6
యెషయా నియామకం 
  1 రాజైన ఉజ్జియా చనిపోయిన సంవత్సరంలో అత్యున్నతమైన సింహాసనం మీద ప్రభువు కూర్చుని ఉండడం నేను చూశాను; ఆయన వస్త్రపు అంచు దేవాలయాన్ని నింపింది.   2 ఆయన పైన సెరాపులు ఒక్కొక్కరు ఆరు రెక్కలతో నిలబడి ఉన్నారు; రెండు రెక్కలతో తమ ముఖాలను, రెండింటితో తమ కాళ్లను కప్పుకుని, రెండింటితో ఎగురుతున్నారు.   3 వారు ఒకరితో ఒకరు,  
“సైన్యాల యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు;  
సమస్త భూమి ఆయన మహిమతో నిండి ఉంది”  
అని పాడుతున్నారు.   
 4 వారి స్వరాల ధ్వనికి ద్వారబంధాలు, పునాదులు కదిలాయి. మందిరం పొగతో నిండిపోయింది.   
 5 నేను, “నాకు శ్రమ! నేను నశించిపోయాను! ఎందుకంటే నేను అపవిత్ర పెదవులు గలవాడను. అపవిత్ర పెదవులు ఉన్న ప్రజలమధ్య నేను నివసిస్తున్నాను, నా కళ్లు రాజు, సైన్యాల యెహోవాను చూశాయి” అని మొరపెట్టాను.   
 6 అప్పుడు ఆ సెరాపులలో ఒకడు బలిపీఠం మీద నుండి పటకారుతో తీసిన నిప్పును తన చేతితో పట్టుకుని ఎగురుతూ నా దగ్గరకు వచ్చాడు.   7 దానితో నా నోటిని ముట్టి, “చూడు, ఇది నీ పెదవులను తాకింది; నీ దోషం తీసివేయబడింది, నీ పాపం క్షమించబడింది” అన్నాడు.   
 8 అప్పుడు ప్రభువు స్వరం, “నేను ఎవరిని పంపాలి? మాకోసం ఎవరు వెళ్తారు?” అని అనడం నేను విన్నాను.  
నేను, “నేనున్నాను. నన్ను పంపండి!” అన్నాను.   
 9 అందుకు ఆయన, “నీవు వెళ్లి ఈ ప్రజలతో ఇలా చెప్పు:  
“ ‘మీరు ఎప్పుడు వింటూనే ఉంటారు, కాని అర్థం చేసుకోరు;  
ఎప్పుడు చూస్తూనే ఉంటారు, కాని గ్రహించరు.’   
 10 వారి హృదయాలను కఠినపరచు;  
వారి చెవులకు చెవుడు  
వారి కళ్లకు గుడ్డితనం కలిగించు  
లేదంటే వారు తమ కళ్లతో చూసి,  
చెవులతో విని,  
హృదయాలతో గ్రహించి,  
మనస్సు మార్చుకొని స్వస్థత పొందుతారు.”   
 11 అందుకు నేను, “ప్రభువా! ఇలా ఎంతకాలం వరకు?” అని అడిగాను.  
అందుకు ఆయన ఇలా జవాబిచ్చారు:  
“నివాసులు లేక  
పట్టణాలు నాశనం అయ్యేవరకు,  
మనుష్యులు లేక ఇల్లు పాడై విడిచిపెట్టబడే వరకు,  
భూమి పూర్తిగా నాశనమై బీడుగా అయ్యేవరకు,   
 12 యెహోవా మనుష్యులను దూరం పంపించే వరకు  
భూమి పూర్తిగా విడిచిపెట్టబడే వరకు.   
 13 దానిలో పదవ భాగం మాత్రమే విడిచిపెట్టబడినా  
అది కూడా నాశనమవుతుంది.  
అయితే మస్తకి సింధూర చెట్లు నరకబడిన తర్వాత  
మొద్దులు ఎలా మిగులుతాయో  
అలాగే పరిశుద్ధ విత్తనం మొద్దులా నేలపై ఉంటుంది.”