11
పౌలు, అబద్ధ అపొస్తలులు
1 నేను కొంత అవివేకంగా మాట్లాడినా మీరు సహించాలని ఆశిస్తున్నాను. అవును, దయచేసి నన్ను సహించండి! 2 దైవికమైన ఆసక్తిని మీ పట్ల నేను కలిగి ఉన్నాను. ఎందుకంటే, మిమ్మల్ని నేను క్రీస్తు అనే ఏకైక భర్తకు ప్రధానం చేశాను, కాబట్టి పవిత్రమైన కన్యగా మిమ్మల్ని ఆయనకు అప్పగించాలి. 3 అయితే, సర్పం తన కుయుక్తితో హవ్వను మోసగించినట్లు క్రీస్తులో మీకున్న నిజాయితీ, పవిత్రత నుండి ఏదో ఒక విధంగా మీ మనస్సులు తొలగిపోతాయేమోనని నేను భయపడుతున్నాను. 4 ఎవరైనా మీ దగ్గరకు వచ్చి మేము ప్రకటించిన యేసును గాక వేరొక యేసును ప్రకటించినా, లేదా మీరు పొందిన ఆత్మకు విరుద్ధమైన వేరొక ఆత్మను మీరు పొందినా, లేదా మీరు అంగీకరించింది కాకుండా వేరొక సువార్తను అంగీకరించినా మీరు సుళువుగానే సహిస్తున్నారు.
5 “ఈ గొప్ప అపొస్తలుల”*లేదా అత్యంత ప్రముఖులైన అపొస్తలులు కంటే నేను ఏమాత్రం తక్కువ కాదని నేను అనుకుంటున్నాను. 6 మాట్లాడడంలో నాకు నేర్పు లేకపోవచ్చు కాని జ్ఞానంలో కాదు. అన్ని విధాలుగా మేము దీన్ని మీకు పూర్తిగా స్పష్టం చేశాము. 7 దేవుని సువార్తను మీకు ఉచితంగా బోధించి, మిమ్మల్ని గొప్పవారిని చేయడానికి నన్ను నేను తగ్గించుకొని పాపం చేశానా? 8 మీకు నేను సేవ చేయడానికి ఇతర సంఘాల నుండి సహాయం పొంది వారిని దోచుకున్నాను. 9 అంతేకాక నేను మీతో ఉన్నప్పుడు నాకు సహాయం అవసరమైతే నేను ఎవరికి భారంగా లేను, ఎందుకంటే, మాసిదోనియా నుండి వచ్చిన సహోదరులే నాకు అవసరమైనవన్నీ అందించారు. నేను మీకు భారం కాకుండా ఎలా ఉన్నానో ఇకముందు కూడా అలాగే ఉంటాను. 10 నాలో క్రీస్తు సత్యం ఉన్నందుకు, అకాయ ప్రాంతాల్లో నేనిలా గర్వపడకుండ ఎవరు ఆపలేరు. 11 ఎందుకు? మీపై నాకు ప్రేమ లేదా? ఉందని దేవునికి తెలుసు!
12 గర్వించడానికి కారణం వెదికేవారు తాము గర్వించే వాటిలో మాతో సమానంగా ఉన్నామని వారు ఎంచుకోవడానికి అవకాశం లేకుండా చేయడానికి ఇప్పుడు నేను ఏమి చేస్తున్నానో అదే చేయడం కొనసాగిస్తాను. 13 అలాంటివారు అబద్ధ అపొస్తలులు, మోసపూరితమైన పనివారు, క్రీస్తు అపొస్తలుల్లా వేషం వేసుకున్నవారు. 14 ఇందులో ఆశ్చర్యం ఏమి లేదు, సాతాను కూడా వెలుగు దూత వేషం వేసుకున్నాడు. 15 కాబట్టి వాని సేవకులు కూడా నీతి సేవకుల్లా మారువేషం వేసుకోవడంలో వింత లేదు. వారి క్రియలకు తగిన అంతం వారికి ఉంటుంది.
పౌలు తన శ్రమల గురించి గొప్ప చెప్పుకోవడం
16 నేను అవివేకినని ఎవరు అనుకోవద్దని మరల చెప్తున్నాను; ఒకవేళ మీరు అలా భావిస్తే అవివేకంగానైనా మీరు నన్ను చేర్చుకోండి అప్పుడు నేను కొంచెం గొప్ప చెప్పుకుంటాను. 17 ఆత్మవిశ్వాసం బట్టి గొప్ప చెప్పడంలో నేను ప్రభువులా మాట్లాడడం లేదు కాని అవివేకిగానే మాట్లాడుతున్నాను. 18 ఈ లోకరీతిగా అనేకమంది గొప్ప చెప్పుకుంటున్నారు కాబట్టి నేను కూడా గొప్ప చెప్పుకుంటాను. 19 మీరు ఎంతో వివేకవంతులు కాబట్టి అవివేకులను కూడ సంతోషంగా సహిస్తారు. 20 నిజానికి, మిమ్మల్ని ఎవరైనా బానిసలుగా చేసినా, మోసం చేసినా, లేదా మిమ్మల్ని చిక్కుల్లో ఇరికించినా, మిమ్మల్ని ముఖంపై కొట్టినా మీరు సహిస్తారు. 21 ఆ విషయంలో మేమెంతో బలహీనులమని నేను సిగ్గుతో ఒప్పుకుంటున్నాను.
అయితే ఎవరైనా దేని గురించైనా గొప్పలు చెప్పుకోడానికి ధైర్యం చేస్తే దాని గురించి నేను కూడా గొప్పలు చెప్పుకోడానికి ధైర్యం చేస్తాను, నేను అవివేకిగా మాట్లాడుతున్నాను. 22 వారు హెబ్రీయులా? నేను కూడా. వారు ఇశ్రాయేలీయులా? నేను కూడా. వారు అబ్రాహాము సంతతి వారా? నేను కూడా. 23 వారు క్రీస్తు సేవకులా? నేను మతిలేనివానిలా మాట్లాడుతున్నాను, నేను వారికంటే ఎక్కువ. నేను ఎంతో కష్టపడి పని చేశాను. ఎక్కువసార్లు నేను చెరసాలలో ఉన్నాను, చాలా తీవ్రంగా కొరడా దెబ్బలు తిన్నాను, అనేకసార్లు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాను. 24 యూదులచేత అయిదు సార్లు ఒకటి తక్కువ నలభై కొరడా దెబ్బలు తిన్నాను. 25 మూడుసార్లు బెత్తాలతో కొట్టబడ్డాను, ఒకసారి రాళ్లతో కొట్టబడ్డాను, మూడుసార్లు ఓడ పగిలి శ్రమపడ్డాను. ఒక రాత్రింబగళ్ళు సముద్రంలో గడిపాను. 26 తరచుగా ప్రయాణాలు చేస్తున్నాను. నదుల వల్ల ఆపదలు, దొంగల వల్ల ఆపదలు, తోటి యూదుల వల్ల ఆపదలు, యూదేతరుల వల్ల ఆపదలు, పట్టణాల్లో, అడవుల్లో, సముద్రాల మీద ఆపదల్లో పడ్డాను; ఇంకా కపట సహోదరుల వల్ల ఆపదల్లో ఉన్నాను. 27 నేను ప్రయాసపడ్డాను కష్టపడ్డాను, తరచూ నిద్ర లేకుండా ఉండేవాన్ని; ఆకలి దాహం నాకు తెలుసు, అనేకసార్లు ఆహారం లేకుండా ఉన్నాను; చలితో, వస్త్రాలు లేకుండా ఉన్నాను. 28 అన్నిటికంటే మించి సంఘాలన్నిటి గురించిన చింత అనుదినం నాకు కలుగుతుంది. 29 ఎవరైనా బలహీనంగా ఉంటే, నేను బలహీనంగా ఉండనా? ఎవరైనా పాపంలో నడిస్తే, నా హృదయం మండదా?
30 ఒకవేళ నేను గర్వించాలంటే, నా బలహీనతలను చూపించే వాటిలోనే గర్విస్తాను. 31 ఎల్లప్పుడు స్తుతించబడే యేసు ప్రభువుకు తండ్రియైన దేవునికి నేను అబద్ధమాడనని తెలుసు. 32 దమస్కులో అరెత అనే రాజు క్రింది అధిపతి నన్ను బంధించడానికి పట్టణం చుట్టూ కాపలా ఉంచాడు. 33 కాని నేను కిటికీ గుండా గోడ పైనుండి ఒక గంపలో క్రిందకు దించబడి, వాని చేతుల్లో నుండి తప్పించుకున్నాను.