29
దావీదు పట్టణానికి శ్రమ 
  1 అరీయేలుకు శ్రమ  
దావీదు శిబిరం వేసుకున్న అరీయేలు పట్టణానికి శ్రమ!  
సంవత్సరం తర్వాత సంవత్సరం గడవనివ్వండి  
పండుగలు క్రమంగా జరుగనివ్వండి.   
 2 అయినా నేను అరీయేలును ముట్టడిస్తాను;  
అది దుఃఖించి రోదిస్తుంది.  
అది నాకు అగ్నిగుండంలా అవుతుంది.   
 3 నీకు వ్యతిరేకంగా అన్నివైపులా నేను శిబిరం ఏర్పాటు చేస్తాను;  
గోపురాలతో నిన్ను చుట్టుముట్టి  
నీకు వ్యతిరేకంగా ముట్టడి దిబ్బలు ఏర్పాటు చేస్తాను.   
 4 అప్పుడు నీవు క్రిందపడి నేలపై నుండి మాట్లాడతావు;  
నీ మాట ధూళినుండి గొణుగుతున్నట్లు ఉంటుంది.  
దయ్యం స్వరంలా నీ స్వరం నేల నుండి వస్తుంది;  
ధూళినుండి నీ మాట గుసగుసలాడుతుంది.   
 5 కాని నీ శత్రువులు సన్నటి ధూళిలా మారతారు;  
క్రూరుల గుంపు ఎగిరిపోయే పొట్టులా ఉంటుంది.  
హఠాత్తుగా ఒక క్షణంలోనే ఇది జరుగుతుంది.   
 6 ఉరుముతో, భూకంపంతో, గొప్ప శబ్దంతో  
సుడిగాలి తుఫానుతో దహించే అగ్నిజ్వాలలతో  
సైన్యాల యెహోవా వస్తారు.   
 7 అప్పుడు అరీయేలుతో యుద్ధం చేసే అన్ని దేశాల గుంపులు  
దాని మీద దాడి చేసి దాని కోటను ముట్టడించేవారు  
ఒక కలలా ఉంటారు  
రాత్రివేళలో వచ్చే దర్శనంలా ఉంటారు.   
 8 ఆకలితో ఉన్నవారు తింటున్నట్లు కల కని  
కాని ఇంకా ఆకలితోనే మేల్కొన్నట్లు,  
దాహంతో ఉన్నవారు త్రాగినట్లు కల కని  
ఇంకా అలసిపోయి దాహంతోనే మేల్కొన్నట్లు ఉంటారు.  
సీయోను కొండకు వ్యతిరేకంగా యుద్ధం చేసే  
అన్ని దేశాల గుంపులకు ఇలా ఉంటుంది.   
 9 నివ్వెరపోండి, ఆశ్చర్యపడండి.  
మిమ్మల్ని మీరు చూపులేని గ్రుడ్డివారిగా చేసుకోండి;  
ద్రాక్షరసం త్రాగకుండానే మత్తులో ఉండండి,  
మద్యపానం చేయకుండానే తూలుతూ ఉండండి.   
 10 యెహోవా మీకు గాఢనిద్ర కలిగించారు:  
మీకు కళ్లుగా ఉన్న ప్రవక్తలను ఆయన మూసివేశారు;  
మీ తలలుగా ఉన్న దీర్ఘదర్శులకు ఆయన ముసుగు వేశారు.   
 11 మీకు ఈ దర్శనమంతా ముద్ర వేసిన గ్రంథంలోని మాటల్లా ఉంది. మీరు దానిని చదవగలిగిన వారికి ఇచ్చి, “దయచేసి దీనిని చదవండి” అని అంటే, వారు, “నేను చదవలేను; అది ముద్రించబడింది” అని జవాబిస్తారు.   12 చదవడం రాని వానికి గ్రంథపుచుట్ట ఇచ్చి, “దయచేసి దీనిని చదవండి” అని అంటే, వారు, “నాకు చదవడం రాదు” అని జవాబిస్తారు.   
 13 ప్రభువు ఇలా అంటున్నారు:  
“ఈ ప్రజలు నోటి మాటతో నా దగ్గరకు వస్తున్నారు.  
పెదవులతో నన్ను ఘనపరుస్తున్నారు,  
కాని వారి హృదయాలు నా నుండి దూరంగా ఉన్నాయి.  
వారికి బోధించబడిన మానవ నియమాల ప్రకారం మాత్రమే  
నా పట్ల భయభక్తులు చూపుతున్నారు.*మూ.భా.లో వారు వ్యర్థంగా నన్ను ఆరాధిస్తున్నారు; వారి బోధలు మానవ నియమాలు మాత్రమే   
 14 కాబట్టి నేను మరొకసారి ఈ ప్రజలను  
ఆశ్చర్యాలతో ఆశ్చర్యపరుస్తాను;  
జ్ఞానుల జ్ఞానం నశిస్తుంది  
వివేకుల వివేకం మాయమైపోతుంది.”   
 15 తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా  
దాచడానికి గొప్ప లోతుల్లోకి వెళ్లే వారికి శ్రమ.  
“మమ్మల్ని ఎవరు చూస్తారు? ఎవరు తెలుసుకుంటారు?” అని అనుకుని,  
చీకటిలో తమ పనులు చేసేవారికి శ్రమ.   
 16 మీరు విషయాలను తలక్రిందులుగా చూస్తారు  
కుమ్మరిని మట్టితో సమానంగా చూస్తారు!  
చేయబడిన వస్తువు దానిని చేసినవానితో,  
“నీవు నన్ను చేయలేదు” అని అనవచ్చా?  
కుండ కుమ్మరితో,  
“నీకు ఏమి తెలియదు” అని అనవచ్చా?   
 17 ఇంకా కొంతకాలం తర్వాత లెబానోను సారవంతమైన పొలంగా,  
సారవంతమైన పొలం అడవిగా మారదా?   
 18 ఆ రోజున చెవిటివారు గ్రంథంలోని మాటలు వింటారు,  
చీకటిలో చిమ్మ చీకటిలో  
గ్రుడ్డివారి కళ్లు చూస్తాయి.   
 19 మరోసారి దీనులు యెహోవాలో సంతోషిస్తారు;  
మనుష్యుల్లో పేదవారు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునిలో ఆనందిస్తారు.   
 20 దయలేని మనుష్యులు అదృశ్యమవుతారు,  
హేళన చేసేవారు మాయమవుతారు  
చెడు చేయడానికి ఇష్టపడేవారందరు,   
 21 ఒక వ్యక్తి మీద తప్పుడు సాక్ష్యమిచ్చేవారు,  
న్యాయస్థానంలో మధ్యవర్తిత్వం చేసేవారిని వలలో వేసుకునేవారు  
అబద్ధసాక్ష్యంతో అమాయకులకు న్యాయం జరుగకుండా చేసేవారు తొలగించబడతారు.   
 22 కాబట్టి అబ్రాహామును విడిపించిన యెహోవా యాకోబు వారసుల గురించి చెప్పే మాట ఇదే:  
“ఇకపై యాకోబు సిగ్గుపడడు;  
ఇకపై వారి ముఖాలు చిన్నబోవు.   
 23 వారు వారి పిల్లల మధ్య  
నేను చేసే కార్యాలను చూసినప్పుడు,  
వారు నా నామాన్ని పరిశుద్ధపరుస్తారు:  
యాకోబు పరిశుద్ధ దేవుని ఘనపరుస్తారు,  
ఇశ్రాయేలు దేవునికి భయపడతారు.   
 24 ఆత్మలో దారి తప్పినవారు వివేకులవుతారు;  
సణిగేవారు ఉపదేశాన్ని అంగీకరిస్తారు.”