2
యెహోవా పర్వతం
యూదా గురించి, యెరూషలేము గురించి ఆమోజు కుమారుడైన యెషయాకు వచ్చిన దర్శనం:
 
చివరి రోజుల్లో
యెహోవా మందిరం
పర్వతాలన్నిటిలో ఉన్నతమైనదిగా స్థిరపరచబడుతుంది;
అది కొండలకు పైగా హెచ్చింపబడుతుంది,
జనాంగాలన్నీ దాని దగ్గరకు ప్రవాహంలా వెళ్తారు.
చాలా జనాంగాలు వచ్చి ఇలా అంటారు,
“రండి, మనం యెహోవా పర్వతం మీదికి,
యాకోబు దేవుని ఆలయానికి వెళ్దాము.
మనం ఆయన మార్గంలో నడిచేలా,
ఆయన మనకు తన మార్గాల్ని బోధిస్తారు.”
సీయోనులో నుండి ధర్మశాస్త్రం,
యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయటకు వెళ్తాయి.
ఆయన దేశాల మధ్య తీర్పు తీరుస్తారు,
అనేక జనాంగాల వివాదాలను పరిష్కరిస్తారు.
వారు తమ ఖడ్గాలను సాగగొట్టి నాగటి నక్కులుగా,
తమ ఈటెలను సాగగొట్టి మడ్డికత్తులుగా చేస్తారు.
ఒక దేశం మరొక దేశం మీద ఖడ్గం ఎత్తదు,
వారు ఇకపై యుద్ధానికి శిక్షణ పొందరు.
 
యాకోబు వారసులారా రండి,
మనం యెహోవా వెలుగులో నడుద్దాము.
యెహోవా దినం
యెహోవా, యాకోబు వారసులైన
మీ ప్రజలను మీరు విడిచిపెట్టారు.
వారు తూర్పు దేశాలకున్న మూఢనమ్మకాలతో నిండి ఉన్నారు;
వారు ఫిలిష్తీయుల్లా భవిష్యవాణి చూస్తారు,
ఇతరుల ఆచారాలను పాటిస్తారు.
వారి దేశం వెండి బంగారాలతో నిండి ఉంది;
వారి ధనానికి అంతులేదు.
వారి దేశం గుర్రాలతో నిండి ఉంది;
వారి రథాలకు అంతులేదు.
వారి దేశం విగ్రహాలతో నిండి ఉంది.
వారు తమ చేతులతో చేసిన వాటికి,
తమ వ్రేళ్లతో చేసిన వాటికి తలవంచి నమస్కరిస్తారు.
కాబట్టి ప్రజలు అణచివేయబడతారు
ప్రతి ఒక్కరు తగ్గించబడతారు
వారిని క్షమించకండి.*లేదా వారిని లేవనెత్తకండి
 
10 యెహోవా భీకర సన్నిధి నుండి,
ఆయన ప్రభావ మహాత్మ్యం నుండి
బండ సందులకు వెళ్లి నేలలో దాక్కోండి.
11 మనుష్యుల అహంకారపు చూపు తగ్గించబడుతుంది,
మనుష్యుల గర్వం అణచివేయబడుతుంది;
ఆ రోజున యెహోవా మాత్రమే ఘనత పొందుతారు.
 
12 సైన్యాల యెహోవా
అహంకారం, గర్వం ఉన్న ప్రతివారి కోసం
హెచ్చింపబడిన వాటన్నిటి కోసం ఒక రోజును నియమించారు.
(అవి అణచివేయబడతాయి),
13 ఎందుకంటే ఎత్తైన పొడవైన లెబానోను దేవదారు చెట్లన్నిటికి,
బాషాను సింధూర వృక్షాలన్నిటికి,
14 పెద్ద పర్వతాలన్నిటికి,
ఎత్తైన కొండలన్నిటికి
15 ఉన్నతమైన ప్రతి గోపురానికి
ప్రతి కోటగోడకు,
16 ప్రతీ వాణిజ్య నౌకకుహెబ్రీలో తర్షీషు ఓడలన్నిటికి
మనోహరమైన నౌకలకు ఒక రోజును నియమించారు.
17 మనుష్యుల అహంకారం అణచివేయబడుతుంది
మానవుల గర్వం తగ్గించబడుతుంది;
ఆ రోజు యెహోవా మాత్రమే ఘనపరచబడతారు.
18 విగ్రహాలు పూర్తిగా అదృశ్యమవుతాయి.
 
19 యెహోవా భూమిని వణికించడానికి లేచినప్పుడు,
ఆయన భీకర సన్నిధి నుండి
ఆయన ప్రభావ మహాత్మ్యం నుండి పారిపోయి
వారు కొండల గుహల్లో
నేలలో ఉన్న సందుల్లో దాక్కుంటారు.
20 ఆ రోజున మనుష్యులు
తాము పూజించడానికి తయారుచేసుకున్న
వెండి విగ్రహాలను బంగారు విగ్రహాలను
ఎలుకలకు గబ్బిలాలకు పారేస్తారు.
21 యెహోవా భూమిని వణికించడానికి లేచినప్పుడు,
ఆయన భీకర సన్నిధి నుండి పారిపోయి
ఆయన ప్రభావ మహాత్మ్యం నుండి
వారు కొండల గుహల్లో
బండ బీటల్లో దాక్కుంటారు.
 
22 తమ నాసికారంధ్రాలలో ఊపిరి తప్ప ఏమీ లేని
నరులను నమ్మడం మానండి.
వారిని ఎందుకు లక్ష్యపెట్టాలి?

*2:9 లేదా వారిని లేవనెత్తకండి

2:16 హెబ్రీలో తర్షీషు ఓడలన్నిటికి