23
సమాజం నుండి బహిష్కరణ
1 నలిగిన బీజములు ఉన్నవారు, పురుషాంగం కత్తిరించబడిన వారు యెహోవా సమాజంలో ప్రవేశించకూడదు.
2 అక్రమ సంతానమైన వ్యక్తి గాని అతని సంతతివారు గాని పదవ తరాల వరకు కూడా యెహోవా సమాజంలో ప్రవేశించకూడదు.
3 అమ్మోనీయులే గాని మోయాబీయులే గాని లేదా వారి సంతతివారే గాని పదితరాల వరకు కూడా యెహోవా సమాజంలో ప్రవేశించలేరు. 4 మీరు ఈజిప్టు నుండి బయటకు వచ్చినప్పుడు వారు మిమ్మల్ని దారిలో రొట్టె గాని నీళ్లు గాని తీసుకుని కలవడానికి రాలేదు. వారు మిమ్మల్ని శపించడానికి అరాము నహరయీములోని*అంటే, వాయువ్య మెసొపొటేమియా పెతోరు నుండి బెయోరు కుమారుడు బిలామును తెచ్చుకున్నారు. 5 ఎలాగైతేనేం, మీ దేవుడైన యెహోవా బిలాము మాటలను ఆమోదించ లేదు. దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నారు. అందుకే శాపాన్ని దీవెనగా మార్చారు. 6 మీరు బ్రతికి ఉన్నంత వరకు వారితో స్నేహ ఒప్పందం కోరవద్దు.
7 ఎదోమీయులను తృణీకరించవద్దు, ఎందుకంటే ఎదోమీయులు మీ బంధువులు. ఈజిప్టువారిని తృణీకరించవద్దు, ఎందుకంటే మీరు వారి దేశంలో విదేశీయులుగా నివసించారు. 8 వారికి జన్మించిన మూడవ తరం పిల్లలు యెహోవా సమాజంలో ప్రవేశించవచ్చు.
శిబిరంలో అపవిత్రత
9 మీరు మీ శత్రువులకు వ్యతిరేకంగా గుడారాలు వేసుకున్నప్పుడు, అపవిత్రమైన ప్రతీ దానికి దూరంగా ఉండండి. 10 రాత్రి జరిగినదాని వల్ల అపవిత్రమైన వ్యక్తి, శిబిరం బయటకు వెళ్లి అక్కడ ఉండాలి. 11 కానీ సాయంకాలం అవుతుండగా అతడు స్నానం చేసుకోవాలి, సూర్యాస్తమయం అయినప్పుడు అతడు శిబిరానికి తిరిగి రావచ్చు.
12 మీ విసర్జన కోసం శిబిరం బయట ప్రత్యేకంగా స్థలం ఏర్పరచుకోవాలి. 13 త్రవ్వడానికి మీ దగ్గర పరికరాలతో పాటు ఒక పారను దగ్గర ఉంచుకుని దానితో గుంట త్రవ్వి, మలవిసర్జన తర్వాత మట్టితో మలాన్ని కప్పివేయాలి. 14 మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని రక్షించడానికి, మీ శత్రువులను మీకు అప్పగించడానికి మీ శిబిరంలో సంచరిస్తారు. మీ శిబిరం తప్పనిసరిగా పరిశుద్ధంగా ఉండాలి, తద్వారా ఆయన మీ మధ్య అసభ్యకరమైనదేది చూడరు, మీ నుండి తప్పుకోరు.
ఇతర చట్టాలు
15 బానిసలు మిమ్మల్ని ఆశ్రయిస్తే, వారిని వారి యజమానికి అప్పగించవద్దు. 16 వారిని మీ మధ్య వారికి ఇష్టమైనట్లు, వారు ఎంచుకున్న పట్టణంలో నివసింపనివ్వండి. వారిని అణచివేయవద్దు.
17 ఏ ఇశ్రాయేలు పురుషుడు గాని స్త్రీ గాని ఆలయ వేశ్యగా మారకూడదు. 18 మీ దేవుడైన యెహోవా వారిద్దరిని అసహ్యిస్తారు కాబట్టి ఏ మ్రొక్కుబడినైనా చెల్లించడానికి వేశ్యలైన స్త్రీలు గాని పురుషులు గాని†హెబ్రీలో కుక్క వారి సంపాదనలు మీరు మీ దేవుడైన యెహోవా మందిరంలోకి తీసుకురాకూడదు.
19 వడ్డీ సంపాదించగల డబ్బు గాని ఆహారమే గాని వేరే ఏదైనా గాని, తోటి ఇశ్రాయేలు దగ్గర వడ్డీ వసూలు చేయకూడదు. 20 మీరు విదేశీయుల దగ్గర వడ్డీని వసూలు చేయవచ్చు, కానీ తోటి ఇశ్రాయేలు దగ్గర కాదు, తద్వారా మీరు స్వాధీనం చేసుకునే దేశంలో మీరు చేయి పెట్టిన ప్రతి దానిలో మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు.
21 మీరు మీ దేవుడైన యెహోవాకు మ్రొక్కుబడి చేస్తే, దానిని తీర్చడానికి ఆలస్యం చేయకండి, ఎందుకంటే మీ దేవుడైన యెహోవా ఖచ్చితంగా మీ నుండి దాన్ని కోరతారు, మీరు పాపాన్ని బట్టి దోషులవుతారు. 22 కానీ మీరు మ్రొక్కుబడి చేయడం మానుకుంటే, మీరు దోషులు కారు. 23 మీ పెదవులు ఏది చెప్పినా మీరు తప్పకుండా చేయాలి, ఎందుకంటే మీరు మీ దేవుడైన యెహోవాకు మీ నోటితో స్వేచ్ఛగా మ్రొక్కుబడి చేశారు.
24 మీరు మీ పొరుగువారి ద్రాక్షతోటలోనికి ప్రవేశిస్తే, మీకు కావలసిన ద్రాక్షపండ్లను మీరు తినవచ్చు, కానీ మీ బుట్టలో వాటిని వేసుకోకూడదు. 25 మీరు మీ పొరుగువారి ధాన్యపు పొలంలోకి ప్రవేశిస్తే, మీరు మీ చేతులతో విత్తనాలను తీసుకోవచ్చు, కానీ మీరు పండిన పంటను కొడవలితో కోయకూడదు.