5
పది ఆజ్ఞలు
మోషే ఇశ్రాయేలీయులందరిని పిలిపించి వారితో ఇలా చెప్పాడు:
ఇశ్రాయేలూ, మీ వినికిడిలో నేను ప్రకటించే శాసనాలను, చట్టాలను వినండి. వాటిని నేర్చుకొని ఖచ్చితంగా పాటించండి. మన దేవుడైన యెహోవా హోరేబులో మనతో నిబంధన చేశారు. యెహోవా ఈ నిబంధన చేసింది మన పూర్వికులతో కాదు, మనతో, ఈ రోజు సజీవంగా ఉన్న మనందరితో చేశారు. ఆ పర్వతం మీద అగ్నిలో నుండి యెహోవా మీతో ముఖాముఖిగా మాట్లాడారు. అయితే మీరు ఆ అగ్నికి భయపడి పర్వతం ఎక్కలేదు కాబట్టి యెహోవా మాట మీకు తెలియజేయడానికి నేను యెహోవాకు మీకు మధ్యలో నిలబడ్డాను.
ఆయన ఇలా అన్నారు:
 
“బానిస దేశమైన ఈజిప్టు నుండి మిమ్మల్ని బయటకు రప్పించిన మీ దేవుడనైన యెహోవాను నేనే.
 
“నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు.
పైన ఆకాశంలో గాని, క్రింద భూమిమీద గాని భూమి క్రింద నీళ్లలో గాని ఉన్న దేని రూపంలో మీరు మీకోసం ప్రతిమను చేసుకోకూడదు. మీరు వాటికి నమస్కరించకూడదు పూజింపకూడదు; ఎందుకంటే నేను, మీ దేవుడనైన యెహోవాను, రోషం గల దేవుడను, నన్ను ద్వేషించినవారి విషయంలో మూడు నాలుగు తరాల వరకు తండ్రుల పాపం యొక్క శిక్షను వారి పిల్లల మీదికి రప్పిస్తాను. 10 అయితే నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను పాటించే వారికి వెయ్యి తరాల వరకు కరుణను చూపిస్తాను.
11 మీ దేవుడైన యెహోవా నామాన్ని అనవసరంగా ఉపయోగించకూడదు, ఎందుకంటే తన నామాన్ని అనవసరంగా ఉపయోగించే వారిని యెహోవా నిర్దోషులుగా వదిలేయరు.
12 యెహోవా మీకు ఆజ్ఞాపించినట్లు సబ్బాతు దినాన్ని పరిశుద్ధంగా పాటించడం జ్ఞాపకముంచుకోండి. 13 ఆరు రోజులు మీరు కష్టపడి మీ పని అంతటిని చేసుకోవాలి, 14 కాని ఏడవ రోజు మీ దేవుడైన యెహోవాకు సబ్బాతు దినము. ఆ రోజు మీరు ఏ పని చేయకూడదు, మీరు గాని, మీ కుమారుడు లేదా కుమార్తె గాని, మీ దాసదాసీలు గాని, మీ ఎద్దు గాని, మీ గాడిద గాని, మీ పశువులు గాని, మీ పట్టణాల్లో ఉంటున్న విదేశీయులు గాని ఏ పని చేయకూడదు తద్వార మీలా మీ దాసదాసీలు విశ్రాంతి తీసుకుంటారు. 15 మీరు ఈజిప్టులో బానిసత్వంలో ఉన్నప్పుడు, మీ దేవుడైన యెహోవా బలమైన హస్తంతో, చాచిన చేతితో మిమ్మల్ని అక్కడినుండి బయటకు తీసుకువచ్చారని జ్ఞాపకం ఉంచుకోండి. కాబట్టి సబ్బాతు దినాన్ని పాటించమని మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించారు.
16 మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చే దేశంలో మీరు దీర్ఘాయుష్మంతులై మీకు క్షేమం కలిగేలా మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన ప్రకారం, మీ తండ్రిని తల్లిని గౌరవించాలి.
17 మీరు హత్య చేయకూడదు.
18 మీరు వ్యభిచారం చేయకూడదు.
19 మీరు దొంగతనం చేయకూడదు.
20 మీ పొరుగువారికి వ్యతిరేకంగా అబద్ధసాక్ష్యం చెప్పకూడదు.
21 మీ పొరుగువాని భార్యను మీరు ఆశించకూడదు. మీ పొరుగువాని ఇంటిని గాని స్థలాన్ని గాని అతని దాసుని గాని, దాసిని గాని, అతని ఎద్దును గాని గాడిదను గాని, మీ పొరుగువానికి చెందిన దేన్ని మీరు ఆశించకూడదు.”
 
22 ఈ ఆజ్ఞలు యెహోవా ఆ పర్వతం మీద అగ్ని, మేఘం, కటిక చీకటిలో నుండి గొప్ప స్వరంతో మీ సమాజమంతటికి ప్రకటించారు; ఆయన ఇంకా ఏది కలుపలేదు. ఆ తర్వాత ఆయన రెండు రాతి పలకల మీద వాటిని వ్రాసి నాకు ఇచ్చారు.
23 ఆ పర్వతం అగ్నితో మండుతున్నప్పుడు, ఆ చీకటిలో నుండి స్వరాన్ని మీరు విన్నప్పుడు, మీ గోత్రాల నాయకులందరు, మీ పెద్దలు నా దగ్గరకు వచ్చారు. 24 మీరు నాతో అన్నారు, “మన దేవుడైన యెహోవా తన మహిమను తన ఘనతను మాకు చూపించారు, అగ్నిలో నుండి ఆయన స్వరాన్ని మేము విన్నాము. దేవుడు మనుష్యులతో మాట్లాడినా వారు బ్రతికే ఉంటారని ఈ రోజు మేము చూశాము. 25 అయితే ఇప్పుడు మేమెందుకు చావాలి? ఈ గొప్ప అగ్ని మమ్మల్ని కాల్చివేస్తుంది, మేము మన దేవుడైన యెహోవా స్వరాన్ని ఇంకా వింటే చనిపోతాము. 26 మేము విన్నట్లు మానవులలో ఎవరైనా సజీవుడైన దేవుని స్వరం అగ్నిలో నుండి మాట్లాడడం విని బ్రతికి ఉన్నారా? 27 నీవే దగ్గరకు వెళ్లి మన దేవుడైన యెహోవా చెప్పినదంతా విను. తర్వాత మన దేవుడైన యెహోవా నీకు చెప్పినదంతా నీవు మాకు చెప్పు, మేము వింటాము, లోబడతాము.”
28 మీరు నాతో మాట్లాడినప్పుడు యెహోవా మీ మాటలు విన్నారు, యెహోవా నాతో ఇలా అన్నారు, “ఈ ప్రజలు నీతో చెప్పిన మాటలు నేను విన్నాను. వారు చెప్పిందంతా మంచిదే. 29 వారికి వారి సంతతికి నిరంతరం క్షేమం కలిగేలా వారు నా పట్ల భయం కలిగి, నా ఆజ్ఞలన్నిటిని అనుసరించే హృదయం వారికుంటే ఎంతో మంచిది.
30 “నీవు వెళ్లి, వారి గుడారలకు వారిని తిరిగి వెళ్లమని చెప్పు. 31 అయితే నీవు ఇక్కడ నాతో ఉండు, ఎందుకంటే వారు స్వాధీనం చేసుకోవడానికి నేను వారికి ఇస్తున్న దేశంలో పాటించేలా నీవు బోధించాల్సిన ఆజ్ఞలు, శాసనాలు చట్టాలు నీకు ఇస్తాను.”
32 కాబట్టి మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన వాటిని చేయడంలో జాగ్రత్త వహించండి; కుడికి గాని ఎడమకు గాని తిరగకూడదు. 33 మీరు స్వాధీనం చేసుకోబోయే దేశంలో మీరు జీవిస్తూ, అభివృద్ధి పొందుతూ, ఎక్కువకాలం జీవించేలా, మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గంలో నడవండి.