30
ఈజిప్టు గురించి విలాప గీతం 
  1 యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది:   2 “మనుష్యకుమారుడా, ప్రవచించి ఇలా చెప్పు: ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు:  
“ ‘రోదిస్తూ అనండి:  
“అయ్యో, శ్రమ దినం వచ్చిందే!”   
 3 ఎందుకంటే ఆ రోజు వచ్చేసింది,  
యెహోవా దినం సమీపించింది,  
మబ్బులు కమ్ముకునే రోజు,  
జనాంగాలు శిక్షించబడే రోజు.   
 4 ఈజిప్టు దేశం మీదికి ఖడ్గం దూసుకువస్తుంది,  
కూషు*అంటే, నైలు ఉపరితల ప్రాంతం; 5, 9 వచనాల్లో కూడా. మీదికి వేదన వస్తుంది.  
ఈజిప్టులో హతులైనవారు పడిపోతుంటే,  
దాని సంపదను తీసుకెళ్లిపోతారు,  
దాని పునాదులు కూల్చివేయబడతాయి.   
 5 కూషు వారు, లిబియా వారు (పూతు వారు), లిడియా వారు, అరేబియా అంతా, కూబు వారు, ఇంకా నిబంధన దేశపు ప్రజలు ఈజిప్టుతో పాటు ఖడ్గానికి కూలిపోతారు.   
 6 “ ‘యెహోవా ఇలా చెప్తున్నారు:  
“ ‘ఈజిప్టు సహాయకులు కూలిపోతారు,  
దాని బల గర్వం అణిగిపోతుంది.  
మిగ్దోలు నుండి సైనే వరకు ప్రజలు  
దాని లోపలే ఉన్న ఖడ్గానికి కూలిపోతారు.  
అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.   
 7 పాడైపోయిన దేశాల మధ్య  
ఈజిప్టువారు దిక్కులేని వారవుతారు.  
శిథిలమైన పట్టణాల మధ్య  
వారి పట్టణాలు పడి ఉంటాయి.   
 8 ఈజిప్టు దేశంలో అగ్ని రగిలించబడి  
దాని సహాయకులంతా నలిపివేయబడినప్పుడు  
నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు.   
 9 “ ‘ఆ రోజున దూతలు నా దగ్గర నుండి ఓడలలో బయలుదేరి నిర్భయంగా ఉన్న కూషును భయపెడతారు. ఈజిప్టుకు తీర్పు తీర్చబడిన రోజున వారికెంతో భయాందోళనలు కలుగుతాయి. అది తప్పనిసరిగా వస్తుంది.   
 10 “ ‘ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే:  
“ ‘బబులోను రాజైన నెబుకద్నెజరుచేత నేను  
ఈజిప్టువారి అల్లరిమూకలను అంతం చేస్తాను.   
 11 ప్రజల్లో అతి క్రూరులైన తన సైన్యాన్ని తీసుకుని  
ఆ దేశాన్ని నాశనం చెయ్యడానికి అతడు వస్తాడు.  
వారు ఈజిప్టు వారిపై తమ ఖడ్గాలు దూసి  
దేశమంతా శవాలతో నింపుతారు.   
 12 నైలు నదిని ఎండిపోయేలా చేసి  
ఆ దేశాన్ని దుర్మార్గులకు అమ్మేస్తాను.  
విదేశీయులచేత నేను  
ఆ దేశాన్ని అందులోని సమస్తాన్ని పాడుచేస్తాను.  
యెహోవానైన నేనే మాట ఇచ్చాను.   
 13 “ ‘ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే:  
“ ‘విగ్రహాలను నాశనం చేసి  
మెంఫిసులో ఒక్క విగ్రహం కూడా మిగలకుండా చేస్తాను.  
ఈజిప్టు దేశంలో ఒక్క యువరాజు కూడా ఉండడు,  
ఆ దేశమంతా భయం పుట్టిస్తాను.   
 14 పత్రూసు†అంటే ఎగువ ఈజిప్టు పాడుచేస్తాను,  
సోయనులో అగ్ని పుట్టిస్తాను  
తేబేసుకు శిక్ష విధిస్తాను.   
 15 ఈజిప్టుకు కోటయైన  
సీను మీద నా ఉగ్రతను కుమ్మరిస్తాను.  
తేబేసు అల్లరిమూకలను నిర్మూలం చేస్తాను.   
 16 ఈజిప్టు దేశంలో మంట పుట్టిస్తాను.  
సీను వేదనతో మెలికలు తిరుగుతుంది.  
తేబేసు తుఫాను తాకిడికి చిన్నాభిన్నం అవుతుంది;  
మెంఫిసు నిరంతరం బాధలో ఉంటుంది.   
కత్తివేటుకు కూలిపోతారు,  
ఆ పట్టణస్థులు బందీలవుతారు.   
 18 ఈజిప్టు కాడిని నేను విరిచినప్పుడు  
తహ్పన్హేసులో పగలే చీకటి కమ్ముతుంది;  
దాని బల గర్వం అణచివేయబడుతుంది.  
దానిని మబ్బులు క్రమ్ముతాయి  
దాని కుమార్తెలు బందీగా వెళ్తారు.   
 19 కాబట్టి నేను ఈజిప్టువారికి శిక్ష విధిస్తాను.  
అప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు.’ ”   
విరిగిన ఫరో చేతులు 
  20 పదకొండవ సంవత్సరం మొదటి నెల ఏడవ రోజున యెహోవా వాక్కు నా దగ్గరకు వచ్చింది:   21 “మనుష్యకుమారుడా, నేను ఈజిప్టు రాజైన ఫరో చేతిని విరగ కొట్టాను. అది బాగవ్వడానికి ఎవరూ దానికి కట్టు కట్టరు, అది కత్తి పట్టుకోడానికి కావలసినంత బలంగా మారడానికి బద్దపెట్టి కట్టరు.   22 కాబట్టి ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: నేను ఈజిప్టు రాజైన ఫరోకు విరోధిని అయ్యాను. బాగా ఉన్న చేతిని విరిగిపోయిన చేతిని రెండింటిని నేను విరగ్గొట్టి అతని చేతిలో నుండి కత్తి పడిపోయేలా చేస్తాను.   23 ఈజిప్టువారిని ఇతర జనాంగాల్లోకి చెదరగొట్టి వారిని ఆయా దేశాలకు వెళ్లగొడతాను.   24 నేను బబులోను రాజు చేతులను బలపరచి నా ఖడ్గాన్ని అతని చేతికి అందిస్తాను. నేను ఫరో చేతులను విరగ్గొట్టినప్పుడు బబులోను రాజు ఎదుట చావు దెబ్బ తిన్నవానిలా అతడు మూల్గుతాడు.   25 నేను బబులోను రాజు చేతులను బలపరుస్తాను, కాని ఫరో చేతులు చచ్చుబడిపోతాయి. ఈజిప్టు దేశం మీద ఆడించడానికి నేను నా ఖడ్గాన్ని బబులోను రాజు చేతికి ఇచ్చినప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు.   26 ఈజిప్టువారిని ఇతర ప్రజల్లో చెదరగొట్టి వారిని ఆయా దేశాలకు వెళ్లగొడతాను. అప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు.”