32
ఫరో గురించి విలాప గీతం
పన్నెండవ సంవత్సరం, పన్నెండవ నెల మొదటి రోజున యెహోవా వాక్కు నా దగ్గరకు వచ్చింది: “మనుష్యకుమారుడా, ఈజిప్టు రాజైన ఫరోను గురించి విలాప గీతం పాడి అతనితో ఇలా చెప్పు:
“ ‘దేశాల మధ్య సింహంవంటివాడవు;
నీవు నీ ప్రవాహంలో కొట్టుకుపోతూ,
నీ పాదాలతో నీటిని చిమ్ముతూ,
ప్రవాహాలను బురదమయం చేస్తూ,
సముద్రాల్లో ఉండే భీకరమైన సముద్ర జీవిలాంటి వాడవు.
“ ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు:
“ ‘గుంపులు గుంపులుగా ప్రజలు చేరినప్పుడు
నేను నీ మీద వల వేస్తాను;
నా వలలో చిక్కిన నిన్ను వారంతా నీటిలో నుండి బయటకు లాగుతారు.
నేను నిన్ను నేల మీద పడవేసి
బయట పొలంలో విసిరివేస్తాను.
ఆకాశ పక్షులను నీ మీద వ్రాలనిస్తాను,
అడవి జంతువులను వాటి కడుపునిండా నిన్ను తినేలా చేస్తాను.
నీ మాంసాన్ని పర్వతాలమీద వెదజల్లుతాను,
నీ శవాలతో లోయలన్నిటిని నింపుతాను.
నేను నీ రక్తధారలతో భూమిని
పర్వతాల వరకు తడుపుతాను,
లోయలు నీ మాంసంతో నిండిపోతాయి.
నేను నిన్ను ఆర్పివేసి ఆకాశాన్ని మూసివేస్తాను.
నక్షత్రాలను చీకటిగా చేస్తాను;
సూర్యుని మబ్బుతో కప్పుతాను
చంద్రుడు ప్రకాశించడు.
నీ వలన ఆకాశంలోని జ్యోతులను చీకటిగా చేస్తాను
నీ దేశం మీద గాఢాంధకారం కమ్మేలా చేస్తాను;
ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
నీకు తెలియని దేశాల మధ్య
అనేక జనాంగాల మధ్య నేను నీ మీదికి నాశనం తెచ్చినప్పుడు
అనేక జనాంగాల హృదయాలకు కలవరం కలిగిస్తాను.
10 నేను వారి ముందు నా ఖడ్గాన్ని ఆడించినప్పుడు,
నీ కారణంగా అనేకమందికి కలవరాన్ని కలిగిస్తాను,
వారి రాజులు నిన్ను చూసి భయపడతారు.
నీవు కూలిపోయిన రోజున
వారంతా ప్రాణభయంతో
నిత్యం వణికిపోతారు.
11 “ ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు:
“ ‘బబులోను రాజు ఖడ్గం
నీ మీదికి వస్తుంది.
12 అన్ని జాతులలో అతి క్రూరులైన
బల శూరుల ఖడ్గంతో
నీ సైన్యం పతనమయ్యేలా చేస్తాను.
వారు ఈజిప్టువారి గర్వాన్ని అణచివేస్తారు,
దాని అల్లరిమూకలు నాశనమైపోతాయి.
13 సమృద్ధి జలాల ప్రక్కన ఉన్న
దాని పశువులన్నిటిని నేను నాశనం చేస్తాను,
ఇకపై నరుని పాదాలు వాటిని కదల్చవు,
పశువుల కాళ్లు వాటిని బురదమయం చేయవు.
14 అప్పుడు నేను జలాలను నిమ్మళింపజేసి,
దాని ప్రవాహాలను నూనెలా ప్రవహించేలా చేస్తాను,
అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.
15 నేను ఈజిప్టును పాడు చేసినప్పుడు,
అందులో ఉన్నవాటన్నిటిని నాశనం చేసినప్పుడు,
దానిలో నివసించే వారినందరిని నిర్మూలం చేసినప్పుడు,
నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు.’
16 “వారు ఆమె కోసం ఈ విలాప గీతం పాడతారు. ఆయా దేశాల కుమార్తెలు దానిని పాడతారు; ఈజిప్టు కోసం, దాని అల్లరిమూకలన్నిటి కోసం వారు దానిని పాడతారు అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.”
ఈజిప్టు పాతాళంలోకి దిగి వెళ్లుట
17 పన్నెండవ సంవత్సరం మొదటి నెల పదిహేనవ రోజున యెహోవా వాక్కు నాకు వచ్చి: 18 “మనుష్యకుమారుడా! ఈజిప్టు అల్లరిమూకల కోసం విలపించు పాతాళంలోకి దిగివెళ్లే వారితో పాటు ఆమెను, బలమైన దేశాల కుమార్తెలను భూమికి అప్పగించు. 19 వారితో ఇలా చెప్పు, ‘నీవు ఇతరులకంటే ఎక్కువ అందంగా ఉన్నావా? నీవు క్రిందికి దిగివెళ్లి, సున్నతిలేనివారి మధ్య పడుకో.’ 20 ఖడ్గం వలన చనిపోయినవారితో వారు కూలుతారు. ఖడ్గం దూయబడింది; ఆమెను తన అల్లరిమూకలన్నిటితో పాటు ఈడ్చుకుపోతారు. 21 పాతాళంలోని బలమైన నాయకులు ఈజిప్టు, దాని మిత్రుల గురించి ఇలా చెప్తారు, ‘వారు దిగి వచ్చారు, వారు సున్నతిలేని వారితో, ఖడ్గంతో చంపబడినవారితో పడుకున్నారు.’
22 “అష్షూరు దాని మొత్తం సైన్యంతో అక్కడే ఉంది; దాని చుట్టూ హతుల సమాధులు, ఖడ్గం వలన చంపబడినవారి సమాధులు ఉన్నాయి. 23 వారి సమాధులు పాతాళ అగాధాల్లో ఉన్నాయి, దాని సమాధుల చుట్టూ దాని సైన్యం పడి ఉంది. సజీవుల దేశంలో భయాన్ని వ్యాపింపజేసిన వారంతా ఖడ్గంతో చచ్చి పడి ఉన్నారు.
24 “సమాధి చుట్టూ ఏలాము దాని అల్లరిమూకలు ఉన్నాయి. వారందరూ చంపబడ్డారు, ఖడ్గంతో కూలారు. సజీవుల దేశంలో భయాన్ని వ్యాపింపజేసిన వారంతా సున్నతి పొందని వారిగా పాతాళంలోకి దిగివెళ్లే వారితో పాటు తమ అవమానాన్ని భరిస్తున్నారు. 25 చనిపోయినవారి మధ్య, దాని సమాధి చుట్టూ ఉన్న దాని అల్లరిమూకలకు దానికి పడక ఏర్పాటు చేయబడింది. వారందరూ సున్నతి లేకుండా ఖడ్గంతో చచ్చారు. సజీవుల దేశంలో భయాన్ని వ్యాపింపజేశారు కాబట్టి పాతాళానికి దిగివెళ్లే వారితో తమ అవమానాన్ని భరిస్తున్నారు; చనిపోయినవారి మధ్య వారు పడి ఉన్నారు.
26 “మెషెకు, తుబాలు తమ సమాధుల చుట్టూ తమ అల్లరిమూకలతో పాటు అక్కడ ఉన్నారు. వారంతా సున్నతిలేనివారు, ఖడ్గంతో చంపబడ్డారు ఎందుకంటే సజీవుల దేశంలో వారు భయాన్ని వ్యాపింపజేశారు. 27 అయితే వారు సున్నతిలేని వారిలో పతనమైన యోధులతో పడుకోరు,*కొ.ప్ర.లలో సున్నతిలేని యోధులు వారు యుద్ధ ఆయుధాలతో పాటు పాతాళానికి దిగివెళ్లి, తమ ఖడ్గాలను వారి తలల క్రింద, వారి డాళ్లుకొ.ప్ర.లలో శిక్ష వారి ఎముకల మీద పెట్టుకుని పడుకుంటారు; వీరు సజీవుల దేశంలో భయాన్ని పుట్టించారు కాబట్టి వీరి దోషం వీరి ఎముకలకు తగిలింది.
28 “ఫరో, నీవు కూడా సున్నతిలేనివారి మధ్య కత్తితో చంపబడినవారితో పాటు పడుకుంటావు.
29 “అక్కడ ఎదోము, దాని రాజులు యువరాజులు ఉన్నారు; వారికి శక్తి ఉన్నప్పటికీ, వారు ఖడ్గం చేత చంపబడినవారితో పాటు పడి ఉన్నారు. వారు సున్నతి పొందని వారితో, గొయ్యిలో దిగే వారితో పడుకుంటారు.
30 “ఉత్తర ప్రాంత అధిపతులందరు, అలాగే సీదోనీయులందరు అక్కడ ఉన్నారు; వారు తమ శక్తి వల్ల భీభత్సం సృష్టించినప్పటికీ చంపబడినవారితో దిగివెళ్లి అవమానానికి గురయ్యారు. వారు ఖడ్గం చేత చంపబడినవారితో సున్నతి పొందని వారిగా పడి ఉన్నారు, పాతాళానికి దిగివెళ్లే వారితో తమ అవమానాన్ని భరిస్తున్నారు.
31 “ఖడ్గంతో చంపబడిన ఫరో అతని సైన్యమంతా వారిని చూసి తమ అల్లరిమూకలన్నిటిని బట్టి ఓదార్పు పొందుతారు అని ప్రభువైన యెహోవా ప్రకటించారు. 32 సజీవుల దేశంలో భయాన్ని వ్యాపింపజేసేలా చేశాను కాబట్టి ఫరో అతనితో పాటు అతని సైన్యం సున్నతిలేని వారితోనూ ఖడ్గం చేత హతులైనవారితోనూ పడి ఉంటారు అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.”

*32:27 కొ.ప్ర.లలో సున్నతిలేని యోధులు

32:27 కొ.ప్ర.లలో శిక్ష