39
యోసేపు, పోతీఫరు భార్య 
  1 యోసేపు ఈజిప్టుకు కొనిపోబడ్డాడు. ఫరో అధికారులలో ఒకడు, రాజ సంరక్షక సేనాధిపతియైన పోతీఫరు అనే ఈజిప్టువాడు యోసేపును తీసుకెళ్లిన ఇష్మాయేలీయుల దగ్గర అతన్ని కొన్నాడు.   
 2 యెహోవా యోసేపుతో ఉన్నారు కాబట్టి అతడు వర్ధిల్లాడు, తన ఈజిప్టు యజమాని ఇంట్లో ఉన్నాడు.   3 యెహోవా అతనితో ఉన్నారని, అతడు చేసే ప్రతి పనిలో యెహోవా విజయం ఇచ్చారని అతని యజమాని చూసినప్పుడు   4 యోసేపు అతని దృష్టిలో దయ పొందాడు, అతనికి వ్యక్తిగత పరిచారకుడయ్యాడు. పోతీఫరు యోసేపును అతని ఇంటికి అధికారిగా నియమించి తనకున్న సమస్తాన్ని అతని పర్యవేక్షణలో పెట్టాడు.   5 తన ఇంటికి, తన సమస్తానికి యోసేపును అధికారిగా నియమించినప్పటి నుండి, యెహోవా ఈజిప్టు యజమాని ఇంటిని ఆశీర్వదించారు. ఇంట్లోనూ, పొలంలోనూ పోతీఫరుకు ఉన్న సమస్తం మీద యెహోవా ఆశీర్వాదం ఉంది.   6 కాబట్టి పోతీఫరు సమస్తాన్ని యోసేపు పర్యవేక్షణలో పెట్టాడు; యోసేపు అధికారిగా ఉన్నందుకు తన భోజనం తప్ప మరి దేని గురించి అతడు పట్టించుకోలేదు.  
యోసేపు మంచి రూపం కలిగినవాడు, అందగాడు.   7 కొంతకాలం తర్వాత తన యజమాని భార్య అతని మీద కన్నేసి, “నాతో పడుకో!” అని అన్నది.   
 8 కానీ అతడు తిరస్కరించాడు. “నా యజమాని నన్ను అధికారిగా నియమించి ఇంట్లో నేనున్నాననే నమ్మకంతో తాను నిశ్చింతగా ఉన్నారు. తన సమస్తాన్ని నా పర్యవేక్షణలో ఉంచాడు.   9 ఈ ఇంట్లో నాకన్నా పైవాడు లేడు. మీరు తన భార్య కాబట్టి నా యజమాని మిమ్మల్ని తప్ప మిగతాదంతా నాకు అప్పగించాడు. కాబట్టి దేవునికి విరుద్ధంగా అలాంటి చెడ్డపని నేను ఎలా చేయగలను?” అని అన్నాడు.   10 ప్రతిరోజు ఆమె యోసేపుతో మాట్లాడుతూ ఉన్నప్పటికీ, ఆమెతో పడుకోడానికి లేదా ఆమెతో ఉండడానికి కూడా అతడు తిరస్కరించారు.   
 11 ఒక రోజు అతడు ఇంట్లో తన పనులు చేసుకోవడానికి వెళ్లాడు, అప్పుడు ఇంట్లో పనివారు ఎవరు లేరు.   12 ఆమె అతని అంగీ పట్టుకుని లాగి, “నాతో పడుకో!” అని అన్నది. అయితే అతడు తన అంగీ ఆమె చేతిలో వదిలేసి ఇంట్లోనుండి తప్పించుకుపోయాడు.   
 13 అతడు తన అంగీని ఆమె చేతిలో వదిలేసి ఇంట్లోనుండి తప్పించుకుపోయాడని చూసి,   14 తన ఇంటి పనివారిని పిలిచి, “చూడండి, నా భర్త మనలను అవమానించాలని ఈ హెబ్రీయున్ని తెచ్చాడు. అతడు నాతో శయనించాలని లోనికి వచ్చాడు కానీ నేను కేకలు పెట్టాను.   15 సహాయం కోసం నేను పెట్టిన కేకలు విని, తన అంగీని నా ప్రక్కన వదిలేసి పారిపోయాడు” అని చెప్పింది.   
 16 తన యజమాని ఇంటికి వచ్చేవరకు అతని అంగీని ఆమె ప్రక్కనే పెట్టుకుంది.   17 తర్వాత అతనికి ఈ కథ చెప్పింది: “నీవు తీసుకువచ్చిన ఆ హెబ్రీ బానిస నా దగ్గరకు వచ్చి నన్ను లోబరచుకోవాలని చూశాడు.   18 నేను సహాయం కోసం కేకలు పెట్టిన వెంటనే, తన అంగీని నా ప్రక్కన వదిలేసి ఇంట్లోనుండి పారిపోయాడు.”   
 19 అతని యజమాని, “నీ దాసుడు ఇలా ప్రవర్తించాడు” అని తన భార్య చెప్పిన కథ విని కోపంతో రగిలిపోయాడు.   20 యోసేపు యజమాని అతన్ని రాజద్రోహులనుంచే చెరసాలలో పడవేశాడు.  
అయితే యోసేపు అక్కడే చెరసాలలో ఉన్నప్పుడు,   21 యెహోవా అతనితో ఉన్నారు; ఆయన అతనిపై దయ చూపించారు, చెరసాల అధికారి దృష్టిలో అతనిపై దయ కలిగించారు.   22 కాబట్టి చెరసాల అధికారి చెరసాలలో ఉన్నవారందరిపై యోసేపుకు అధికారం ఇచ్చాడు, అక్కడ జరిగే అంతటి మీద అతనికి బాధ్యత అప్పగించాడు.   23 చెరసాల అధికారి యోసేపు ఆధీనంలో ఉన్నవాటి గురించి చింతించలేదు, ఎందుకంటే యెహోవా యోసేపుతో ఉన్నారు, అతడు చేసే అన్నిటిలో విజయాన్ని ఇచ్చారు.