24
యెహోవా భూమిని నాశనం చేయుట 
  1 చూడండి, యెహోవా భూమిని పాడుచేసి  
నాశనం చేయబోతున్నారు;  
ఆయన దాని ఉపరితలాన్ని పాడుచేసి  
దానిలో నివసించేవారిని చెదరగొడతారు.   
 2 అందరికి ఒకేలా ఉంటుంది;  
ప్రజలకు కలిగినట్లే యాజకునికి,  
సేవకునికి కలిగినట్లే యజమానికి,  
సేవకురాలికి కలిగినట్లే యజమానురాలికి,  
కొనేవారికి కలిగినట్లే అమ్మేవారికి,  
అప్పు ఇచ్చేవారికి కలిగినట్లే అప్పు తీసుకునేవారికి,  
వడ్డీకి ఇచ్చేవారికి కలిగినట్లే వడ్డీకి తీసుకునేవారికి కలుగుతుంది.   
 3 భూమి పూర్తిగా పాడుచేయబడి  
పూర్తిగా దోచుకోబడుతుంది.  
యెహోవా ఈ మాట చెప్పారు.   
 4 భూమి ఎండిపోయి వాడిపోతుంది,  
లోకం క్షీణించి వాడిపోతుంది,  
ఆకాశాలు భూమితో పాటు క్షీణించిపోతాయి.   
 5 భూప్రజలును బట్టి భూమి అపవిత్రమైంది;  
వారు చట్టాలకు లోబడలేదు,  
వారు కట్టడలను ఉల్లంఘించారు  
వారు నిత్యనిబంధనను భంగం చేశారు.   
 6 కాబట్టి ఒక శాపం భూమిని మ్రింగివేస్తుంది;  
దాని ప్రజలు తమ అపరాధాన్ని భరించాలి.  
కాబట్టి భూనివాసులు కాలిపోయారు  
కేవలం కొద్దిమంది మిగిలారు.   
 7 క్రొత్త ద్రాక్షరసం ఎండిపోతుంది, ద్రాక్షతీగె వాడిపోతుంది;  
సంతోషంగా ఉన్నవారు మూల్గుతారు.   
 8 ఆనందంతో చేసే తంబురల ధ్వనులు నిలిచిపోయాయి,  
కేకలు వేసే వారి ధ్వని ఆగిపోయింది  
ఆనందంగా ఉన్న సితార నిశ్శబ్దంగా ఉంది.   
 9 ఇక వారు పాటలు పాడుతూ ద్రాక్షరసం త్రాగరు;  
మద్యం త్రాగే వారికి అది చేదుగా మారింది.   
 10 శిథిలమైన పట్టణం నిర్జనంగా ఉంది;  
ప్రతి ఇంటి గుమ్మం మూయబడింది.   
 11 ద్రాక్షరసం కోసం వారు వీధుల్లో కేకలు వేస్తున్నారు;  
ఆనందమంతా దిగులుగా మారుతుంది,  
దేశం ఆనంద ధ్వనులన్నీ నిషేధించబడ్డాయి.   
 12 పట్టణం శిథిలాల్లో ఉన్నది,  
దాని గుమ్మం ముక్కలుగా విరిగిపోయింది.   
 13 ఒలీవ చెట్టుని దులిపినప్పుడు,  
ద్రాక్షపండ్ల కోత తర్వాత పరిగె పళ్ళు ఏరుకుంటున్నప్పుడు జరిగినట్లుగా  
భూమి మీద  
భూమి మీద ప్రజలందరి మధ్యలో ఇది జరుగుతుంది.   
 14 వారు తమ స్వరాలెత్తి ఆనందంతో కేకలు వేస్తారు;  
పశ్చిమ నుండి వారు యెహోవా గొప్పతనాన్ని కొనియాడుతారు.   
 15 కాబట్టి తూర్పున ఉన్నవారలారా, యెహోవాను ఘనపరచండి.  
సముద్ర ద్వీపవాసులారా,  
ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామాన్ని ఘనపరచండి.   
 16 భూమి అంచుల నుండి మేము ఇలా పాడడం వింటున్నాము:  
“నీతిమంతునికి*అంటే, దేవునికి ఘనత.”  
అయితే నేను అన్నాను, “నేను చెడిపోయాను, చెడిపోయాను!  
నాకు శ్రమ!  
మోసగాళ్ళు ద్రోహం చేస్తారు,  
మోసగాళ్ళు మోసంతో ద్రోహం చేస్తారు!”   
 17 భూలోక ప్రజలారా!  
మీ కోసం భయం, గుంట, ఉరి వేచి ఉన్నాయి.   
 18 భయంకరమైన శబ్దం విని ఎవరైతే పారిపోతారో  
వారు గుంటలో పడతారు;  
ఎవరైతే గుంటలో నుండి పైకి వస్తారో,  
వారు ఉరిలో చిక్కుకుంటారు.  
ఆకాశపు తూములు తెరవబడ్డాయి  
భూమి పునాదులు కదిలాయి.   
 19 భూమి బద్దలై పోయింది,  
భూమి ముక్కలుగా చీలిపోయింది,  
భూమి భయంకరంగా అదురుతుంది.   
 20 భూమి త్రాగుబోతులా తూలుతుంది,  
గాలికి ఊగే పాకలా ఇటు అటు ఊగుతుంది.  
దాని తిరుగుబాటు అపరాధం దానిపై బరువుగా ఉంది  
అది ఇక లేవనంతగా పడిపోతుంది.   
 21 ఆ రోజున యెహోవా  
పైన ఆకాశాల్లో ఉన్న శక్తులను,  
భూమి మీద ఉన్న రాజులను శిక్షిస్తారు.   
 22 చెరసాలలో బంధించబడిన ఖైదీలవలె  
వారు చెరసాలలో వేయబడతారు.  
చాలా రోజులు అక్కడ ఉన్న తర్వాత  
వారు శిక్షించబడతారు.†లేదా విడుదల చేయబడతారు   
 23 చంద్రుడు దిగులు చెందుతాడు  
సూర్యుడు సిగ్గుపడతాడు;  
సైన్యాల యెహోవా  
సీయోను కొండమీద యెరూషలేములో,  
దాని పెద్దల ఎదుట గొప్ప మహిమతో రాజ్యమేలుతారు.