3
పేతురు, యోహానులు కుంటి బిక్షగాడిని స్వస్థపరచుట 
  1 ఒక రోజు పేతురు యోహానులు మధ్యాహ్నం మూడు గంటల వేళలో ప్రార్థన సమయానికి దేవాలయానికి వెళ్తున్నారు.   2 సుందరమని పిలువబడే ఆ దేవాలయ గుమ్మం దగ్గర కూర్చుని, ఆవరణంలోనికి వచ్చేవారి దగ్గర భిక్షం అడుక్కోడానికి పుట్టుకతోనే కుంటివాడైన ఒకనిని ప్రతిరోజు కొంతమంది మోసుకొచ్చేవారు.   3 పేతురు యోహానులు ఆ దేవాలయ ఆవరణంలోనికి ప్రవేశిస్తుండగా వాడు చూసి భిక్షమడిగాడు.   4 యోహాను చేసినట్టుగానే, పేతురు వానివైపు సూటిగా చూసి, వానితో, “మా వైపు చూడు!” అన్నాడు.   5 వాడు వారి దగ్గర ఏమైన దొరుకుతుందేమోనని ఆశిస్తూ, వారివైపు దీక్షగా చూశాడు.   
 6 అప్పుడు పేతురు వానితో, “వెండి బంగారాలు నా దగ్గర లేవు గాని, నా దగ్గర ఉన్నదే నీకు ఇస్తున్నాను, నజరేయుడైన యేసు క్రీస్తు పేరట లేచి నడువు” అని చెప్పి,   7 వాని కుడిచేయి పట్టుకుని లేపాడు. వెంటనే వాని పాదాలు, చీలమండలాలు బలం పొందుకున్నాయి.   8 వాడు లేచి ఎగిరి తన కాళ్లపై నిలబడి నడవడం మొదలుపెట్టాడు. తర్వాత వాడు నడుస్తూ, గంతులు వేస్తూ, దేవుని స్తుతిస్తూ వారితో పాటు దేవాలయ ఆవరణంలోనికి వెళ్లాడు.   9 ప్రజలందరు అతడు నడుస్తూ దేవుని స్తుతిస్తున్నాడని చూసి,   10 సుందరమని పిలువబడే ఆ దేవాలయ గుమ్మం దగ్గర కూర్చుని భిక్షమడిగేవాడు వీడే అని గుర్తించి, వానికి జరిగిన దానిని బట్టి విస్మయం చెంది ఆశ్చర్యపడ్డారు.   
చూస్తున్నవారితో పేతురు మాట్లాడడం 
  11 స్వస్థత పొందినవాడు పేతురు యోహానులతో ఉండగా, ప్రజలందరు ఆశ్చర్యపడి, సొలొమోను మండపం అని పిలువబడే చోటికి గుంపులుగా పరుగెత్తుకొని వచ్చారు.   12 అది చూసిన పేతురు వారితో ఈ విధంగా చెప్పాడు: “తోటి ఇశ్రాయేలీయులారా, జరిగింది చూసి ఎందుకు ఆశ్చర్యపడుతున్నారు? మేమేదో మా స్వశక్తితోనో లేదా మా భక్తితోనో వీడిని నడిచేలా చేసినట్లు మీరు మా వైపే తదేకంగా చూస్తున్నారేమిటి?   13 మన పితరులైన అబ్రాహాము ఇస్సాకు యాకోబు దేవుడు, అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచారు. మీరు ఆయనను చంపబడటానికి అప్పగించారు, పిలాతు ఆయనను విడుదల చేయాలని నిర్ణయించుకున్నా, మీరు అతని ముందు క్రీస్తును తిరస్కరించారు.   14 మీరు పరిశుద్ధుడు, నీతిమంతుడైన వానిని తిరస్కరించి నరహంతుకుడిని మీ కోసం విడుదల చేయమని అడిగారు.   15 మీరు జీవాధిపతిని చంపారు, కాని దేవుడు ఆయనను మరణం నుండి సజీవునిగా లేపారు. దానికి మేమే సాక్షులము.   16 యేసు నామంలోని విశ్వాసం చేత, మీరు చూసిన మీకు తెలిసిన ఇతడు బలపరచబడ్డాడు. మీరందరు చూస్తునట్లే ఇది యేసు పేరట ఆయన ద్వార కలిగే విశ్వాసమే, ఇతన్ని పూర్తిగా స్వస్థపరచింది.   
 17 “అయితే, నా తోటి సహోదరులారా, మీ నాయకుల వలె మీరు కూడా అజ్ఞానంతో చేశారని నాకు తెలుసు.   18 అయితే దేవుడు తన క్రీస్తు తప్పక హింసించబడతాడని ప్రవక్తలందరి ద్వారా ముందుగానే తెలియపరచిన దానిని దేవుడు ఈ విధంగా నెరవేర్చారు.   19 పశ్చాత్తాపపడి దేవుని వైపుకు తిరగండి, అప్పుడు మీ పాపాలు తుడిచివేయబడి, ప్రభువు దగ్గర నుండి విశ్రాంతి కాలాలు రావచ్చు.   20 మీ కోసం నియమించిన క్రీస్తును అనగా యేసును ఆయన పంపవచ్చు.   21 దేవుడు తన పరిశుద్ధ ప్రవక్తల ద్వారా ముందే వాగ్దానం చేసినట్లుగా, దేవుడు సమస్తాన్ని పునరుద్ధరించడానికి సమయం వచ్చేవరకు, పరలోకం ఆయనను చేర్చుకోవల్సిందే.   22 అందుకే మోషే, ‘మీ దేవుడైన ప్రభువు నా లాంటి ప్రవక్తను మీలో నుండి మీ కోసం లేవనెత్తుతాడు, ఆయన మీతో చెప్పేవాటన్నిటిని మీరు ఖచ్చితంగా వినాలి.   23 ఎవరైనా ప్రవక్త చెప్పే మాటలకు స్పందించకపోతే వారు తమ ప్రజల నుండి పూర్తిగా తొలగించబడాలి’*ద్వితీ 18:15,18,19 అని చెప్పాడు.   
 24 “నిజానికి సమూయేలు మొదలుకొని ప్రవక్తలందరు ఈ రోజుల గురించి ముందే ప్రవచించారు.   25 మీరు ప్రవక్తలకు మీ పితరులతో దేవుడు చేసిన నిబంధనకు వారసులు. దేవుడు అబ్రాహాముతో, ‘నీ సంతానం ద్వారా భూమిపై ఉన్న ప్రజలందరు ఆశీర్వదించబడతారు’†ఆది 22:18; 26:4 అని వాగ్దానం చేశారు.   26 దేవుడు తన సేవకుని లేపినప్పుడు, మీలో అందరిని దుష్ట మార్గాల నుండి తప్పించి మిమ్మల్ని దీవించడానికి ఆయనను మొదట మీ దగ్గరకు పంపించారు.”