6
అందరికి మంచి చేయడం
1 సహోదరీ సహోదరులారా, ఎవరైనా పాపంలో చిక్కుకొని ఉంటే, ఆత్మ వల్ల జీవిస్తున్న మీరు వారిని మృదువుగా సరియైన మార్గంలోనికి మరలా తీసుకురండి. అంతేకాక మీరు కూడా శోధనలో పడిపోవచ్చు కాబట్టి మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. 2 ఒకరి భారాలను ఒకరు మోయండి, ఈ విధంగా మీరు క్రీస్తు ధర్మాన్ని నెరవేరుస్తారు. 3 ఎవరైనా తమలో ఏ గొప్పతనం లేకపోయినా తాము గొప్పవారమని భావిస్తే వారు తమను తామే మోసపరచుకుంటారు. 4 ప్రతి ఒక్కరూ తమ తమ పనులను పరీక్షించుకోవాలి. అప్పుడు ఇతరులతో తమను పోల్చుకోకుండా కేవలం తమను బట్టి తామే గర్వపడగలరు. 5 ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎవరి భారాలను వారే మోయాలి. 6 వాక్యోపదేశం పొందినవారు తమకు ఉపదేశించినవానితో మంచి వాటన్నిటిని పంచుకోవాలి.
7 మోసపోవద్దు, దేవుడు వెక్కిరింపబడరు. ఒకరు దేన్ని విత్తుతారో దాని పంటనే కోస్తారు. 8 తమ శరీరాలను సంతోషపరచడానికి విత్తేవారు తమ శరీరం నుండి నాశనమనే పంట కోస్తారు. తమ ఆత్మను సంతోషపరచడానికి విత్తేవారు తమ ఆత్మ నుండి నిత్యజీవమనే పంటను కోస్తారు. 9 మంచి చేయడంలో మనం అలసి పోవద్దు ఎందుకంటే మానక చేస్తే తగిన కాలంలో మనం పంటను కోస్తాము. 10 కాబట్టి, మనకున్న అవకాశాన్ని బట్టి ప్రజలందరికి మరి ముఖ్యంగా విశ్వాసుల కుటుంబానికి చెందిన వారికి మంచి చేద్దాము.
సున్నతి కాదు కాని నూతన సృష్టి
11 నా స్వహస్తాలతో పెద్ద అక్షరాలను ఉపయోగించి మీకు వ్రాస్తున్నాను!
12 శరీర సంబంధమైన వాటితో ప్రజలను ఆకట్టుకోవాలని అనుకునేవారు సున్నతి పొందాలని మిమ్మల్ని బలవంతం చేయడానికి ప్రయత్నిస్తారు. క్రీస్తు సిలువ కోసం హింసించబడకుండ ఉండడానికే వారు ఇలా చేస్తారు. 13 సున్నతి పొందినవారు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడం లేదు కాని శరీరానుసారమైన మీ సున్నతిని గురించి వారు గొప్పలు చెప్పుకోడానికి మీరు సున్నతి పొందాలని వారు కోరుచున్నారు. 14 మన ప్రభువైన యేసు క్రీస్తు సిలువలో తప్ప మరి దేనిలో నేను అతిశయపడను. ఆ సిలువ ద్వారానే నాకు లోకం, లోకానికి నేను సిలువ వేయబడి ఉన్నాము. 15 సున్నతి పొందినా పొందకపోయినా అది లెక్కకు రాదు. నూతన సృష్టి మాత్రమే లెక్కించబడుతుంది. 16 ఈ నియమాన్ని అనుసరించే వారందరికి అనగా దేవుని ఇశ్రాయేలుకు సమాధానం కనికరం కలుగుతాయి.
17 నేను నా శరీరంపై యేసు గుర్తులను కలిగి ఉన్నాను, కాబట్టి ఇకపై ఎవరూ నన్ను శ్రమ పెట్టవద్దు.
18 సహోదరీ సహోదరులారా, మన ప్రభువైన యేసు క్రీస్తు కృప మీ ఆత్మతో ఉండును గాక ఆమేన్.