3
హబక్కూకు ప్రార్థన 
  1 ప్రవక్తయైన హబక్కూకు చేసిన ప్రార్థన. షిగియోనోతు.  
  2 యెహోవా, నీ కీర్తి గురించి విన్నాను;  
యెహోవా, నీ క్రియలకు నేను భయపడుతున్నాను.  
మా దినాల్లో వాటిని మళ్ళీ చేయండి,  
మా కాలంలో వాటిని తెలియజేయండి;  
ఉగ్రతలో కరుణించడం జ్ఞాపకముంచుకోండి.   
 3 దేవుడు తేమాను నుండి వచ్చాడు,  
పరిశుద్ధుడు పారాను పర్వతం నుండి వచ్చాడు. 
సెలా
  ఆయన మహా వైభవం ఆకాశాలను కప్పివేసింది  
భూమి ఆయన స్తుతితో నిండింది.   
 4 ఆయన తేజస్సు సూర్యకాంతిలా ఉంది;  
ఆయన చేతిలో నుండి కిరణాలు బయలువెళ్తున్నాయి,  
అక్కడ ఆయన శక్తి దాగి ఉంది.   
 5 ఆయనకు ముందుగా తెగులు వెళ్లింది;  
అంటువ్యాధి ఆయన పాదాలను అనుసరించింది.   
 6 ఆయన నిలబడగా భూమి కంపించింది;  
ఆయన చూడగా దేశాలు వణికాయి.  
పురాతన పర్వతాలు కూలిపోయాయి  
పురాతన కొండలు అణగిపోయాయి  
కానీ ఆయన మార్గాలు శాశ్వతమైనవి.   
 7 భయంలో ఉన్న కూషీయుల గుడారాలను,  
వేదనలో ఉన్న మిద్యానువాసుల నివాసాలను నేను చూశాను.   
 8 యెహోవా, నీవు నదులపై కోపంగా ఉన్నావా?  
ప్రవాహాల మీద నీ ఉగ్రత ఉందా?  
సముద్రంపై కోపం వచ్చిందా?  
అందుకే నీవు నీ గుర్రాల మీద స్వారీ చేస్తూ  
నీ విజయ రథాలను ఎక్కి వస్తున్నావా?   
 9 వరలో నుండి నీ విల్లు తీసావు,  
నీ వాక్కుతోడని ప్రమాణం చేసి నీ బాణాలను సిద్ధం చేశావు. 
సెలా
  నీవు భూమిని చీల్చి నదులను ప్రవహింపజేశావు;   
 10 పర్వతాలు నిన్ను చూసి వణికాయి.  
నీళ్లు ప్రవాహాలుగా ప్రవహిస్తాయి;  
అగాధం ఘోషిస్తూ  
తన అలలను పైకి లేపుతుంది.   
 11 ఎగిరే నీ బాణాల కాంతికి  
నీ ఈటె తళతళ మెరుపుకు  
సూర్యచంద్రులు తమ ఆకాశంలో స్థానాల్లో నిలిచిపోతాయి.   
 12 ఉగ్రతతో నీవు భూమిమీద తిరుగుతున్నావు  
ఆగ్రహంతో దేశాలను అణగద్రొక్కుతున్నావు.   
 13 నీ ప్రజలను విడిపించడానికి,  
నీ అభిషిక్తుని రక్షించడానికి నీవు బయలుదేరుతున్నావు.  
దుర్మార్గపు దేశపు నాయకుడిని నీవు కూలద్రోసి,  
తల నుండి పాదం ఖండించి నిర్మూలం చేస్తున్నావు. 
సెలా
    14 దాక్కున్న దౌర్భాగ్యులను మ్రింగివేసేందుకు  
ఉవ్విళ్లూరుతూ, మనల్ని చెదరగొట్టడానికి  
అతని యోధులు దూసుకుని వచ్చినప్పుడు,  
అతని తలలో మీరు అతని ఈటెనే గుచ్చారు.   
 15 నీవు నీ గుర్రాలతో సముద్రాన్ని త్రొక్కించావు,  
గొప్ప జలాలను చిలుకుతున్నావు.   
 16 నేను వినగా నా గుండె కొట్టుకుంది,  
ఆ శబ్దానికి నా పెదవులు వణుకుతున్నాయి;  
నా ఎముకలు కుళ్లిపోతున్నాయి,  
నా కాళ్లు వణికాయి.  
అయినా మనపై దాడి చేస్తున్న దేశం మీదికి  
విపత్తు సంభవించే దినం వచ్చేవరకు నేను ఎదురుచూస్తూ ఉంటాను.   
 17 అంజూరపు చెట్టు పూత పూయకపోయినా  
ద్రాక్షచెట్టుకు పండ్లు లేకపోయినా,  
ఒలీవచెట్లు కాపు కాయకపోయినా  
పొలాలు పంట ఇవ్వకపోయినా,  
దొడ్డిలో గొర్రెలు లేకపోయినా  
శాలలో పశువులు లేకపోయినా,   
 18 నేను యెహోవాయందు ఆనందిస్తాను,  
నా రక్షకుడైన దేవునియందు నేను సంతోషిస్తాను.   
 19 ప్రభువైన యెహోవాయే నా బలం;  
ఆయన నా కాళ్లను లేడికాళ్లలా చేస్తాడు,  
ఎత్తైన స్థలాల మీద ఆయన నన్ను నడిపిస్తారు.  
సంగీత దర్శకుని కోసము. తంతి వాయిద్యాలపై పాడదగినది.