15
యెరూషలేము పనికిరాని ద్రాక్షతీగె 
  1 యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది:   2 “మనుష్యకుమారుడా, ద్రాక్షచెట్టు కర్ర అడవిలోని ఇతర చెట్ల కొమ్మల కంటే ఏమైనా గొప్పదా?   3 దాని కర్ర ఏ పనికైనా ఉపయోగపడుతుందా? ఏ పనికైనా దాని కర్రను వాడతారా? దేనినైనా తగిలించడానికి దాని కర్రతో మేకులు తయారుచేస్తారా?   4 లేదు కదా, అది మంటలో వేయడానికే ఉపయోగపడుతుంది. అగ్నిలో రెండు చివరలు మధ్య భాగం కాలిపోయిన తర్వాత అది దేనికైనా ఉపయోగపడుతుందా?   5 అది కాలక ముందే దేనికి ఉపయోగపడనప్పుడు అగ్నిలో పూర్తిగా కాలిన తర్వాత మరి దేనికి ఉపయోగపడుతుంది?   
 6 “ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే: అడవి చెట్లలో ద్రాక్షచెట్టు కర్రను నేను ఎలా అగ్నికి అప్పగించానో అలానే యెరూషలేములో నివసించే ప్రజలను అప్పగిస్తాను.   7 నేను వారిపట్ల కఠినంగా ఉంటాను. వారు అగ్ని నుండి తప్పించుకున్నా సరే అగ్ని వారిని కాల్చివేస్తుంది. నేను వారిపట్ల కఠినంగా ఉన్నప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకుంటారు.   8 వారు నమ్మకద్రోహులుగా ఉన్నారు కాబట్టి నేను దేశాన్ని పాడుచేస్తాను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.”