి నమ్మకం క్రీస్తు ద్వారా దేవునిపై మాకుంది. 5 మేము ఈ పనిని సాధించగలమని చెప్పుకోడానికి మేము సమర్థులమని కాదు, మాలో ఉన్న సామర్థ్యం దేవుని నుండి వచ్చింది. 6 వ్రాతపూర్వకమైన నియమాలను కాక, ఆత్మతో కూడిన క్రొత్త నిబంధనను సేవించగల సామర్ధ్యాన్ని ఆయనే మాకు ఇచ్చారు. అక్షరం చంపుతుంది కాని ఆత్మ జీవం ఇస్తాడు.
క్రొత్త నిబంధన యొక్క గొప్ప మహిమ
7 మరణాన్ని తెచ్చే పరిచర్య రాళ్లమీద అక్షరాలలో చెక్కబడినా, అది మహిమతో వచ్చింది. మోషే ముఖంపై ప్రకాశించిన మహిమ శాశ్వతమైనది కాకపోయినా ఇశ్రాయేలీయులు దాన్ని నేరుగా చూడలేకపోయారు. 8 అయితే ఆత్మ సంబంధమైన పరిచర్య మరి ఎంత మహిమకరంగా ఉంటుంది? 9 శిక్షను తెచ్చే పరిచర్య మహిమ కలిగి ఉంటే, నీతిమంతులుగా చేసే పరిచర్య ఇంకా ఎంత అధిక మహిమ కలిగి ఉంటుందో! 10 అందుకే, ఇప్పటి అత్యున్నతమైన మహిమతో పోల్చినప్పుడు ఇప్పటివరకు మహిమకరంగా ఉన్నవేవి మహిమగా ఉండవు. 11 ఎందుకంటే, గతించిపోయే దానిలోనే మహిమ ఉంటే, ఎల్లప్పుడు నిలిచి ఉండే దానిలో ఇంకెంత మహిమ ఉంటుందో కదా!
12 కాబట్టి, మాకు ఇలాంటి నిరీక్షణ ఉంది, అందుకే మేము ఇంత ధైర్యంతో ఉన్నాము. 13 మేము మోషేలాంటి వారం కాదు, తరిగిపోతున్న దాని అంతాన్ని ఇశ్రాయేలు ప్రజలు చూడకుండ మోషే తన ముఖం మీద ముసుగు వేసుకున్నాడు. 14 నిజానికి వారి మనస్సులు మొద్దుబారాయి, పాత నిబంధన చదువుతున్నపుడు ఈనాటికీ వారి మనస్సులకు ఆ ముసుగు అలాగే ఉంది. అది తీసివేయబడలేదు ఎందుకంటే కేవలం క్రీస్తులో మాత్రమే అది తీసివేయబడుతుంది. 15 నేటికీ వారు మోషే ధర్మశాస్త్రాన్ని చదివేటప్పుడు, వారి హృదయాల మీద ముసుగు ఉంది. 16 కాని ఎవరైనా ప్రభువు వైపుకు తిరిగితే ఆ ముసుగు తీసివేయబడుతుంది. 17 ఇప్పుడు ప్రభువే ఆత్మ. ప్రభువు ఆత్మ ఎక్కడ ఉన్నాడో అక్కడ స్వాతంత్ర్యం ఉంటుంది. 18 కాబట్టి ముసుగు తొలగిన ముఖాలతో ఆత్మయైన ప్రభువు నుండి వచ్చే ఆయన మహిమను ప్రతిబింబిస్తూ, అంతకంతకు అధికమయ్యే ఆయన మహిమ రూపంలోనికి మనమందరం మార్చబడుతున్నాము.