27
ఏబాలు కొండమీద బలిపీఠం
1 మోషే, ఇశ్రాయేలు పెద్దలు ప్రజలకు ఇలా ఆజ్ఞాపించారు: “ఈ రోజు మీకు ఇస్తున్న ఈ ఆజ్ఞలన్నిటిని మీరు పాటించాలి. 2 మీకు దేవుడైన యెహోవా ఇస్తున్న వాగ్దాన దేశంలో ప్రవేశించడానికి యొర్దాను దాటిన రోజున, మీరు పెద్ద రాళ్లు నిలబెట్టి వాటికి సున్నం వేయాలి. 3 మీ పూర్వికుల దేవుడైన యెహోవా మీకు వాగ్దానం చేసినట్లే, మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి ప్రవేశించడానికి మీరు దాటునప్పుడు ఈ చట్టం లోని పూర్తి మాటలను వాటిపై వ్రాయండి. 4 మీరు యొర్దాను దాటినప్పుడు, సున్నం వేసిన ఈ రాళ్లను నేను ఈ రోజు మీకు ఆజ్ఞాపించినట్లు ఏబాలు పర్వతం మీద నిలబెట్టండి. 5 అక్కడ మీ దేవుడైన యెహోవాకు ఒక బలిపీఠం రాళ్లతో కట్టాలి. వాటిపై ఎలాంటి ఇనుప సాధనాన్ని వాడకూడదు. 6 చెక్కని రాళ్లతో యెహోవాకు బలిపీఠం కట్టి దాని మీద దహనబలులు అర్పించాలి. 7 అక్కడ సమాధానబలులు సమర్పించి, వాటిని తింటూ మీ దేవుడైన యెహోవా సన్నిధిలో సంతోషించాలి. 8 మీరు నిలబెట్టిన రాళ్లమీద ఈ ధర్మశాస్త్రంలోని అన్ని మాటలను స్పష్టంగా వ్రాయండి.”
ఏబాలు కొండ నుండి శాపాలు
9 తర్వాత మోషే, లేవీయ యాజకులు ఇశ్రాయేలు ప్రజలందరితో ఇలా అన్నారు, “ఇశ్రాయేలూ, మౌనంగా ఉండి నేను చెప్పేది విను! ఇప్పుడు మీరు మీ దేవుడైన యెహోవాకు ప్రజలయ్యారు. 10 మీరు దేవుడైన యెహోవాకు లోబడి, నేను మీకు ఈ రోజు ఇస్తున్న ఆయన ఆజ్ఞలను, శాసనాలను మీరు పాటించాలి.”
11 ఆ రోజే మోషే ప్రజలకు ఆజ్ఞాపించాడు:
12 మీరు యొర్దాను నది దాటిన తర్వాత, షిమ్యోను, లేవీ, యూదా, ఇశ్శాఖారు, యోసేపు, బెన్యామీను గోత్రాల వారు గెరిజీము పర్వతం మీద నిలబడి ప్రజలను దీవించాలి. 13 రూబేను, గాదు, ఆషేరు, జెబూలూను, దాను, నఫ్తాలి గోత్రాల వారు ఏబాలు పర్వతం మీద నిలబడి, శాపాలు పలకాలి.
14 లేవీయులు ఇశ్రాయేలు ప్రజలందరికి బిగ్గరగా ఇలా చెప్పాలి:
15 “శిల్పి చేతులతో చెక్కబడి పోతపోయబడిన యెహోవాకు అసహ్యమైన విగ్రహాలను రహస్య స్థలంలో దాచుకునే వారెవరైనా శాపగ్రస్తులు” అని అన్నప్పుడు
ప్రజలంతా, “ఆమేన్!” అనాలి.
16 “తండ్రిని గాని తల్లిని గాని అవమానపరచే వారు శాపగ్రస్తులు” అని అన్నప్పుడు
ప్రజలంతా, “ఆమేన్!” అనాలి.
17 “తన పొరుగువాడి సరిహద్దు రాయిని తీసివేసేవారు శాపగ్రస్తులు” అని అన్నప్పుడు,
ప్రజలంతా, “ఆమేన్!” అనాలి.
18 “గ్రుడ్డివాన్ని త్రోవ తప్పించేవారు శాపగ్రస్తులు” అని అన్నప్పుడు,
ప్రజలంతా, “ఆమేన్!” అనాలి.
19 “విదేశీయుల పట్ల, తండ్రిలేనివారి పట్ల, విధవరాండ్ర పట్ల న్యాయం తప్పి తీర్పు తీర్చేవారు శాపగ్రస్తులు” అని అన్నప్పుడు,
ప్రజలంతా, “ఆమేన్!” అనాలి.
20 “తన తండ్రి భార్యతో లైంగిక సంబంధం పెట్టుకుని తండ్రి పాన్పును అపవిత్రపరచినవారు శాపగ్రస్తులు” అని అన్నప్పుడు,
ప్రజలంతా, “ఆమేన్!” అనాలి.
21 “ఏ జంతువుతోనైనా లైంగిక సంబంధం పెట్టుకునేవారు శాపగ్రస్తులు” అని అన్నప్పుడు,
ప్రజలంతా, “ఆమేన్!” అనాలి.
22 “తోబుట్టువుతో అనగా తన తండ్రి కుమార్తెతో గాని, తన తల్లి కుమార్తెతో గాని లైంగిక సంబంధం పెట్టుకునేవారు శాపగ్రస్తులు” అని అన్నప్పుడు,
ప్రజలంతా, “ఆమేన్!” అనాలి.
23 “అత్తతో లైంగిక సంబంధం పెట్టుకునేవారు శాపగ్రస్తులు” అని అన్నప్పుడు,
ప్రజలంతా, “ఆమేన్!” అనాలి.
24 “పొరుగువాన్ని రహస్యంగా చంపేవారు శాపగ్రస్తులు” అని అన్నప్పుడు
ప్రజలంతా, “ఆమేన్!” అనాలి.
25 “నిర్దోషి ప్రాణం తీయటానికి లంచం తీసుకునేవారు శాపగ్రస్తులు” అని అన్నప్పుడు,
ప్రజలంతా, “ఆమేన్!” అనాలి.
26 “ఈ ధర్మశాస్త్రంలోని మాటలను అమలు చేయడం ద్వారా వాటిని పాటించనివారు శాపగ్రస్తులు” అని అన్నప్పుడు,
ప్రజలంతా, “ఆమేన్!” అనాలి.