19
ఈజిప్టుకు వ్యతిరేకంగా ప్రవచనం 
  1 ఈజిప్టుకు వ్యతిరేకంగా ప్రవచనం:  
చూడండి, యెహోవా వేగంగల మేఘం ఎక్కి  
ఈజిప్టుకు వస్తున్నారు.  
ఈజిప్టు విగ్రహాలు ఆయన ఎదుట వణకుతాయి,  
ఈజిప్టు ప్రజల గుండెలు భయంతో కరిగిపోతాయి.   
 2 “నేను ఈజిప్టువారి మీదికి ఈజిప్టువారిని రేపుతాను,  
సోదరుని మీదికి సోదరుడు,  
పొరుగువారి మీదికి పొరుగువారు,  
పట్టణం మీదికి పట్టణం,  
రాజ్యం మీదికి రాజ్యం రేపుతాను.   
 3 ఈజిప్టువారు ఆత్మస్థైర్యం కోల్పోతారు,  
వారి ఆలోచనలను నాశనం చేస్తాను;  
వారు విగ్రహాలను, మరణించిన వారి ఆత్మలను,  
భవిష్యవాణి చెప్పేవారిని, ఆత్మలతో మాట్లాడేవారిని సంప్రదిస్తారు.   
 4 నేను ఈజిప్టువారిని  
క్రూరమైన అధికారి చేతికి అప్పగిస్తాను,  
భయంకరమైన రాజు వారిని పాలిస్తాడు” అని  
సైన్యాల అధిపతియైన యెహోవా ప్రకటిస్తున్నారు.   
 5 సముద్రంలో నీళ్లు ఎండిపోతాయి,  
నదులు ఎండిపోయి పొడినేల అవుతాయి.   
 6 కాలువలు కంపుకొడతాయి;  
ఈజిప్టు కాలువలు ఇంకి ఎండిపోతాయి.  
రెల్లు, గడ్డి వాడిపోతాయి,   
 7 నైలు నది ప్రాంతంలో  
దాని ఒడ్డున ఉన్న మొక్కలు కూడా వాడిపోతాయి,  
నైలు తీరం వెంట ఉన్న ప్రతి పొలం  
వాడిపోయి దుమ్ములా కొట్టుకు పోయి ఇక కనబడవు.   
 8 జాలరులు మూల్గుతారు, దుఃఖిస్తారు,  
నైలు నదిలో గాలాలు వేసే వారందరు ఏడుస్తారు;  
నీటి మీద వలలు వేసేవారు విలపిస్తారు.   
 9 దువ్వెనతో చిక్కుతీసి జనపనారతో పని చేసేవారు నిరాశపడతారు,  
సన్నని నారతో అల్లేవారు నిరీక్షణ కోల్పోతారు.   
 10 బట్టలు తయారుచేసేవారు నిరుత్సాహపడతారు,  
కూలిపని చేసే వారందరు మనోవేదన పొందుతారు.   
 11 సోయను అధిపతులు మూర్ఖులు తప్ప మరేమీ కాదు;  
ఫరో సలహాదారులు అర్థంలేని సలహాలు ఇస్తారు.  
“నేను జ్ఞానులలో ఒకడిని,  
పూర్వపురాజుల శిష్యుడను”  
అని ఫరోతో మీరెలా చెప్తారు?   
 12 నీ జ్ఞానులు ఏమయ్యారు?  
సైన్యాల యెహోవా  
ఈజిప్టు గురించి నిర్ణయించిన దానిని  
వారు నీకు చూపించి, తెలియజేయనివ్వు.   
 13 సోయను అధిపతులు మూర్ఖులయ్యారు,  
మెంఫిసు నాయకులు మోసపోయారు.  
ఈజిప్టు గోత్రానికి మూలరాళ్లుగా ఉన్నవారు  
దానిని దారి తప్పేలా చేశారు.   
 14 యెహోవా వారి మీద  
భ్రమపరిచే ఆత్మను కుమ్మరించారు;  
ఒక త్రాగుబోతు తన వాంతిలో తూలిపడినట్లు,  
తాను చేసే పనులన్నిటిలో ఈజిప్టు తూలిపడేలా వారు చేస్తారు.   
 15 తల గాని తోక గాని తాటి మట్ట గాని జమ్ము రెల్లు గాని  
ఈజిప్టు కోసం ఎవరు ఏమి చేయలేరు.   
 16 ఆ రోజున ఈజిప్టువారు స్త్రీలలా బలహీనంగా అవుతారు. సైన్యాల యెహోవా వారిపై తన చేయి ఆడించడం చూసి వారు భయంతో వణికిపోతారు.   17 యూదా దేశం ఈజిప్టువారికి భయం కలిగిస్తుంది; తమకు వ్యతిరేకంగా సైన్యాల యెహోవా ఉద్దేశించిన దానిని బట్టి యూదా గురించి విన్న ప్రతి ఒక్కరు భయపడతారు.   
 18 ఆ రోజున ఈజిప్టులో ఉండే అయిదు పట్టణాలు కనాను భాష మాట్లాడి, సైన్యాల యెహోవా వారమని ప్రమాణం చేస్తాయి. వాటిలో ఒకదాని పేరు సూర్యుని పట్టణము.*కొ.ప్రా.ప్ర.లలో నాశన పట్టణం   
 19 ఆ రోజున ఈజిప్టు దేశంలో మధ్యలో యెహోవాకు ఒక బలిపీఠం, దాని సరిహద్దులో యెహోవాకు ఒక స్మారక చిహ్నం ఉంటాయి.   20 అది ఈజిప్టు దేశంలో సైన్యాల యెహోవాకు సూచనగా, సాక్ష్యంగా ఉంటుంది. తమను బాధించేవారిని గురించి వారు దేవునికి మొరపెట్టగా, ఆయన వారిని కాపాడడానికి రక్షకుడిని విమోచకుడిని పంపుతారు, అతడు వారిని రక్షిస్తాడు.   21 ఈజిప్టువారికి యెహోవా తనను తాను బయలుపరచుకుంటారు; ఆ రోజున వారు యెహోవాను తెలుసుకుంటారు. వారు బలులు, భోజనార్పణలు సమర్పించి ఆయనను ఆరాధిస్తారు. వారు యెహోవాకు మ్రొక్కుబడులు చేసి వాటిని చెల్లిస్తారు.   22 యెహోవా ఈజిప్టును తెగులుతో బాధిస్తారు; వారిని బాధించి వారిని స్వస్థపరుస్తారు. వారు యెహోవా వైపు తిరుగుతారు, ఆయన వారి విన్నపాలు విని వారిని స్వస్థపరుస్తారు.   
 23 ఆ రోజున ఈజిప్టు నుండి అష్షూరుకు రహదారి ఉంటుంది. అష్షూరీయులు ఈజిప్టుకు, ఈజిప్టువారు అష్షూరుకు వస్తూ పోతుంటారు. ఈజిప్టువారు అష్షూరీయులు కలిసి ఆరాధిస్తారు.   24 ఆ రోజున, ఈజిప్టు అష్షూరుతో పాటు ఇశ్రాయేలు మూడవదిగా ఉండి, భూమిపై ఆశీర్వాదంగా†లేదా వారి పేర్లు ఆశీర్వదించడానికి వాడబడతాయి ఉంటుంది.   25 సైన్యాల యెహోవా, “నా ప్రజలైన ఈజిప్టు వారలారా, నా చేతి పనియైన అష్షూరీయులారా, నా స్వాస్థ్యమైన ఇశ్రాయేలీయులారా! మీరు ఆశీర్వదింపబడతారు” అని చెప్పి వారిని ఆశీర్వదిస్తారు.