48
మొండిగా ఉన్న ఇశ్రాయేలు 
  1 “యాకోబు వారసులారా,  
ఇశ్రాయేలు అనే పేరుతో పిలువబడి  
యూదా కుటుంబం నుండి వచ్చే వారలారా వినండి,  
యెహోవా పేరిట ప్రమాణం చేస్తూ  
ఇశ్రాయేలు దేవుని వేడుకుంటూ  
సత్యాన్ని గాని నీతి గాని అనుసరించని వారలారా వినండి.   
 2 మీ గురించి మీరు పరిశుద్ధ పట్టణస్థులమని చెప్పుకుంటూ  
ఇశ్రాయేలు దేవుని మీద ఆధారపడుతున్నామని చెప్పుకుంటున్న మీరు వినండి,  
ఆయన పేరు సైన్యాల యెహోవా:   
 3 గతంలో జరిగిన వాటి గురించి నేను చాలా కాలం క్రితమే చెప్పాను.  
నా నోరు వాటిని ప్రకటించింది నేను వాటిని తెలియజేశాను;  
తర్వాత నేను అకస్మాత్తుగా వాటిని చేయగా అవి జరిగాయి.   
 4 ఎందుకంటే మీరు ఎంత మొండివారో నాకు తెలుసు;  
నీ మెడ నరాలు ఇనుపవని,  
నీ నుదురు ఇత్తడిదని నాకు తెలుసు.   
 5 కాబట్టి వీటి గురించి నేను చాలా కాలం క్రితం చెప్పాను;  
‘నా విగ్రహం ఈ పనులను జరిగించింది  
నేను చెక్కిన ప్రతిమ, నేను పోతపోసిన విగ్రహం వాటిని నియమించాయి’ అని  
నీవు ఎప్పుడూ చెప్పకుండా ఉండేలా  
అవి జరగకముందే నీకు వాటిని ప్రకటించాను.   
 6 నీవు ఈ సంగతులను విన్నావు; వాటన్నిటిని చూడు.  
అవి నిజమని నీవు ఒప్పుకోవా?  
“నీకు తెలియకుండా దాచబడిన  
క్రొత్త విషయాలను ఇకపై నేను నీకు చెప్తాను.   
 7 అవి ఇప్పుడే సృజించినవి, ఎప్పుడో చేసినవి కావు;  
ఈ రోజుకు ముందు నీవు వాటి గురించి వినలేదు.  
అప్పుడు, ‘అవును, వాటి గురించి నాకు తెలుసు’  
అని నీవు చెప్పలేవు.   
 8 నీవు వాటి గురించి వినలేదు, అవి నీకు తెలియదు;  
పూర్వం నుండి నీ చెవులు తెరవబడలేదు.  
నీవు ఎంత ద్రోహివో నాకు తెలుసు;  
నీ పుట్టుక నుండి తిరుగుబాటుదారుడవు.   
 9 నేను నిన్ను పూర్తిగా నాశనం చేయకుండా  
నా నామాన్ని బట్టి నా కోపాన్ని ఆపుకున్నాను;  
నా కీర్తి కోసం నీ నుండి దానిని నేను నిగ్రహించుకున్నాను.   
 10 చూడు, నేను నిన్ను శుద్ధి చేశాను, కాని వెండిని చేసినట్లు కాదు;  
బాధల కొలిమిలో నిన్ను పరీక్షించాను.   
 11 నా కోసం, నా కొరకే, నేను ఇలా చేస్తాను.  
నా పేరును ఎలా అపవిత్రం చేయనిస్తాను?  
నేను నా మహిమను మరొకరికి ఇవ్వను.   
ఇశ్రాయేలు విడిపించబడుట 
  12 “యాకోబూ, నేను పిలిచిన ఇశ్రాయేలూ,  
నా మాట విను.  
నేనే ఆయనను;  
నేనే మొదటివాడను నేను చివరివాడను.   
 13 నా సొంత చేయి భూమికి పునాదులను వేసింది,  
నా కుడిచేయి ఆకాశాలను విశాలపరిచింది;  
నేను వాటిని పిలిచినప్పుడు  
అవన్నీ కలసి నిలబడతాయి.   
 14 “మీరందరూ కలసి వచ్చి వినండి:  
విగ్రహాలలో ఏది ఈ విషయాలను ముందే చెప్పింది?  
యెహోవా స్నేహితునిగా ఎంచుకున్నవాడు  
ఆయన ఉద్దేశాన్ని బబులోనుకు చేస్తాడు  
ఆయన చేయి బబులోనీయులకు*లేదా కల్దీయులకు 20 వచనంలో కూడా ఉంది వ్యతిరేకంగా ఉంటుంది.   
 15 నేను, నేనే చెప్పాను;  
అవును, నేనే అతన్ని పిలిచాను.  
నేను అతన్ని రప్పిస్తాను  
అతడు తన పనిలో విజయం సాధిస్తాడు.   
 16 “నా దగ్గరకు వచ్చి ఈ మాట విను:  
“మొదటి ప్రకటన నుండి నేను రహస్యంగా మాట్లాడలేదు;  
అది జరిగినప్పుడు నేను అక్కడే ఉన్నాను.”  
ఇప్పుడు ప్రభువైన యెహోవా  
తన ఆత్మతో నన్ను పంపారు.   
 17 నీ విమోచకుడు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన  
యెహోవా చెప్పే మాట ఇదే:  
నీ దేవుడనైన యెహోవాను నేనే,  
నీకు ఏది మంచిదో అది నీకు బోధిస్తాను  
నీవు వెళ్లవలసిన మార్గాన్ని నీకు చూపిస్తాను.   
 18 నీవు నా ఆజ్ఞల పట్ల శ్రద్ధ చూపించి ఉంటే  
నీ సమాధానం నదిలా  
నీ నీతి సముద్రపు అలలుగా ఉండేవి.   
 19 నీ వారసులు ఇసుకలా,  
నీ పిల్లలు లెక్కించలేని రేణువుల్లా ఉండేవారు.  
వారి పేరు ఎప్పటికీ కొట్టివేయబడదు  
ఎప్పుడూ నా ఎదుట నుండి నిర్మూలం కావు.   
 20 బబులోనును విడిచిపెట్టండి.  
బబులోనీయుల నుండి పారిపోండి!  
“యెహోవా తన సేవకుడైన యాకోబును విడిపించారు” అని  
ఆనంద కేకలతో తెలియజేయండి.  
దానిని ప్రకటించండి.  
భూమి అంచుల వరకు దానిని తెలియజేయండి.   
 21 ఎడారుల గుండా ఆయన వారిని నడిపించినా వారికి దాహం వేయలేదు;  
ఆయన వారి కోసం బండ నుండి నీళ్లు ప్రవహించేలా చేశారు.  
ఆయన బండను చీల్చారు,  
నీళ్లు ఉప్పొంగుతూ బయటకు వచ్చాయి.   
 22 “దుర్మార్గులకు నెమ్మది ఉండదు” అని యెహోవా చెప్తున్నారు.