33
ఇశ్రాయేలు గోత్రాలను దీవించిన మోషే 
  1 దైవజనుడైన మోషే తాను చనిపోకముందు ఇశ్రాయేలు ప్రజలపై పలికిన ఆశీర్వాద వచనాలు.   2 అతడు ఇలా అన్నాడు:  
“యెహోవా సీనాయి పర్వతం నుండి వచ్చారు  
శేయీరు నుండి వారి మీద ఉదయించారు;  
పారాను పర్వతం నుండి ప్రకాశించారు.  
వేవేల పరిశుద్ధులతో ఆయన వచ్చారు,  
దక్షిణం నుండి, పర్వత వాలు నుండి వచ్చారు.   
 3 నిజంగా ఆయన తన జనులను ప్రేమిస్తున్నారు;  
పరిశుద్ధులందరు మీ చేతిలో ఉన్నారు.  
వారు మీ పాదాల దగ్గర వంగి,  
మీ నుండి ఉపదేశాన్ని పొందుకుంటారు,   
 4 మోషే మనకు ఇచ్చిన ధర్మశాస్త్రం  
యాకోబు సమాజానికి స్వాస్థ్యము.   
 5 ప్రజల నాయకులు,  
ఇశ్రాయేలు గోత్రాలతో పాటు సమావేశమైనప్పుడు  
ఆయన యెషూరూనుకు*యెషూరూనుకు అంటే యథార్థవంతుడు అంటే, ఇశ్రాయేలు; 33:26 వచనంలో కూడా రాజుగా ఉన్నాడు.   
 6 “రూబేను చనిపోకుండ బ్రతికి ఉండును గాక,  
అతని ప్రజల సంఖ్య తగ్గకుండును గాక.”   
 7 యూదా గురించి అతడు ఇలా అన్నాడు:  
“యెహోవా, యూదా మొరను వినండి;  
అతని ప్రజల దగ్గరకు అతన్ని చేర్చండి.  
అతడు తన చేతులతో తన కోసం పోరాడేలా,  
అతని శత్రువులకు వ్యతిరేకంగా అతనికి సహాయంగా ఉండండి!”   
 8 లేవీ గురించి అతడు ఇలా అన్నాడు:  
“యెహోవా, మీ తుమ్మీము, ఊరీము  
మీ నమ్మకమైన సేవకునికి చెందినవి.  
మస్సాలో మీరతనిని పరీక్షించారు;  
మెరీబా నీళ్ల దగ్గర అతనితో మీరు వాదించారు.   
 9 అతడు తన తండ్రి తల్లి గురించి చెబుతూ,  
‘నేను వారిని చూడలేదు’  
అతడు తన సోదరులను గుర్తించలేదు  
తన సొంత పిల్లలను అంగీకరించలేదు.  
కాని అతడు నీ మాట గమనించాడు  
నీ నిబంధనను కాపాడాడు.   
 10 అతడు యాకోబుకు నీ కట్టడలను  
ఇశ్రాయేలీయులకు నీ ధర్మశాస్త్రాన్ని బోధిస్తాడు,  
అతడు మీ ఎదుట ధూపం వేస్తాడు,  
మీ బలిపీఠం మీద దహనబలులు అర్పిస్తాడు.   
 11 యెహోవా, అతని సేవను దీవించండి,  
అతని చేతి పనులను బట్టి సంతోషించండి.  
అతనికి వ్యతిరేకంగా లేచినవారిని కొట్టండి,  
అతని శత్రువులను తిరిగి లేవనంతగా కొట్టండి.”   
 12 బెన్యామీను గురించి అతడు ఇలా అన్నాడు:  
“యెహోవాకు ప్రియమైనవాడు ఆయనలో క్షేమంగా ఉండును గాక,  
ఎందుకంటే రోజంతా ఆయన రక్షణగా ఉంటారు,  
యెహోవా ప్రేమించేవాడు ఆయన భుజాల మధ్య ఉంటాడు.”   
 13 యోసేపు గురించి అతడు ఇలా అన్నాడు:  
“యెహోవా అతని భూమిని  
ఆకాశం నుండి కురిసే శ్రేష్ఠమైన మంచుతో  
క్రింద ఉన్న లోతైన జలాలతో దీవించును గాక;   
 14 సూర్యుని వలన కలిగే ఉత్తమమైన ఫలాలతో  
చంద్రుడు ఫలింపచేసే శ్రేష్ఠమైన ఫలాలతో;   
 15 పురాతన పర్వతాల శ్రేష్ఠమైన వాటితో  
శాశ్వత కొండల శ్రేష్ఠమైన పంటతో;   
 16 భూమి ఇచ్చే ప్రశస్తమైన పదార్థాలతో వాటి సమృద్ధితో  
మండుతున్న పొదలో నివసించే ఆయన దయతో దీవించును గాక.  
ఇవన్నీ యోసేపు తలపై ఉండును గాక,  
అతని సోదరుల మధ్యలో యువరాజు నుదుటి మీద ఉండును గాక.   
 17 ప్రభావంలో అతడు మొదట పుట్టిన కోడెలాంటి వాడు;  
అతని కొమ్ములు అడవి ఎద్దు కొమ్ములు.  
వాటితో అతడు జనులను,  
భూమి అంచులో ఉన్నవారిని కూడా కుమ్ముతాడు.  
ఎఫ్రాయిముకు చెందిన పదివేలమంది అలాంటివారు,  
మనష్షేకు చెందిన వేలమంది అలాంటివారు.”   
 18 జెబూలూను గురించి అతడు ఇలా అన్నాడు:  
“జెబూలూనూ, నీవు బయటకు వెళ్లునప్పుడు, సంతోషించు,  
ఇశ్శాఖారూ, నీవు నీ గుడారాల్లో సంతోషించు.   
 19 వారు జనులను పర్వతం దగ్గరకు పిలుస్తారు  
అక్కడ నీతి బలులు అర్పిస్తారు;  
వారు సముద్రాల సమృద్ధి మీద  
ఇసుకలో దాగి ఉన్న నిధుల మీద విందు చేస్తారు.”   
 20 గాదు గురించి అతడు ఇలా అన్నాడు:  
“గాదు దేశాన్ని విశాలం చేసినవారు ధన్యులు!  
గాదు అక్కడ సింహంలా నివసిస్తాడు,  
చేతిని గాని నడినెత్తిని చీల్చివేస్తాడు.   
 21 అతడు తన కోసం శ్రేష్ఠమైన భాగాన్ని ఎంచుకున్నాడు;  
నాయకుని భాగం అతని కోసం ఉంచబడుతుంది.  
ప్రజల పెద్దలు సమావేశమైనప్పుడు  
యెహోవా యొక్క నీతియుక్తమైన చిత్తాన్ని,  
ఇశ్రాయేలీయు గురించి ఆయన తీర్పులను, అతడు అమలుచేస్తాడు.”   
 22 దాను గురించి అతడు ఇలా చెప్పాడు:  
“దాను గోత్రం సింహం పిల్లలాంటిది,  
బాషాను నుండి దూకుతుంది.”   
 23 నఫ్తాలి గురించి అతడు ఇలా అన్నాడు:  
“నఫ్తాలి యెహోవా దయతో తృప్తి చెంది  
ఆయన దీవెనలతో నింపబడ్డాడు;  
దక్షిణం నుండి సముద్రం వరకు అతడు స్వాధీనం చేసుకుంటాడు.”   
 24 ఆషేరు గురించి అతడు ఇలా అన్నాడు:  
“కుమారులలో ఆషేరు అందరికంటే ఎక్కువగా ఆశీర్వదించబడ్డాడు;  
అతడు తన సోదరుల దయను పొందును గాక.  
అతడు తన పాదాలను నూనెలో ముంచును గాక.   
 25 నీ ద్వారపు గడియలు ఇనుపవి, ఇత్తడివి  
నీ బలం నీ రోజులకు సమానంగా ఉంటుంది.   
 26 “యెషూరూను దేవుని పోలినవారు ఎవరు లేరు,  
ఆకాశవాహనుడై వచ్చి నీకు సహాయం చేయడానికి ఆయన ఆకాశం గుండా వస్తారు,  
తన తేజస్సుతో మేఘాలపై వస్తారు.   
 27 శాశ్వతమైన దేవుడు నీకు ఆశ్రయం,  
నిత్యమైన హస్తాలు నీ క్రింద ఉన్నాయి.  
‘వారిని నాశనం చెయ్యండి!’  
అంటూ ఆయన నీ శత్రువులను నీ ఎదుట నుండి తరిమివేస్తారు.   
 28 కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు క్షేమంగా నివసిస్తారు;  
ధాన్యం క్రొత్త ద్రాక్షరసం ఉన్న దేశంలో  
యాకోబు ఊట క్షేమంగా ఉంటుంది,  
అక్కడ ఆకాశం మంచు కురిపిస్తుంది.   
 29 ఇశ్రాయేలూ, మీరు ధన్యులు!  
యెహోవా రక్షించిన ప్రజలారా,  
మీలాంటి వారు ఎవరు?  
ఆయన మీకు డాలు, సహాయకుడు  
మీ మహిమగల ఖడ్గము.  
మీ శత్రువులు మీ ఎదుట భయపడతారు;  
మీరు వారి వీపుపై త్రొక్కుతారు.”