31
ఈజిప్టుపై ఆధారపడేవారికి శ్రమ 
  1 ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లెక్కచేయకుండా  
యెహోవా నుండి సహాయం కోసం చూడకుండ  
సహయం కోసం ఈజిప్టుకు వెళ్లే వారికి  
గుర్రాలపై ఆధారపడేవారికి,  
తమ రథాల సంఖ్యపై  
గుర్రపురౌతుల గొప్ప బలం మీద నమ్మకం ఉంచే వారికి శ్రమ.   
 2 అయినా ఆయన చాలా తెలివైనవారు, వినాశనం తీసుకురాగలరు;  
ఆయన తన మాట వెనుకకు తీసుకోరు.  
ఆయన దుష్టప్రజల మీద,  
కీడు చేసేవారికి సహయపడేవారి మీద లేస్తారు.   
 3 ఈజిప్టువారు కేవలం మనుష్యులే, దేవుడు కాదు;  
వారి గుర్రాలు మాంసమే కాని ఆత్మ కాదు.  
యెహోవా తన చేయి చాపగా  
సహయం చేసేవారు తడబడతారు,  
సహయం పొందేవారు పడతారు;  
వారందరు కలిసి నాశనమవుతారు.   
 4 యెహోవా నాతో చెప్పే మాట ఇదే:  
తప్పించడానికి గొర్రెల కాపరులందరు కలిసివచ్చి  
ఎన్ని శబ్దాలు చేసినా భయపడకుండా  
వారి కేకలకు కలవరపడకుండా  
సింహం ఒక కొదమసింహం  
తనకు దొరికిన దాని మీద గర్జించినట్లు  
సైన్యాల యెహోవా  
యుద్ధం చేయడానికి సీయోను పర్వతం మీదికి  
దాని కొండ మీదికి దిగి వస్తారు.   
 5 అటూ ఇటూ ఎగిరే పక్షుల్లా  
సైన్యాల యెహోవా యెరూషలేమును కాపాడతారు;  
ఆయన దానిని కాపాడుతూ విడిపిస్తారు.  
దాని మీద దాటి వెళ్తూ దానిని రక్షిస్తారు.   
 6 ఇశ్రాయేలీయులారా, మీరు ఎవరిపై తిరుగుబాటు చేశారో ఆయన వైపు తిరగండి.   7 మీ పాపిష్ఠి చేతులు తయారుచేసిన వెండి బంగారు విగ్రహాలను ఆ రోజున మీలో ప్రతి ఒక్కరు పారవేస్తారు.   
 8 “మనుష్యులు చేయని ఖడ్గానికి అష్షూరు పడిపోతుంది.  
మానవులు చేయని ఖడ్గం వారిని మ్రింగివేస్తుంది.  
వారు ఖడ్గం ఎదుట నుండి పారిపోతారు  
వారి యవ్వనస్థులు వెట్టిచాకిరి చేస్తారు.   
 9 వారి ఆశ్రయ కోట భయంతో పడిపోతుంది;  
వారి అధిపతులు యుద్ధ జెండా చూసి భయపడిపోతారు”  
అని యెహోవా ప్రకటించారు.  
సీయోనులో ఆయన అగ్ని  
యెరూషలేములో ఆయన కొలిమి ఉన్నాయి.