15
అపొస్తలులు, సంఘపెద్దలు కలిసి యెరూషలేములో తీసుకున్న నిర్ణయాలు
1 కొందరు యూదయ ప్రాంతం నుండి అంతియొకయ ప్రాంతానికి వచ్చి విశ్వాసులతో: “మోషే నియమించిన ఆచార ప్రకారం సున్నతి పొందితేనే తప్ప రక్షణ లేదు” అని బోధించారు. 2 ఇది పౌలు బర్నబాల మధ్య తీవ్రమైన తర్కానికి దారి తీసింది. కాబట్టి వారు, మరికొందరు విశ్వాసులతో కలిసి ఈ ప్రశ్న విషయమై యెరూషలేములోని అపొస్తలులను, సంఘ పెద్దలను కలుసుకోడానికి వెళ్లాలని నిర్ణయించారు. 3 కాబట్టి సంఘస్థులు వారిని పంపినప్పుడు, వారు ఫేనీకే సమరయ ప్రాంతాల ద్వారా వెళ్తూ, యూదేతరులు ఎలా దేవుని వైపు తిరిగారో చెప్పినప్పుడు విశ్వాసులందరు చాలా ఆనందించారు. 4 వారు యెరూషలేము చేరుకొన్నప్పుడు, సంఘస్థులు అపొస్తలులు సంఘపెద్దలు వారిని చేర్చుకున్నారు. అక్కడ ఉన్నవారందరికి దేవుడు తమ ద్వారా జరిగించిన వాటన్నిటిని వివరించారు.
5 అప్పుడు కొందరు పరిసయ్యుల తెగలోని విశ్వాసులు లేచి, “యూదేతరులు తప్పనిసరిగా మోషే ధర్మశాస్త్రాన్ని పాటించాలి, సున్నతి చేయించుకోవాలి” అని వారికి చెప్పారు.
6 కాబట్టి ఈ ప్రశ్నను గురించి చర్చించడానికి అపొస్తలులు సంఘపెద్దలు సమావేశమయ్యారు. 7 చాలా చర్చలు జరిగిన తర్వాత పేతురు లేచి వారితో ఇట్లన్నాడు: “సహోదరులారా, కొంతకాలం క్రిందట యూదేతరులు నా నోట సువార్త సందేశం విని విశ్వసించాలని మీలో నుండి దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడని మీకు తెలుసు కదా! 8 హృదయాలను ఎరిగిన దేవుడు, ఆయన మన పట్ల చేసినట్టుగానే, వారికి కూడా పరిశుద్ధాత్మను ఇవ్వడం ద్వారా ఆయన వారిని స్వీకరించాడని నిరూపించారు. 9 దేవుడు మనకు వారికి మధ్య ఏ భేదం చూపించకుండ వారి హృదయాలను విశ్వాసంతో పవిత్రపరచారు. 10 కాబట్టి ఇప్పుడు, మన పితరులు కానీ మనం కానీ మోయలేని కాడిని యూదేతరులలో నుండి వచ్చిన విశ్వాసుల మెడ మీద పెట్టి దేవుని శోధించవచ్చా? అలా చేయకూడదు! 11 వారు రక్షణ పొందినట్లే, ప్రభువైన యేసు కృప చేతనే మనం కూడా రక్షణ పొందుకుంటున్నామని నమ్ముతున్నాం కదా.”
12 బర్నబా పౌలు తమ ద్వారా దేవుడు యూదేతరుల మధ్యలో చేసిన అద్భుతాలను సూచకక్రియలను ఆ సభలో వివరిస్తున్నప్పుడు అక్కడ చేరిన వారందరు శ్రద్ధతో నిశ్శబ్దంగా విన్నారు. 13 వారు చెప్పడం ముగించిన తర్వాత, యాకోబు లేచి ఈ విధంగా చెప్పాడు: “సహోదరులారా, నా మాట వినండి. 14 యూదేతరులలో నుండి దేవుడు తన నామము కోసం ప్రజలను ఏర్పరచుకోడానికి తానే మొదట ఎలా జోక్యం చేసుకున్నాడో సీమోను వివరించాడు. 15 దీనిని గురించి ప్రవక్తల మాటలు కూడా ఏకీభవిస్తున్నాయి, ఎలాగంటే:
16 “ ‘ఆ తర్వాత నేను తిరిగివచ్చి,
పడిపోయిన దావీదు గుడారాన్ని తిరిగి కడతాను.
దాని శిథిలాలను తిరిగి నిర్మిస్తాను,
దానిని పునరుద్ధరిస్తాను,
17 అప్పుడు మిగిలిన వారందరు,
నా నామం ధరించిన యూదేతరులు కూడ దేవుని వెదకేలా చేస్తాను,
అని పూర్వం నుండి తెలియచేయబడిన ఈ కార్యములను,
18 చేస్తున్న ప్రభువు చెప్తున్నాడు.’*ఆమోసు 9:11,12
19 “కాబట్టి, దేవుని వైపు తిరుగుతున్న యూదేతరులకు మనం కష్టంగా ఉండేలా చేయకూడదనేది నా తీర్పు. 20 దానికి బదులుగా, విగ్రహాలకు అర్పించి అపవిత్రపరచిన ఆహారాన్ని తినడం, లైంగిక అనైతికత సంబంధాలను, గొంతును నులిమి చంపిన జంతువుల మాంసం తినడం, రక్తాన్ని తినడం మానుకోవాలని మనం వారికి ఉత్తరం వ్రాసి తెలియచేయాలి. 21 ఎందుకంటే, మోషే ధర్మశాస్త్రాన్ని అనేక తరాల నుండే ప్రతి పట్టణంలోని సమాజమందిరాల్లో ప్రతి సబ్బాతు దినాన చదువుతూ బోధిస్తున్నారు” అని చెప్పాడు.
యూదేతర విశ్వాసులకు పంపబడిన లేఖ
22 ఆ తర్వాత అపొస్తలులు సంఘపెద్దలు సంఘమంతటితో కలిసి, పౌలు బర్నబాలతో పాటు ఇంకొందరు విశ్వాసులను అంతియొకయ ప్రాంతానికి పంపాలని నిర్ణయించి విశ్వాసుల మధ్యలో నాయకులుగా ఉన్న బర్సబ్బా అని పిలువబడే యూదా సీలను ఏర్పరచుకున్నారు. 23 వారితో ఈ ఉత్తరాన్ని పంపించారు:
అపొస్తలులు, మీ సహోదరులైన సంఘపెద్దలు,
అంతియొకయలోను, సిరియాలోను, కిలికియ ప్రాంతాల్లో నివసించే యూదేతరులలోని విశ్వాసులకు,
శుభములు.
24 మా నుండి అనుమతి పొందకుండానే మాలో నుండి కొందరు మీ దగ్గరకు వచ్చి వారు మీతో చెప్పే బోధలతో మిమ్మల్ని కలవరపరుస్తూ, మీ మనస్సులను ఇబ్బంది పెడుతున్నారని మేము విన్నాము. 25 కాబట్టి మా నుండి కొంతమందిని ఏర్పరచుకొని మా ప్రియ స్నేహితులైన బర్నబా పౌలుతో వారిని పంపడానికి మేము అందరం అంగీకరించాము. 26 మేము పంపించే ఈ ప్రియ స్నేహితులు మన ప్రభువైన యేసు క్రీస్తు పేరట తమ ప్రాణాలను కూడా లెక్కచేయని వారు. 27 మేము వ్రాసిన దానిని నోటి మాటలతో దృఢపరచడానికి యూదాను సీలను పంపిస్తున్నాము. 28 వీటి కంటే మీమీద ఎక్కువ భారం మోపకూడదని పరిశుద్ధాత్మకు, మాకు అనిపించిన విషయాలు ఏమనగా: 29 విగ్రహాలకు అర్పించిన ఆహారాన్ని తినడం, రక్తం తినడం, గొంతును నులిమి చంపిన జంతువుల మాంసం తినడం, లైంగిక అనైతికత సంబంధాలను మానుకోవాలి. వీటికి దూరంగా ఉండి జాగ్రత్త పడితే మీకు మేలు కలుగుతుంది.
మీకు క్షేమం కలుగును గాక.
30 వారు పంపబడిన తర్వాత వారు అక్కడినుండి బయలుదేరి అంతియొకయ పట్టణానికి వచ్చి, అక్కడ సంఘమంతటిని ఒక్క చోటికి చేర్చి ఈ ఉత్తరాన్ని వారికి అందించారు. 31 వారు ఆ ఉత్తరాన్ని చదివి, దానిలోని ప్రోత్సాహపరిచే సందేశాన్ని బట్టి ఎంతో సంతోషించారు. 32 యూదా, సీలలు కూడా ప్రవక్తలు కాబట్టి వారు కూడా విశ్వాసులను ప్రోత్సహించి వారిని విశ్వాసంలో బలపరిచారు. 33 అక్కడ వారు కొంతకాలం గడిపిన తర్వాత తమను పంపిన వారి దగ్గరకు తిరిగి వెళ్లడానికి విశ్వాసులచే సమాధానంతో పంపబడ్డారు. 34 అయితే సీల అక్కడే ఉండాలని నిర్ణయించుకొన్నాడు.†కొన్ని ప్రతులలో ఈ వచనాలు ఇక్కడ చేర్చబడలేదు 35 కానీ పౌలు బర్నబాలు అంతియొకయలోనే ఉండి, ఇంకా అనేకులతో కలిసి ప్రభువు సందేశాన్ని బోధిస్తూ ప్రకటించారు.
పౌలు బర్నబాల మధ్య భిన్నాభిప్రాయాలు
36 కొంతకాలం తర్వాత పౌలు, “మనం ప్రభువు వాక్యాన్ని ప్రకటించిన అన్ని పట్టణాలకు తిరిగివెళ్లి, అక్కడి విశ్వాసులను కలుసుకొని వారి క్షేమ సమాచారాలను తెలుసుకుందాం” అని బర్నబాతో అన్నాడు. 37 బర్నబా తమతో మార్కు అనబడే యోహానును తీసుకెళ్లాలని భావించాడు. 38 కాని పౌలు, పంఫులియాలో అతడు పరిచర్యకు రాకుండా తమను విడిచిపెట్టి వెళ్లిపోయాడు కాబట్టి అతన్ని తీసుకుని వెళ్లడం మంచిది కాదని తలంచాడు. 39 ఆ విషయాన్ని బట్టి వారిద్దరి మధ్య తీవ్రమైన భేదాభిప్రాయం రావడంతో వారిద్దరు వేరైపోయారు. బర్నబా మార్కును వెంటబెట్టుకొని ఓడ ఎక్కి కుప్ర ద్వీపానికి వెళ్లాడు. 40 విశ్వాసులు పౌలును ప్రభువు కృపకు అప్పగించినప్పుడు అతడు సీలను ఎంచుకుని అక్కడినుండి బయలుదేరాడు. 41 వారు సంఘాలను విశ్వాసంలో బలపరస్తు సిరియా కిలికియ దేశాల గుండా ప్రయాణం చేశారు.