8
సూచనలుగా యెషయా, అతని పిల్లలు
1 యెహోవా నాతో ఇలా అన్నారు, “నీవు పెద్ద పలక తీసుకుని దానిపై మహేర్-షాలాల్-హాష్-బజ్*మహేర్-షాలాల్-హాష్-బజ్ అంటే దోచుకోవడానికి త్వరపడడం లేదా కొల్లగొట్టడానికి తొందరపడడం; 3 వచనంలో కూడా అని సామాన్యమైన అక్షరాలతో వ్రాయి. 2 నా కోసం నమ్మకమైన సాక్షులుగా ఉండడానికి యాజకుడైన ఊరియాను, యేబెరెక్యా కుమారుడైన జెకర్యాను పిలిచాను. 3 తర్వాత నేను ప్రవక్త్రితో శయనించగా ఆమె గర్భవతియై కుమారునికి జన్మనిచ్చింది. అప్పుడు యెహోవా, ‘అతనికి మహేర్-షాలాల్-హాష్-బజ్ అని పేరు పెట్టు’ అని నాతో చెప్పారు. 4 ఆ పిల్లవాడు నాన్న అమ్మ అని పిలువకముందే, అష్షూరు రాజు దమస్కు సంపదని సమరయ దోపుడుసొమ్మును ఎత్తుకుని పోతాడు.”
5 యెహోవా నాతో మరలా ఇలా మాట్లాడారు:
6 “ఈ ప్రజలు మెల్లగా పారే షిలోహు నీటిని
వద్దు అని,
రెజీను గురించి,
రెమల్యా కుమారుని గురించి సంతోషిస్తున్నారు,
7 కాబట్టి ప్రభువు భయంకరమైన యూఫ్రటీసు నది వరద నీటిని
అనగా అష్షూరు రాజును, అతని బలగమంతటిని
వారి మీదికి రప్పించబోతున్నారు.
అవి దాని కాలువలన్నిటి నుండి ఉప్పొంగి
దాని ఒడ్డులన్నిటి మీది నుండి ప్రవహిస్తాయి.
8 అవి యూదాలోకి వచ్చి పొంగిపొర్లి ప్రవహిస్తూ,
గొంతు లోతు వరకు చేరుతాయి.
ఇమ్మానుయేలూ, దాని చాచిన రెక్కలు
నీ దేశమంతట వ్యాపిస్తాయి.”
9 దేశాల్లారా, మీరు ముక్కలై నాశనమైపోతారు!
దూర దేశాల్లారా! మీరందరూ వినండి.
యుద్ధానికి సిద్ధపడండి, మీరు ముక్కలై పొండి!
అవును, యుద్ధానికి సిద్ధపడండి, మీరు ముక్కలై పొండి!
10 మీరు వ్యూహం రచించండి, అది విఫలమవుతుంది;
మీ ప్రణాళికను ప్రతిపాదించండి, అది నిలబడదు,
ఎందుకంటే దేవుడు మాతో ఉన్నారు.†హెబ్రీలో ఇమ్మానుయేలు
11 ఈ ప్రజల మార్గాన్ని అనుసరించకూడదని యెహోవా నన్ను హెచ్చరించి నాతో ఖచ్చితంగా చెప్పిన మాట ఇదే:
12 “ఈ ప్రజలు కుట్ర అని చెప్పే ప్రతిదాన్ని
కుట్ర అనకండి.
వారు భయపడే దానికి భయపడకండి.
దానికి బెదిరిపోకండి.
13 సైన్యాల యెహోవాయే పరిశుద్ధుడని మీరు గుర్తించాలి,
ఆయనకే మీరు భయపడాలి,
ఆయనకే మీరు భయపడాలి.
14 ఆయన పరిశుద్ధ స్థలంగా ఉంటారు;
అయితే ఆయన ఇశ్రాయేలుకు, యూదాకు
ప్రజలను తడబడేలా చేసే రాయిలా
వారిని పడిపోయేలా చేసే బండలా ఉంటారు.
ఆయన యెరూషలేము ప్రజలకు
బోనుగా, ఉచ్చుగా ఉంటారు.
15 వారిలో అనేకమంది తడబడతారు;
వారు పడిపోతారు, గాయపరచబడతారు
వారు ఉచ్చులో చిక్కుకుని పట్టబడతారు.”
16 ఈ హెచ్చరిక సాక్ష్యాన్ని కట్టండి
దేవుని బోధను నా శిష్యుల మధ్యలో ముద్రించండి.
17 యాకోబు వారసుల నుండి తన ముఖాన్ని దాస్తున్న
యెహోవా కోసం నేను ఎదురుచూస్తాను.
ఆయనపై నా నమ్మకాన్ని ఉంచుతాను.
18 ఇదిగో నేను, యెహోవా నాకిచ్చిన పిల్లలు, సీయోను కొండమీద నివసించే సైన్యాల యెహోవా వలన సూచనలుగా, గుర్తులుగా ఇశ్రాయేలీయుల మధ్య ఉన్నాము.
చీకటి వెలుగుగా మారుట
19 మీతో ఎవరైనా, గుసగుసలాడే గొణిగే మృతుల ఆత్మలతో మాట్లాడేవారిని, ఆత్మలతో మాట్లాడేవారిని సంప్రదించమని చెప్పినప్పుడు, ప్రజలు తమ దేవుని దగ్గరే విచారించాలి కదా? సజీవుల గురించి చచ్చిన వారిని ఎందుకు సంప్రదించాలి? 20 దేవుని బోధను, హెచ్చరిక సాక్ష్యాన్ని దృష్టి నిలపండి. ఈ వాక్యం ప్రకారం మాట్లాడని వారికి ఉదయపు వెలుగు ఉండదు. 21 వారు బాధపడుతూ ఆకలితో దేశమంతా తిరుగుతారు; వారు ఆకలితో ఉన్నప్పుడు వారు కోపంతో పైకి చూస్తూ తమ రాజును, తమ దేవుని శపిస్తారు. 22 వారు భూమివైపు చూడగా వారికి బాధ, చీకటి, భయంకరమైన దుఃఖం మాత్రమే కనబడతాయి. వారు దట్టమైన చీకటిలోకి త్రోయబడతారు.