29
యాకోబు పద్దనరాముకు చేరతాడు
1 యాకోబు తన ప్రయాణం కొనసాగించి తూర్పు ప్రజల దేశానికి వచ్చాడు. 2 అక్కడ ఒక బహిరంగ పొలంలో అతనికి ఒక బావి కనిపించింది. అక్కడ మూడు గొర్రె మందలు దాని దగ్గర పడుకుని ఉన్నాయి, కాపరులు ఆ బావి నీళ్లు వాటికి పెడతారు. ఆ బావి మీద పెద్ద రాయి మూత పెట్టి ఉంది. 3 మందలన్నీ కూడి రాగానే కాపరులు ఆ బావి మీద నుండి రాయిని దొర్లించి, గొర్రెలకు నీళ్లుపెట్టి, రాయి మూతను తిరిగి బావి మీద పెడతారు.
4 యాకోబు కాపరులను చూసి, “సోదరులారా, మీరు ఎక్కడి వారు?” అని అడిగాడు.
వారు, “మేము హారాను వారం” అని జవాబిచ్చారు.
5 అతడు, “నాహోరు మనవడు, లాబాను మీకు తెలుసా?” అని వారిని అడిగాడు.
వారు, “అవును, తెలుసు” అని చెప్పారు.
6 అప్పుడు యాకోబు, “లాబాను క్షేమమేనా?” అని అడిగాడు.
“అవును, అతడు క్షేమమే, అదిగో, అతని కుమార్తె రాహేలు గొర్రెల మందతో వస్తుంది” అని వారు చెప్పారు.
7 యాకోబు, “ఇంకా ప్రొద్దుగుంకలేదు; మందలను తీసుకెళ్లే సమయం కాలేదు. గొర్రెలకు నీళ్లు పెట్టుకోండి, వాటిని మేపుకోండి” అన్నాడు.
8 “మందలన్నీ పోగయ్యేవరకు వాటికి నీళ్లు పెట్టలేము. బావి మీది నుండి రాయి దొర్లిస్తారు, అప్పుడు మేము గొర్రెలకు నీళ్లు పెడతాం” అని వారు జవాబిచ్చారు.
9 యాకోబు వారితో ఇంకా మాట్లాడుతుండగా, రాహేలు తన తండ్రి గొర్రెలతో వచ్చింది, ఆమె కూడా కాపరి. 10 యాకోబు తన మామ లాబాను కుమార్తెయైన రాహేలును, తన మామ మందను చూడగానే, అతడు వెళ్లి బావి మీద ఉన్న రాయిని దొర్లించి తన మామ మందకు నీళ్లు పెట్టాడు. 11 తర్వాత యాకోబు రాహేలును ముద్దు పెట్టుకుని బిగ్గరగా ఏడ్చాడు. 12 అతడు తన తండ్రి బంధువని, రిబ్కా కుమారుడని రాహేలుతో చెప్పాడు. కాబట్టి ఆమె పరుగెత్తుకుంటూ వెళ్లి తన తండ్రికి చెప్పింది.
13 తన సోదరి కుమారుడైన యాకోబును గురించిన సమాచారం విన్న వెంటనే, లాబాను అతన్ని కలవడానికి త్వరపడ్డాడు. అతన్ని హత్తుకుని, ముద్దుపెట్టి, తన ఇంటికి తీసుకెళ్లాడు, అక్కడ యాకోబు అన్ని విషయాలు అతనికి చెప్పాడు. 14 లాబాను అతనితో, “నీవు నా సొంత శరీరం, రక్తం” అన్నాడు.
యాకోబు లేయాను రాహేలును పెళ్ళి చేసుకోవడం
ఒక పూర్తి నెల యాకోబు అతనితో ఉన్న తర్వాత, 15 లాబాను అతనితో, “నీవు నా బంధువైనంత మాత్రాన ఏమి తీసుకోకుండ నా కోసం పని చేస్తావా? నీకు జీతంగా ఏమి కావాలో చెప్పు” అని అన్నాడు.
16 లాబానుకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు; పెద్దకుమార్తె పేరు లేయా, చిన్న కుమార్తె పేరు రాహేలు. 17 లేయాకు బలహీనమైన*లేదా సున్నితమైన హెబ్రీలో ఈ పదానికి అర్థం స్పష్టంగా లేదు కళ్లు ఉన్నాయి, కాని రాహేలు రూపవతి, అందగత్తె. 18 యాకోబు రాహేలుతో ప్రేమలో ఉండి, “నీ చిన్న కుమార్తె రాహేలు కోసం నేను నీ దగ్గర ఏడు సంవత్సరాలు సేవ చేస్తాను” అన్నాడు.
19 లాబాను, “ఆమెను పరాయి మనుష్యునికి ఇవ్వడం కంటే నీకివ్వడం మంచిది. నా దగ్గరే పని చేస్తూ ఉండు” అన్నాడు. 20 యాకోబు రాహేలు కోసం ఏడు సంవత్సరాలు పని చేశాడు, అయితే తనకు రాహేలు పట్ల ఉన్న ప్రేమను బట్టి అతనికి ఆ ఏడు సంవత్సరాలు కొద్దిరోజులే అనిపించింది.
21 తర్వాత యాకోబు లాబానుతో, “నా భార్యను నాకు ఇవ్వు, నా గడువు తీరింది. నేను ఆమెతో పడుకుంటాను” అని అన్నాడు.
22 కాబట్టి లాబాను ఆ ప్రాంత ప్రజలందరినీ సమావేశపరిచి విందు చేశాడు. 23 అయితే అతడు రాత్రివేళలో తన కుమార్తె లేయాను యాకోబుకు ఇచ్చాడు, యాకోబు తనతో పడుకున్నాడు. 24 లాబాను తన దాసి జిల్పాను తన కుమార్తెయైన లేయాకు దాసిగా ఇచ్చాడు.
25 తెల్లవారినప్పుడు యాకోబు లేచి చూస్తే, అతనితో ఉన్నది లేయా! కాబట్టి యాకోబు లాబానును, “నీవు చేసింది ఏంటి? నేను రాహేలు కోసం నీకు పని చేశాను కదా; నీవు నన్నెందుకు మోసం చేశావు?” అని అడిగాడు.
26 లాబాను జవాబిస్తూ, “పెద్దకుమార్తెకు ముందు చిన్న కుమార్తెను ఇవ్వడం మా ఆచారం కాదు. 27 లేయాతో వైవాహిక వారం గడువు ముగించు. తర్వాత మరో ఏడు సంవత్సరాలు నా దగ్గర పని చేస్తే రాహేలును కూడా నీకిస్తాను” అని అన్నాడు.
28 యాకోబు అలాగే చేశాడు. లేయాతో తన వారం ముగించుకున్న తర్వాత లాబాను తన కుమార్తె రాహేలును అతనికి భార్యగా ఇచ్చాడు. 29 లాబాను తన దాసి బిల్హాను తన కుమార్తెయైన రాహేలుకు దాసిగా ఇచ్చాడు. 30 యాకోబు రాహేలుతో కూడా పడుకున్నాడు, అతడు లేయాకంటే రాహేలును ఎక్కువ ప్రేమించాడు కాబట్టి అతడు లాబాను కోసం ఇంకా ఏడు సంవత్సరాలు పని చేశాడు.
యాకోబు పిల్లలు
31 లేయా ప్రేమించబడడం లేదని యెహోవా చూసి, ఆమె గర్భవతి అయ్యేలా ఆయన కరుణించారు, కాని రాహేలు గొడ్రాలిగా ఉంది. 32 లేయా గర్భవతియై ఒక కుమారునికి జన్మనిచ్చింది. “యెహోవా నా బాధను చూశారు. ఇప్పుడు తప్పకుండ నా భర్త నన్ను ప్రేమిస్తాడు” అని చెప్పి, అతనికి రూబేను†రూబేను హెబ్రీలో ఆయన నా బాధను చూశారు; పేరు అర్థం చూడు, కుమారుడు అని పేరు పెట్టింది.
33 ఆమె మళ్ళీ గర్భవతియై కుమారుని కని, “నేను ప్రేమించబడడం లేదని యెహోవా విన్నారు కాబట్టి, ఇతన్ని కూడా నాకు ఇచ్చారు” అని చెప్పి, అతనికి షిమ్యోను‡షిమ్యోను దీని అర్థం వినేవాడు అని పేరు పెట్టింది.
34 లేయా మళ్ళీ గర్భవతియై కుమారుని కని, “నా భర్తకు నేను ముగ్గురు కుమారులను కన్నాను కాబట్టి ఇప్పుడు నన్ను అంటిపెట్టుకుని ఉంటాడు” అని ఆమె అతనికి లేవీ§లేవీ హెబ్రీ నుండి వచ్చిన పదం; దీని అర్థం అంటిపెట్టుకుని అని పేరు పెట్టింది.
35 ఆమె మళ్ళీ గర్భవతియై కుమారుని కని, “ఈసారి నేను యెహోవాను స్తుతిస్తాను” అని ఆమె అతనికి యూదా*యూదా హెబ్రీ నుండి వచ్చిన పదం; దీని అర్థం స్తుతి అని పెట్టింది. తర్వాత ఆమె పిల్లలు కనడం ఆగిపోయింది.