26
స్తుతి గీతం
ఆ రోజున యూదా దేశంలో ఈ పాట పాడతారు:
మనకు ఒక బలమైన పట్టణం ఉంది;
దేవుడు రక్షణను
దానికి గోడలుగా, ప్రాకారాలుగా ఉంచుతారు.
నీతిగల దేశం
నమ్మదగిన దేశం ప్రవేశించేలా
గుమ్మాలు తీయండి.
మీరు స్థిరమైన మనస్సుగల వారిని
సంపూర్ణ సమాధానంతో కాపాడతారు,
ఎందుకంటే వారు మీపై విశ్వాసముంచారు.
యెహోవా యెహోవాయే శాశ్వతమైన బండ
కాబట్టి నిత్యం యెహోవాను నమ్ముకోండి.
ఆయన ఎత్తైన స్ధలంలో నివసించేవారిని అణచివేస్తారు
ఎత్తైన కోటలను పడగొడతారు;
ఆయన దానిని నేల మట్టుకు పడగొట్టి
దానిని ధూళిలో కలుపుతారు.
అణచివేయబడినవారి కాళ్లతో
పేదవారి అడుగులతో
అది త్రొక్కబడుతుంది.
 
నీతిమంతుల దారి సమంగా ఉంటుంది;
యథార్థవంతుడా, మీరు నీతిమంతుల మార్గం సరాళం చేస్తావు.
అవును యెహోవా, మీ న్యాయవిధుల మార్గాల్లో నడుస్తూ
మేము మీ కోసం వేచి ఉన్నాము;
మీ నామం మీ కీర్తి
మా హృదయాల కోరిక.
రాత్రివేళ నా ప్రాణం మీ కోసం ఆరాటపడుతుంది;
ఉదయం నా ఆత్మ మిమ్మల్ని వెదుకుతుంది.
మీ తీర్పులు భూమి మీదికి వచ్చినప్పుడు,
ఈ లోక ప్రజలు నీతిని నేర్చుకుంటారు.
10 కాని చెడ్డవారికి దయ చూపిస్తే,
వారు నీతిని నేర్చుకోరు.
యథార్థమైన దేశంలో ఉన్నా కూడా వారు చెడు చేస్తూనే ఉంటారు
యెహోవా ఘనతను వారు పట్టించుకోరు.
11 యెహోవా! మీ చేయి ఎత్తుగా ఎత్తబడింది,
కాని వారు దానిని చూడరు.
మీ ప్రజల పట్ల మీకున్న ఆసక్తి చూసి వారు సిగ్గుపడతారు;
మీ శత్రువుల కోసం కేటాయించబడిన అగ్ని వారిని కాల్చివేయాలి.
 
12 యెహోవా! మీరు మాకు సమాధానాన్ని స్థాపిస్తారు;
మేము సాధించిందంతా మీరు మాకోసం చేసిందే.
13 యెహోవా! మా దేవా! మీరు కాకుండా వేరే ప్రభువులు మమ్మల్ని పాలించారు,
కాని మేము మీ నామాన్ని మాత్రమే ఘనపరుస్తాము.
14 వారు చనిపోయారు, మరల బ్రతకరు;
వారి ఆత్మలు లేవవు.
మీరు వారిని శిక్షించి నాశనం చేశారు;
మీరు వారి జ్ఞాపకాలన్నిటిని తుడిచివేశారు.
15 యెహోవా, మీరు దేశాన్ని వృద్ధిచేశారు;
మీరు దేశాన్ని వృద్ధిచేశారు.
మీరు మీకే మహిమ సంపాదించుకున్నారు;
మీరు దేశపు సరిహద్దులన్నిటిని విస్తరింపజేశారు.
 
16 యెహోవా! వారు తమ బాధలో మీ దగ్గరకు వచ్చారు;
మీరు వారిని శిక్షించినప్పుడు
వారు దీన ప్రార్థనలు చేశారు.
17 గర్భిణి స్త్రీ ప్రసవానికి సిద్ధమైనప్పుడు
ఆ నొప్పికి బాధతో కేకలు వేసినట్లు
యెహోవా మీ సన్నిధిలో మేము ఉన్నాము.
18 మేము గర్భం ధరించి ప్రసవవేదన పడ్డాము.
కాని గాలికి జన్మనిచ్చాము.
మేము భూమికి రక్షణను తీసుకురాలేదు,
ఈ లోక ప్రజలు పుట్టలేదు.
 
19 కాని యెహోవా, చనిపోయిన మీ వారు బ్రతుకుతారు;
వారి శరీరాలు పైకి లేస్తాయి
మట్టిలో నివసిస్తున్నవారు,
మేల్కొని సంతోషించాలి.
మీ మంచు ఉదయపు మంచు వంటిది;
భూమి తన మృతులకు జన్మనిస్తుంది.
 
20 నా ప్రజలారా! మీ గదిలోకి వెళ్లి
మీ వెనక తలుపులు వేసుకోండి;
ఆయన ఉగ్రత పోయే వరకు
కొంతకాలం మీరు దాక్కోండి.
21 ఇదిగో వారి పాపాలను బట్టి భూప్రజలను శిక్షించడానికి
యెహోవా తన నివాసంలో నుండి వస్తున్నారు.
భూమి తనపై చిందిన రక్తాన్ని వెల్లడిస్తుంది;
భూమి చంపబడిన వారిని ఇకపై దాచదు.