4
 1 ఆ రోజున ఏడుగురు స్త్రీలు  
ఒక్క పురుషుని పట్టుకుని  
“మేము మా అన్నమే తింటాము,  
మా బట్టలే మేము కట్టుకుంటాము;  
నీ పేరు మాత్రం మాకు పెట్టి  
మా అవమానాన్ని తీసివేయి చాలు!”  
అని చెప్తారు.   
యెహోవా కొమ్మ 
  2 ఆ రోజు యెహోవా కొమ్మ అందంగా, మహిమగలదిగా ఉంటుంది; ఇశ్రాయేలులో తప్పించుకున్నవారికి భూమి పంట అతిశయంగా, ఘనతగా ఉంటుంది.   3 సీయోనులో మిగిలిన వారికి, యెరూషలేములో ఉన్నవారికి అనగా యెరూషలేములో నివసించే వారిలో నమోదు చేయబడ్డ ప్రతివారు పరిశుద్ధులని పిలువబడతారు.   4 ప్రభువు సీయోను స్త్రీల మురికిని కడిగివేస్తారు; ఆయన తీర్పు తీర్చు ఆత్మతో, దహించే ఆత్మతో, యెరూషలేము నుండి రక్తం మరకల్ని శుభ్రం చేస్తారు.   5 అప్పుడు యెహోవా సీయోను పర్వతం అంతట, అక్కడ కూడుకునేవారి మీద పగలు పొగతో ఉన్న మేఘాన్ని, రాత్రి మండుతున్న అగ్నిని సృష్టిస్తారు; ప్రతి దాని మీద మహిమ*లేదా అక్కడ ఉన్న మహిమ అంతటి మీద పందిరిగా ఉంటుంది.   6 అది పగలు ఎండ వేడి నుండి ఆశ్రయంగా, నీడగా, తుఫాను, వానల నుండి కాపాడే దాగుచోటుగా ఉంటుంది.