52
 1 సీయోనూ, మేలుకో మేలుకో,  
నీ బలాన్ని ధరించుకో!  
పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా!  
నీ సుందరమైన వస్త్రాలను ధరించుకో.  
సున్నతి పొందనివారు గాని అపవిత్రులు గాని  
నీ లోనికి మరలా ప్రవేశించరు.   
 2 నీ దుమ్ము దులుపుకో;  
యెరూషలేమా, లేచి కూర్చో.  
బందీగా ఉన్న సీయోను కుమారీ,  
నీ మెడకున్న సంకెళ్ళు తీసివెయ్యి.   
 3 యెహోవా చెప్పే మాట ఇదే:  
“మీరు ఉచితంగా అమ్మబడ్డారు,  
డబ్బులు ఇవ్వకుండానే మీరు విడిపించబడతారు.”   
 4 ప్రభువైన యెహోవా చెప్పే మాట ఇదే:  
“నా ప్రజలు మొదట నివసించడానికి ఈజిప్టుకు వెళ్లారు;  
తర్వాత అష్షూరు వారిని బాధించింది.   
 5 “ఇప్పుడు ఇక్కడ నాకున్నది ఏంటి?” అని యెహోవా అంటున్నారు.  
“నా ప్రజలు ఏ కారణం లేకుండా కొనిపోబడ్డారు.  
వారిని పాలించేవారు వారిని ఎగతాళి చేస్తున్నారు  
రోజంతా నా నామం దూషించబడుతుంది”  
అని యెహోవా అంటున్నారు.   
 6 “కాబట్టి నా ప్రజలు నా పేరు తెలుసుకుంటారు;  
కాబట్టి దీని గురించి ముందుగా చెప్పింది నేనని  
వారు తెలుసుకుంటారు.  
అవును, అది నేనే.”   
 7 సువార్త ప్రకటిస్తూ,  
సమాధానాన్ని చాటిస్తూ,  
శుభవార్తను తీసుకువస్తూ,  
రక్షణ గురించి ప్రకటిస్తూ,  
సీయోనుతో, “నీ దేవుడు పాలిస్తున్నారు”  
అనే సువార్తను తెచ్చేవారి పాదాలు  
పర్వతాలమీద ఎంతో అందమైనవి.   
 8 వినండి! మీ కావలివారు కేకలు వేస్తున్నారు;  
వారంతా కలిసి సంతోషంతో కేకలు వేస్తున్నారు.  
యెహోవా సీయోనుకు తిరిగి వచ్చినప్పుడు  
వారు తమ కళ్లారా చూస్తారు.   
 9 యెహోవా తన ప్రజలను ఆదరించారు,  
ఆయన యెరూషలేమును విడిపించారు.  
కాబట్టి యెరూషలేము శిథిలాల్లారా,  
కలిసి సంతోషంతో పాటలు పాడండి.   
 10 అన్ని దేశాలు చూస్తుండగా  
యెహోవా తన పరిశుద్ధ చేతిని విప్పుతారు.  
భూమి అంచుల వరకు ఉండేవారంతా  
మన దేవుని రక్షణను చూస్తారు.   
 11 వెళ్లండి, వెళ్లండి, అక్కడినుండి వెళ్లండి!  
అపవిత్రమైన దానిని తాకకండి!  
యెహోవా మందిరపు ఉపకరణాలను మోసేవారలారా,  
అక్కడినుండి వెళ్లి మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి.   
 12 యెహోవా మీకు ముందుగా వెళ్తారు,  
ఇశ్రాయేలు దేవుడు మీ వెనుక కాపలా ఉంటారు.  
కాని మీరు తొందరగా బయలుదేరి వెళ్లరు.  
పారిపోతున్నట్లు వెళ్లరు.   
సేవకుని బాధలు, మహిమ 
  13 చూడండి, నా సేవకుడు తెలివిగా ప్రవర్తిస్తాడు;*లేదా వృద్ధి చెందుతాడు  
అతడు హెచ్చింపబడి ప్రసిద్ధిచెంది ఉన్నతంగా ఘనపరచబడతాడు.   
 14 మనుష్యులందరి కంటే అతని ముఖం చాలా వికారమని  
అతని రూపం మనిషిలా లేదని  
అతన్ని చూసి అనేకమంది దిగ్భ్రాంతి చెందినట్లు,   
 15 అతడు అనేక దేశాలను ఆశ్చర్యపడేలా చేస్తారు,  
అతన్ని బట్టి రాజులు నోళ్ళు మూసుకుంటారు.  
ఎందుకంటే తమకు తెలియజేయబడని సంగతులను వారు చూస్తారు.  
తాము వినని వాటిని వారు గ్రహిస్తారు.