35
విమోచన పొందినవారి ఆనందం 
  1 ఎడారి, ఎండిన భూమి సంతోషిస్తాయి;  
అరణ్యం సంతోషించి పూస్తుంది.  
అది కుంకుమ పువ్వులా,   2 ఒక్కసారిగా విచ్చుకుంటుంది;  
అది గొప్పగా సంతోషించి ఆనందంతో కేకలు వేస్తుంది.  
లెబానోను మహిమ దానికి ఇవ్వబడుతుంది,  
కర్మెలు షారోనుల వైభవం దానికి ఉంటుంది;  
వారు యెహోవా మహిమను  
మన దేవుని వైభవాన్ని చూస్తారు.   
 3 బలహీనమైన చేతులను బలపరచండి,  
వణుకుతున్న మోకాళ్లను స్థిరపరచండి;   
 4 భయపడేవారితో ఇలా అనండి:  
“ధైర్యంగా ఉండండి, భయపడకండి;  
మీ దేవుడు వస్తారు  
ఆయన ప్రతీకారంతో వస్తారు.  
దైవిక ప్రతీకారంతో  
ఆయన మిమ్మల్ని రక్షించడానికి వస్తారు.”   
 5 అప్పుడు గ్రుడ్డివారి కళ్లు తెరవబడతాయి  
చెవిటి వారి చెవులు వినబడతాయి.   
 6 అప్పుడు కుంటివారు జింకలా గంతులు వేస్తారు,  
మూగవాని నాలుక ఆనందంతో కేకలు వేస్తుంది.  
అరణ్యంలో నీళ్లు ఉబుకుతాయి  
ఎడారిలో కాలువలు పారతాయి.   
 7 మండుతున్న ఇసుక చెరువులా మారుతుంది  
ఎండిన నేలలో నీటిబుగ్గలు పుడతాయి.  
ఒక్కప్పుడు తోడేళ్లు పడుకున్న స్థలంలో  
గడ్డి, రెల్లు, జమ్ము పెరుగుతాయి.   
 8 అక్కడ రహదారి ఉంటుంది;  
అది పరిశుద్ధ మార్గమని పిలువబడుతుంది;  
అది ఆ మార్గంలో నడిచే వారికి మాత్రమే.  
అపవిత్రులు ఆ దారిలో వెళ్లకూడదు;  
దుర్మార్గమైన మూర్ఖులు దానిలో నడవరు.   
 9 అక్కడ ఏ సింహం ఉండదు,  
ఏ క్రూర జంతువు ఉండదు;  
అవి అక్కడ కనబడవు.  
విమోచన పొందిన వారే అక్కడ నడుస్తారు.   
 10 యెహోవా విడిపించిన వారు తిరిగి వస్తారు.  
వారు పాటలు పాడుతూ సీయోనులో ప్రవేశిస్తారు;  
నిత్యమైన ఆనందం వారి తలల మీద కిరీటంగా ఉంటుంది.  
వారు ఆనంద సంతోషాలతో నిండి ఉంటారు.  
దుఃఖం, నిట్టూర్పు పారిపోతాయి.