22
ఆస్తుల సంరక్షణ
1 “ఎవరైనా ఎద్దునైన గొర్రెనైన దొంగతనం చేసి దానిని చంపినా లేదా అమ్మినా ఆ ఎద్దుకు బదులు అయిదు ఎద్దులను, ఆ గొర్రెకు బదులు నాలుగు గొర్రెలను నష్టపరిహారంగా ఇవ్వాలి.
2 “రాత్రివేళ దొంగ ఇంట్లోకి చొచ్చుకొని వచ్చి ఒకవేళ దొరికిపోయి చావుదెబ్బలు తింటే కొట్టినవాడు రక్తం కారిన దాన్ని బట్టి అపరాధి కాడు. 3 కాని ఒకవేళ సూర్యోదయం తర్వాత ఇది జరిగితే, కొట్టినవాడు రక్తం కారిన దాన్ని బట్టి అపరాధి అవుతాడు.
“ఎవరైనా దొంగతనం చేస్తే తప్పక నష్టపరిహారం చెల్లించాలి, కాని వాని దగ్గర ఏమిలేకపోతే, వారి దొంగతనానికి చెల్లించడానికి వారు అమ్మివేయబడాలి. 4 ఒకవేళ దొంగతనానికి గురియైన జంతువు ప్రాణంతో వారి స్వాధీనంలో కనబడితే, అది ఎద్దు గాని గాడిద గాని గొర్రెగాని దానికి రెండింతలు చెల్లించాలి.
5 “ఒకడు తన పశువులను మేపడానికి ఒక పొలంలోగాని ద్రాక్షతోటలో గాని వదిలిపెట్టినప్పుడు ఆ పశువులు వేరొకని పొలంలో మేస్తే అతడు తన పొలంలో నుండి గాని ద్రాక్షతోటలో నుండి గాని మంచివాటిని నష్టపరిహారంగా చెల్లించాలి.
6 “అగ్ని రాజుకొని ముళ్ళకంపలకు అంటుకున్నందు వల్ల పంట కుప్పలు గాని పొలంలో పైరుగాని లేదా పొలమంతా కాలిపోతే ఆ అగ్నిని అంటించినవాడు నష్టపరిహారం చెల్లించాలి.
7 “ఒకరు తమ డబ్బును గాని వస్తువులను గాని దాచమని తన పొరుగువారికి ఇచ్చినప్పుడు, ఆ వ్యక్తి ఇంట్లోనుండి అవి దొంగతనం చేయబడి ఆ దొంగ దొరికితే వాటికి రెండింతలు వాడు చెల్లించాలి. 8 ఒకవేళ దొంగ దొరక్కపోతే ఆ ఇంటి యజమాని దేవుని*లేదా న్యాయాధిపతుల ఎదుటకు హాజరు కావాలి, అప్పుడు వారు అతడు తన పొరుగువాని వస్తువులను తీశాడో లేదో తెలుసుకుంటారు. 9 అన్యాయంగా సంపాదించిన ఎద్దు, గాడిద, గొర్రె, బట్ట వంటి వాటన్నిటి విషయంలో పోగొట్టుకున్నవాడు వాటిని చూసి, ‘ఇది నాది’ అని చెప్తే వారిద్దరు దేవుని సమక్షానికి తమ సమస్యను తీసుకురావాలి. న్యాయాధికారులు నేరస్థునిగా నిర్ధారించినవాడు ఎదుటివానికి రెట్టింపు పరిహారం చెల్లించాలి.
10 “ఒకరు తన గాడిదనైన ఎద్దునైన గొర్రెనైన కాపాడమని తన పొరుగువానికి ఇచ్చినప్పుడు అది చనిపోయినా లేదా గాయపడినా లేదా ఎవరూ చూడనప్పుడు దాన్ని ఎవరైనా తీసుకెళ్లినా, 11 పొరుగువాడు ఆ వ్యక్తి ఆస్తి మీద చేతులు వేయలేదని యెహోవా ఎదుట ప్రమాణం చేయడం ద్వారా వారిద్దరి మధ్య సమస్య పరిష్కరించబడుతుంది. యజమాని దానికి అంగీకరించాలి; నష్టపరిహారం అవసరం లేదు. 12 అతని దగ్గర నుండి ఆ జంతువు దొంగతనం చేయబడితే అతడు దాని యజమానికి నష్టపరిహారం చెల్లించాలి. 13 దానిని ఏ మృగమేదైనా చీల్చివేస్తే, సాక్ష్యంగా దాని మిగిలిన భాగాలను తీసుకురావాలి, చీల్చబడినదానికి నష్టపరిహారం అవసరం లేదు.
14 “ఎవరైనా తమ పొరుగువాని దగ్గర నుండి ఒక జంతువును బదులు తీసుకున్నప్పుడు దాని యజమాని దాని దగ్గర లేనప్పుడు, అది గాయపడినా లేదా చచ్చినా, బదులు తీసుకున్నవాడు నష్టపరిహారం చెల్లించాలి. 15 దాని యజమాని దాని దగ్గరే ఉంటే, బదులు తీసుకున్నవాడు నష్టపరిహారం చెల్లించనవసరం లేదు. ఒకవేళ ఆ జంతువు అద్దెకు తెచ్చినదైతే, దాని అద్దె లోనే నష్టం సరిపెట్టబడుతుంది.
సామాజిక బాధ్యత
16 “ఒకడు పెళ్ళి నిశ్చయించబడని కన్యను లోబరచుకొని ఆమెతో పడుకుంటే అతడు ఆమెకు కట్నం చెల్లించి ఆమెను తన భార్యగా చేసుకోవాలి. 17 ఆమె తండ్రి ఆమెను అతనికి ఇవ్వడానికి అస్సలు ఒప్పుకోకపోతే అతడు కన్యకల కట్నం ప్రకారం డబ్బు చెల్లించాలి.
18 “మంత్రగత్తెలను బ్రతకనివ్వకూడదు.
19 “జంతు సంపర్కం చేసినవారికి మరణశిక్ష విధించాలి.
20 “యెహోవాకు మాత్రమే కాకుండా మరొక దేవునికి బలి అర్పించేవారు పూర్తిగా నాశనం చేయబడతారు.†ఇక్కడ హెబ్రీ పదం వస్తువులను లేదా వ్యక్తులను తిరిగి మార్చుకోలేని విధంగా యెహోవాకు అప్పగించడాన్ని సూచిస్తుంది, తరచుగా వాటిని పూర్తిగా నాశనం చేయడమే.
21 “మీరు ఈజిప్టు దేశంలో విదేశీయులుగా ఉన్నారు; కాబట్టి విదేశీయులను బాధించకూడదు, అణగద్రొక్కకూడదు.
22 “విధవరాలిని గాని తండ్రిలేనివారిని గాని బాధపెట్టకూడదు. 23 మీరు వారిని వేధించడం వలన వారు నాకు మొరపెడితే, నేను ఖచ్చితంగా వారి మొర వింటాను. 24 నా కోపం రగులుకొని నేను మిమ్మల్ని కత్తితో చంపుతాను; అప్పుడు మీ భార్యలు విధవరాళ్లు అవుతారు మీ పిల్లలు తండ్రిలేనివారవుతారు.
25 “మీ మధ్య ఉన్న నా ప్రజల్లో ఎవరైనా అవసరంలో ఉంటే, మీరు వారికి డబ్బు అప్పు ఇస్తే, అప్పులు ఇచ్చేవారిలా ప్రవర్తించకూడదు; వడ్డీ తీసుకోకూడదు. 26 నీ పొరుగువారి పైవస్త్రాన్ని తాకట్టుగా తీసుకుంటే, సూర్యాస్తమయానికి తిరిగి ఇచ్చేయాలి. 27 ఎందుకంటే రాత్రివేళ కప్పుకోడానికి మీ పొరుగువారికి ఉన్నది అదొక్కటే. అది లేకుండా వారు ఎలా నిద్రపోగలరు? నేను కనికరం గలవాన్ని, కాబట్టి వారు నాకు మొరపెడితే నేను వింటాను.
28 “మీరు దేవుని దూషించకూడదు; మీ ప్రజల అధికారిని శపించకూడదు.
29 “మీ ధాన్యాగారాల నుండి, తొట్టెల నుండి అర్పణలు చెల్లించడం ఆలస్యం చేయకూడదు.
“ఖచ్చితంగా మీ కుమారులలో మొదటి సంతానాన్ని నాకు అర్పించాలి. 30 మీ పశువులు గొర్రెల విషయంలో కూడా అలాగే చేయాలి. వాటిని తల్లి దగ్గర ఏడు రోజుల వరకు ఉంచాలి. ఎనిమిదవ రోజున వాటిని నాకు ఇవ్వాలి.
31 “మీరు నా పరిశుద్ధ ప్రజలుగా ఉండాలి కాబట్టి అడవి మృగాలు చీల్చిన జంతు మాంసాన్ని తినకూడదు; దానిని కుక్కలకు పారవేయాలి.