3
యూదేతరుల పట్ల దేవుని అద్భుత ప్రణాళిక
ఈ కారణంచేత, యూదేతరులైన మీరు రక్షింపబడాలని, పౌలు అనే నేను క్రీస్తు యేసు సువార్త విషయంలో ఖైదీనై ఉన్నాను.
మీ కోసం నాకు అనుగ్రహించబడిన దేవుని కృపా ఏర్పాటును గురించి మీరు నిశ్చయంగా విన్నారు. అదేమిటంటే, ఇంతకుముందే మీకు క్లుప్తంగా వ్రాసినట్లు, క్రీస్తు గురించిన మర్మం నాకు ప్రత్యక్షపరచబడింది. మీరు దానిని చదివినట్లైతే ఆ క్రీస్తు మర్మాన్ని గురించి నాకున్న పరిజ్ఞానాన్ని మీరు తెలుసుకోగలరు. ఈ మర్మం, ఆత్మ వలన ఇప్పుడు దేవుని పరిశుద్ధ అపొస్తలులకు ప్రవక్తలకు తెలియపరచబడినట్లుగా ఇతర తరాలలోని వారికి తెలియపరచబడలేదు. ఈ రహస్యం ఏంటంటే, సువార్త ద్వారా యూదేతరులు ఇశ్రాయేలుతో కలిసి వారసులు, ఒకే శరీరంలోని సభ్యులు, క్రీస్తు యేసులోని వాగ్దానంలో భాగస్వాములు.
దేవుడు తన శక్తినిబట్టి నాకు అనుగ్రహించిన కృపావరం చొప్పున నేను ఆ సువార్తకు సేవకుడినయ్యాను. పరిశుద్ధులలో నేను అత్యంత అల్పున్ని కానీ లెక్కించలేని ఆశీర్వాదాలు క్రీస్తు యేసులో ఉన్నాయని యూదేతరులకు ప్రకటించడానికి దేవుడు తన దయతో నన్ను ఏర్పరచుకున్నారు. సమస్తాన్ని సృజించిన దేవుడు అనాది నుండి దాచబడి ఉన్న ఆ మర్మాన్ని, ప్రజలందరికి తెలియజేయడానికి ఆ కృపను నాకు అనుగ్రహించారు. 10 దేవుని ఉద్దేశమేమిటంటే, సంఘం ద్వారా, దేవుని నానా విధాలైన జ్ఞానము వాయుమండలంలోని ప్రధానులకు అధికారులకు తెలియజేయబడాలి. 11 అందుకని దేవుడు తన నిత్య సంకల్పాన్ని మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా నెరవేర్చారు. 12 ఈ విధంగా ఇప్పుడు ఆయనలో ఉంచిన విశ్వాసం ద్వారా స్వేచ్ఛగా ధైర్యంగా దేవుని సమీపించగలము. 13 కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మీ గురించి నేను పడిన శ్రమలను బట్టి మీరు నిరుత్సాహపడవద్దు, అవి మీకు కీర్తి.
ఎఫెసీయుల కోసం ప్రార్థన
14 ఈ కారణాన్ని బట్టి, తండ్రి ఎదుట నేను మోకరిస్తున్నాను, 15 పరలోకంలోను భూమి మీద ఉన్న ప్రతి కుటుంబం ఆయనను బట్టే కుటుంబమని పిలువబడుతుంది. 16 తన మహిమ సమృద్ధి నుండి ఆయన మిమ్మల్ని మీ అంతరంగంలో తన ఆత్మ ద్వారా శక్తితో బలపరచాలని, 17 అప్పుడు విశ్వాసం ద్వారా మీ హృదయాల్లో క్రీస్తు నివసించాలని నేను ప్రార్థిస్తున్నాను. మీరు ప్రేమలో వేరుపారి స్థిరపడాలని, 18 మీరు ప్రభువు యొక్క పరిశుద్ధ ప్రజలందరితో కలిసి శక్తిని పొంది, క్రీస్తు ప్రేమ ఎంత వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఉన్నదో గ్రహిస్తూ, 19 సమస్త జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకుంటూ దేవుని పరిపూర్ణతతో మీరు పూర్తిగా నింపబడాలని నేను ప్రార్థిస్తున్నాను.
20 మనలో పని చేసి తన శక్తినిబట్టి మనం అడిగే వాటికంటే, ఊహించే వాటికంటే కొలవలేనంత అత్యధికంగా చేయడానికి శక్తిగల దేవునికి, 21 సంఘంలోనూ క్రీస్తు యేసులోనూ తరతరములు మహిమ నిరంతరం కలుగును గాక ఆమేన్.