13
ఇశ్రాయేలుపై యెహోవా కోపం 
  1 ఎఫ్రాయిం మాట్లాడినప్పుడు ప్రజలు వణికారు;  
అతడు ఇశ్రాయేలులో ఘనపరచబడ్డాడు.  
కాని అతడు బయలును పూజించి అపరాధిగా చనిపోయాడు.   
 2 ఇప్పుడు వారు మరి ఎక్కువ పాపం చేస్తున్నారు;  
వారు వెండితో తమ కోసం విగ్రహాలను చేసుకుంటున్నారు,  
అవి నైపుణ్యంతో చేయబడిన ప్రతిమలు,  
అవన్నీ కళాకారుని చేతిపనులు.  
ఈ ప్రజల గురించి ఇలా చెప్తారు,  
“వారు నరబలులు అర్పిస్తారు!  
దూడ విగ్రహాలను ముద్దు పెట్టుకుంటారు!”   
 3 కాబట్టి వారు ఉదయకాలపు పొగలా ఉంటారు,  
ఉదయకాలపు మంచులా అదృశ్యం అవుతారు,  
నూర్పిడి కళ్ళంలో నుండి గాలికి ఎగిరే పొట్టులా ఉంటారు,  
కిటికీలో గుండా పోయే పొగలా అయిపోతారు.   
 4 “మీరు ఈజిప్టు నుండి బయటకు వచ్చినప్పటి నుండి  
యెహోవానైన నేను మీకు దేవునిగా ఉన్నాను;  
మీరు నన్ను తప్ప మరే దేవున్ని అంగీకరించకూడదు,  
నేను తప్ప రక్షకుడు ఎవరూ లేరు.   
 5 మీరు తీవ్రమైన వేడిగల అరణ్యంలో ఉన్నప్పుడు,  
నేను మిమ్మల్ని సంరక్షించాను.   
 6 నేను వారిని పోషించగా వారు తృప్తి చెందారు.  
వారు తృప్తి చెందిన తర్వాత గర్వించి;  
నన్ను మరచిపోయారు.   
 7 కాబట్టి నేను వారికి సింహంలా ఉంటాను,  
చిరుతపులిలా దారిలో పొంచి ఉంటాను.   
 8 పిల్లలు పోయిన ఎలుగుబంటిలా,  
నేను వారిపై పడి వారిని చీల్చివేస్తాను;  
సింహంలా వారిని మ్రింగివేస్తాను,  
అడవి మృగంలా వారిని చీల్చివేస్తాను.   
 9 “ఇశ్రాయేలూ! నీవు నాశనమవుతావు  
ఎందుకంటే నీవు నీ సహాయకుడనైన నాకు విరుద్ధంగా ఉన్నావు.   
 10 నిన్ను కాపాడగలిగే నీ రాజు ఎక్కడా?  
మీ పట్టణాలన్నిటిలో ఉండే మీ అధిపతులు ఎక్కడా?  
వారి గురించి నీవు, ‘నాకు రాజును అధిపతులను ఇవ్వండి’  
అని నీవు అడిగావు కదా?   
 11 కాబట్టి నేను కోపంలో నీకు రాజును ఇచ్చాను.  
నా ఆగ్రహంతో అతన్ని తొలగించాను.   
 12 ఎఫ్రాయిం అపరాధం పోగుచేయబడింది,  
అతని పాపాలు వ్రాయబడ్డాయి.   
 13 ప్రసవ వేదనలాంటి శ్రమ అతనికి కలుగుతుంది,  
కాన్పు సమయం వచ్చినప్పుడు కాని అతడు జ్ఞానంలేని శిశువుగా ఉన్నాడు;  
గర్భం నుండి బయటకు రాని శిశువులా  
అతడు జ్ఞానంలేనివానిగా ఉన్నాడు.   
 14 “నేను ఈ ప్రజలను పాతాళం శక్తి నుండి విడిపిస్తాను;  
మరణం నుండి వారిని విమోచిస్తాను.  
ఓ మరణమా, నీవు కలిగించే తెగుళ్ళు ఎక్కడ?  
ఓ పాతాళమా, నీవు కలిగించే నాశనం ఎక్కడ?  
“అతడు తన సోదరుల మధ్య ఎదుగుతున్నా సరే,   
 15 నేను ఎఫ్రాయిం పట్ల దయ చూపించను.  
యెహోవా నుండి తూర్పు గాలి వస్తుంది,  
ఎడారి నుండి అది వీస్తుంది.  
అతని నీటిబుగ్గ ఎండిపోతుంది  
అతని బావి ఇంకిపోతుంది.  
అతని ధననిధులు, ప్రియమైన వస్తువులు దోచుకోబడతాయి.   
 16 సమరయ ప్రజలు తమ అపరాధాన్ని భరించాలి,  
ఎందుకంటే వారు తమ దేవుని మీద తిరుగుబాటు చేశారు.  
వారు ఖడ్గానికి కూలుతారు;  
వారి చంటి పిల్లలు నేలకు కొట్టబడతారు,  
వారి గర్భిణీల కడుపులు చీల్చబడతాయి.”