20
హిజ్కియా అస్వస్థత
ఆ రోజుల్లో హిజ్కియాకు జబ్బుచేసి మరణానికి దగ్గరలో ఉన్నాడు. ఆమోజు కుమారుడైన యెషయా ప్రవక్త అతని దగ్గరకు వెళ్లి, “యెహోవా చెప్పే మాట ఇదే: నీవు చనిపోబోతున్నావు; నీవు కోలుకోవు, కాబట్టి నీ ఇంటిని చక్కబెట్టుకో” అన్నాడు.
హిజ్కియా తన ముఖాన్ని గోడవైపు త్రిప్పుకుని యెహోవాకు ఇలా ప్రార్థన చేశాడు, “యెహోవా, నేను నమ్మకంగా, యథార్థ హృదయంతో మీ సన్నిధిలో ఎలా నడుచుకున్నానో, మీ దృష్టిలో సరియైనది ఎలా చేశానో జ్ఞాపకం చేసుకోండి.” హిజ్కియా భారంగా ఏడ్చాడు.
యెషయా మధ్య ప్రాంగణం విడిచి వెళ్లకముందే యెహోవా వాక్కు అతనికి వచ్చింది: “నీవు వెనుకకు తిరిగివెళ్లి నా ప్రజల అధిపతియైన హిజ్కియాకు ఇలా చెప్పు, ‘నీ పూర్వికుడైన దావీదు దేవుడైన యెహోవా చెప్పే మాట ఇదే: నేను నీ ప్రార్థన విని నీ కన్నీరు చూశాను; నేను నిన్ను స్వస్థపరుస్తాను. మూడవ రోజున నీవు యెహోవా ఆలయానికి వెళ్తావు. నీ జీవితంలో ఇంకా పదిహేను సంవత్సరాల ఆయుష్షు పెంచుతాను. అంతేకాక, నిన్ను, ఈ పట్టణాన్ని, అష్షూరు రాజు చేతి నుండి రక్షిస్తాను. నా కోసం, నా సేవకుడైన దావీదు కోసం నేను ఈ పట్టణాన్ని కాపాడతాను.’ ”
తర్వాత యెషయా, “అంజూర పండ్ల ముద్ద తయారుచేయండి” అని చెప్పగా వారు దానిని తెచ్చి ఆ పుండుకు రాసారు. హిజ్కియా కోలుకున్నాడు.
హిజ్కియా యెషయాను, “యెహోవా నన్ను బాగు చేస్తారని, మూడవ రోజు నేను యెహోవా ఆలయానికి వెళ్తాను అనడానికి గుర్తు ఏంటి?” అని అడిగాడు.
అందుకు యెషయా, “యెహోవా చెప్పిన మాట నెరవేరుస్తారని ఆయన నీకు ఇచ్చిన సూచన ఇదే: గడియారం మీద నీడ పది అంకెలు ఇప్పుడు ముందుకు వెళ్లాలా లేదా వెనుకకు వెళ్లాలా?” అన్నాడు.
10 హిజ్కియా, “నీడ పది అంకెలు ముందుకు వెళ్లడం సులభమే. కాబట్టి నీడ పది అంకెలు వెనుకకు వెళ్లునట్లు చేయండి” అన్నాడు.
11 అప్పుడు యెషయా ప్రవక్త యెహోవాకు ప్రార్ధించాడు. ఆహాజు చేయించిన గడియారపు పలక మీద నీడ పది అంకెలు వెనుకకు పోయేటట్టు యెహోవా చేశారు.
బబులోను నుండి రాయబారులు
12 ఆ కాలంలో బలదాను కుమారుడును బబులోనుకు రాజును అయిన మర్దూక్-బలదాను హిజ్కియాకు జబ్బుచేసిందని విని ఉత్తరాలు, కానుక అతనికి పంపాడు. 13 హిజ్కియా రాయబారులను ఆహ్వానించి, వారికి తన భవనంలో ఉన్న ఖజానాలోని వెండి, బంగారం, సుగంధద్రవ్యాలు, ఒలీవనూనెతో సహా ఆయుధాలు, ధనాగారాలలో ఉన్నవన్నీ వారికి చూపించాడు. తన భవనంలో గాని, రాజ్యమంతట్లో గాని హిజ్కియా వారికి చూపించనిదేది లేదు.
14 తర్వాత రాజైన హిజ్కియా దగ్గరకు ప్రవక్తయైన యెషయా వెళ్లి, “ఆ మనుష్యులు ఏమి చెప్పారు? ఎక్కడి నుండి నీ దగ్గరకు వచ్చారు?” అని అడిగాడు.
అందుకు హిజ్కియా, “వారు బబులోను అనే దూరదేశం నుండి వచ్చారు” అని జవాబిచ్చాడు.
15 “నీ భవనంలో వారు ఏమేమి చూశారు?” అని ప్రవక్త అడిగాడు.
హిజ్కియా, “నా భవనంలో ఉన్నవన్నీ చూశారు. నా ధనాగారంలో ఏదీ మరుగు చేయక అన్నీ వారికి చూపించాను” అన్నాడు.
16 అప్పుడు యెషయా హిజ్కియాతో, “యెహోవా వాక్కు విను: 17 ఒక సమయం రాబోతుంది, నీ భవనంలో ఉన్నవన్నీ ఈనాటి వరకు మీ పూర్వికుల కూడబెట్టినవన్నీ బబులోనుకు తీసుకెళ్తారు. ఇక్కడ ఏమీ మిగలదని యెహోవా చెప్తున్నారు. 18 నీకు పుట్టబోయే నీ సంతానంలో కొంతమంది బబులోనుకు కొనిపోబడి బబులోను రాజు యొక్క రాజభవనంలో నపుంసకలుగా అవుతారు.”
19 హిజ్కియా యెషయాతో, “నీవు చెప్పిన యెహోవా వాక్కు మంచిదే” అని అన్నాడు. ఎందుకంటే అతడు, “నా జీవితకాలంలో సమాధానం సత్యం ఉంటాయి కదా” అని అనుకున్నాడు.
20 హిజ్కియా పరిపాలనకు సంబంధించిన ఇతర విషయాలు, అతడు సాధించినవన్నీ, అతడు కొలను త్రవ్వించి, కాలువ కట్టించి, నీటిని పట్టణానికి సరఫరా చేసిన సంగతి యూదా రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడలేదా? 21 హిజ్కియా చనిపోయి తన పూర్వికుల దగ్గరకు చేరాడు. అతని తర్వాత అతని కుమారుడు మనష్షే రాజయ్యాడు.