8
ఎజ్రాతో తిరిగివచ్చిన కుటుంబ పెద్దల జాబితా
1 రాజైన అర్తహషస్త పాలనలో నాతో కూడా బబులోను నుండి వచ్చిన కుటుంబ పెద్దలు వారితో పాటు నమోదైన వారి వివరాలు:
2 ఫీనెహాసు వారసుల నుండి:
గెర్షోము;
ఈతామారు వారసుల నుండి:
దానియేలు;
దావీదు వారసుల నుండి:
హట్టూషు 3 షెకన్యా వారసుల నుండి వచ్చినవాడు;
పరోషు వారసుల నుండి:
జెకర్యా, అతనితో పాటు నమోదైన 150 మంది పురుషులు;
4 పహత్-మోయాబు వారసుల నుండి:
జెరహ్యా కుమారుడైన ఎల్యోయేనై, అతనితో పాటు నమోదైన 200 మంది పురుషులు;
5 జట్టు*కొ.ప్ర.లలో జట్టు ఈ పేరు లేదు వారసుల నుండి:
షెకన్యా కుమారుడైన యహజీయేలు, అతనితో పాటు నమోదైన 300 మంది పురుషులు;
6 ఆదీను వారసుల నుండి:
యోనాతాను కుమారుడైన ఎబెదు, అతనితో పాటు నమోదైన 50 మంది పురుషులు;
7 ఏలాము వారసుల నుండి:
అతల్యా కుమారుడైన యెషయా, అతనితో పాటు నమోదైన 70 మంది పురుషులు;
8 షెఫట్యా వారసుల నుండి:
మిఖాయేలు కుమారుడైన జెబద్యా, అతనితో పాటు నమోదైన 80 మంది పురుషులు;
9 యోవాబు వారసుల నుండి:
యెహీయేలు కుమారుడైన ఓబద్యా, అతనితో పాటు నమోదైన 218 మంది పురుషులు;
10 బానీ†కొ.ప్ర.లలో బానీ ఈ పేరు లేదు వారసుల నుండి:
షెలోమీతు కుమారుడైన యోసిప్యా, అతనితో పాటు నమోదైన 160 మంది పురుషులు;
11 బేబై వారసుల నుండి:
బేబై కుమారుడైన జెకర్యా, అతనితో పాటు నమోదైన 28 మంది పురుషులు;
12 అజ్గాదు వారసుల నుండి:
హక్కాటాను కుమారుడైన యోహానాను, అతనితో పాటు నమోదైన 110 మంది పురుషులు;
13 అదోనీకాము వారసుల నుండి:
చివరి వారైన ఎలీఫెలెతు, యెహీయేలు, షెమయా, వారితో పాటు నమోదైన 60 మంది పురుషులు;
14 బిగ్వయి వారసుల నుండి:
ఊతై, జక్కూరు, వారితో పాటు నమోదైన 70 మంది పురుషులు.
యెరూషలేముకు తిరిగి వచ్చుట
15 అహవా వైపు ప్రవహించే ఓ కాలువ దగ్గర నేను వీరందరిని సమావేశపరిచాను. అక్కడ మేము మూడు రోజులు బస చేశాము. అక్కడ ఉన్న ప్రజలను యాజకులను పరిశీలించి నేను గ్రహించింది ఏంటంటే వారిలో లేవీయులెవ్వరూ లేరు. 16 కాబట్టి నేను నాయకులైన ఎలీయెజెరు, అరీయేలు, షెమయా, ఎల్నాతాను, యారీబు, ఎల్నాతాను, నాతాను, జెకర్యా, మెషుల్లాము అనే వారిని, అలాగే వివేచన కలిగిన యోయారీబు ఎల్నాతానులను పిలిపించి, 17 కాసిప్యా ప్రాంతంలో నాయకుడైన ఇద్దో దగ్గరకు వెళ్లమని ఆదేశించాను. వారు మా దేవుని మందిర సేవకులను మా దగ్గరకు తీసుకువచ్చేలా ఇద్దో అతని తోటి లేవీయులైన ఆలయ సేవకులకు ఏమి చెప్పాలో వారికి చెప్పాను. 18 మా దేవుని కరుణాహస్తం మాకు తోడుగా ఉన్నందుకు, వారు ఇశ్రాయేలు కుమారుడైన లేవీకి పుట్టిన మహలి వారసుడు, సమర్థుడైన షేరేబ్యాను, అతని కుమారులు, సహోదరులతో కలిపి మొత్తం 18 మందిని తీసుకువచ్చారు; 19 హషబ్యాను, అతనితో మెరారి వారసుడైన యెషయాను, అతని సోదరులను, వారి కుమారులను మొత్తం 20 మందిని తీసుకువచ్చారు. 20 వారితో పాటు లేవీయులకు సహాయంగా దావీదు అతని అధికారులు నిర్ణయించిన ఆలయ సేవకులలో నుండి 220 మందిని తీసుకువచ్చారు. వారందరి పేర్లు నమోదు చేయబడి ఉన్నాయి.
21 అప్పుడు అక్కడ అహవా కాలువ దగ్గర, మనమందరం ఉపవాసం ఉండి, మన దేవుని ఎదుట మనలను మనం తగ్గించుకుని మనకు మన పిల్లలకు మన ఆస్తి అంతటికి క్షేమకరమైన ప్రయాణాన్ని ఇవ్వమని వేడుకుందామని నేను ప్రకటించాను. 22 మేము రాజుతో, “మా దేవున్ని వెదికే ప్రతి ఒక్కరిపై ఆయన కరుణాహస్తం ఉంటుంది. ఆయనను విడిచిపెట్టినవారి మీద ఆయన తీవ్రమైన కోపం కుమ్మరించబడుతుంది” అని చెప్పాము కాబట్టి, దారిలో ఎదురయ్యే శత్రువులు నుండి కాపాడడానికి సైనికులు, గుర్రపురౌతులను మాకు సహాయంగా పంపమని రాజును అడగడానికి నేను సిగ్గుపడ్డాను. 23 కాబట్టి మేము ఉపవాసముండి, దీని గురించి మా దేవునికి మొరపెట్టగా, ఆయన మా ప్రార్థనకు జవాబిచ్చారు.
24 నేను యాజకులలో నుండి ముఖ్యమైన పన్నెండుమందిని అనగా, షేరేబ్యా, హషబ్యా, వారి సోదరులలో పదిమందిని ఎంపిక చేశాను. 25 రాజు అతని సలహాదారులు అధికారులు అక్కడ ఉన్న ఇశ్రాయేలీయులందరు మన దేవుని మందిరానికి విరాళంగా ఇచ్చిన వెండి బంగారాన్ని వస్తువులను తూచి నేను వారికి ఇచ్చాను. 26 నేను 650 తలాంతుల‡అంటే, సుమారు 24 టన్నులు వెండి, 100 తలాంతుల§అంటే, సుమారు 3 3/4 టన్నులు వెండి పాత్రలు, 100 తలాంతుల*అంటే, సుమారు 3 3/4 టన్నులు బంగారం 27 1,000 డారిక్కుల†అంటే, సుమారు 8.4 కి. గ్రా. లు బరువుగల 20 బంగారు గిన్నెలు, మేలిమి బంగారమంతా విలువైన రెండు మెరిసే ఇత్తడి పాత్రలు తూచి ఇచ్చాను.
28 నేను వారితో, “మీరు, ఈ వస్తువులతో పాటు యెహోవాకు ప్రతిష్ఠించబడ్డారు, ఈ వెండి బంగారాలు మీ పూర్వికుల దేవుడైన యెహోవాకు ఇష్టపూర్వకంగా ఇచ్చిన అర్పణ. 29 యెరూషలేములో యెహోవా మందిరపు ఖజానా గదుల్లో ముఖ్య యాజకులు, లేవీయులు, ఇశ్రాయేలీయుల కుటుంబ పెద్దల సమక్షంలో వీటిని తూచి అప్పగించే వరకు వీటిని జాగ్రత్తగా కాపాడండి” అని చెప్పాను. 30 అప్పుడు యాజకులు, లేవీయులు, యెరూషలేములోని దేవుని ఆలయానికి తీసుకుని వెళ్లడానికి తూచిన వెండి బంగారాలను, పవిత్ర పాత్రలను తీసుకున్నారు.
31 అహవా కాలువ దగ్గర నుండి మొదటి నెల పన్నెండవ రోజున మేము యెరూషలేముకు రావాలని బయలుదేరాము. మా దేవుని హస్తం మాకు తోడుగా ఉండి, శత్రువుల నుండి, దారిలో పొంచి ఉండే బందిపోట్లు నుండి ఆయన మమ్మల్ని కాపాడారు. 32 కాబట్టి మేము యెరూషలేముకు వచ్చి మూడు రోజులు అక్కడే బస చేశాము.
33 నాలుగవ రోజున మా దేవుని మందిరంలో, వెండి బంగారాలను, పవిత్ర పాత్రలను తూకం వేసి, యాజకుడును ఊరియా కుమారుడునైన మెరేమోతుకు అప్పగించాము. అతనితో పాటు ఫీనెహాసు కుమారుడైన ఎలియాజరు, లేవీయులైన యెషూవ కుమారుడైన యోజాబాదు, బిన్నూయి కుమారుడైన నోవద్యా ఉన్నారు. 34 ఆ సమయంలో ప్రతిదాన్ని సంఖ్య ప్రకారం, బరువు ప్రకారం లెక్కించారు, వాటి మొత్తం బరువును నమోదు చేశారు.
35 తర్వాత చెర నుండి విడుదలై తిరిగివచ్చిన ప్రవాసులు ఇశ్రాయేలీయుల దేవునికి దహనబలిగా ఇశ్రాయేలీయులందరి కోసం పన్నెండు ఎడ్లు, తొంభై ఆరు పొట్టేళ్లు, డెబ్బై ఏడు గొర్రెపిల్లలను పాపపరిహారబలిగా పన్నెండు మేకపోతులను అర్పించారు. ఇదంతా యెహోవాకు అర్పించిన దహనబలి. 36 వారు రాజు ఆదేశాలను రాజు అధికారులకు, యూఫ్రటీసు నది అవతలనున్న అధిపతులకు అప్పగించిన తర్వాత, వారందరు ప్రజలకు, దేవుని మందిర పనికి సహాయపడ్డారు.