55
దాహంతో ఉన్నవారికి ఆహ్వానం
దాహంతో ఉన్నవారలారా,
నీళ్ల దగ్గరకు రండి.
డబ్బులేని వారలారా,
మీరు వచ్చి కొని తినండి!
డబ్బు లేకపోయినా ఏమీ చెల్లించకపోయినా,
ద్రాక్షరసం, పాలు కొనండి.
ఆహారం కాని దాని కోసం మీరెందుకు డబ్బు ఖర్చుపెడతారు?
తృప్తి కలిగించని వాటికోసం ఎందుకు కష్టార్జితాన్ని వెచ్చిస్తారు?
వినండి, నా మాట వినండి, ఏది మంచిదో దానిని తినండి,
అప్పుడు మీరు గొప్ప వాటిని ఆనందిస్తారు.
శ్రద్ధగా విని నా దగ్గరకు రండి;
మీరు వింటే బ్రతుకుతారు.
నేను మీతో నిత్య నిబంధన చేస్తాను,
దావీదుకు వాగ్దానం చేసిన నా శాశ్వత ప్రేమను మీకు చూపిస్తాను.
చూడండి, నేను అతన్ని జనాంగాలకు సాక్షిగా చేశాను,
జనాంగాలకు రాజుగా అధిపతిగా అతన్ని నియమించాను.
ఖచ్చితంగా నీకు తెలియని దేశాలను నీవు పిలుస్తావు.
యెహోవా నిన్ను మహిమపరచడం చూసి
నీ దేవుడైన యెహోవాను బట్టి
ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి
నీవెవరో తెలియని దేశాలు నీ దగ్గరకు పరుగెత్తుకొని వస్తాయి.
 
యెహోవా మీకు దొరికే సమయంలో ఆయనను వెదకండి;
ఆయన సమీపంలో ఉండగానే ఆయనను వేడుకోండి.
దుష్టులు తమ మార్గాలను
అవినీతిపరులు తమ ఆలోచనలు విడిచిపెట్టాలి.
వారు యెహోవా వైపు తిరిగితే ఆయన వారిపై జాలి పడతారు.
మన దేవుడు వారిని ఉచితంగా క్షమిస్తారు.
 
“నా ఆలోచనలు మీ ఆలోచనల వంటివి కావు,
మీ మార్గాలు నా మార్గాల వంటివి కావు”
అని యెహోవా చెప్తున్నారు.
“ఆకాశాలు భూమి కన్నా ఎంత ఎత్తుగా ఉన్నాయో,
మీ మార్గాల కన్నా నా మార్గాలు
మీ ఆలోచనల కన్నా నా ఆలోచనలు అంత ఎత్తుగా ఉన్నాయి.
10 వర్షం మంచు ఆకాశం నుండి క్రిందికి వచ్చి
ఎలా తిరిగి వెళ్లకుండా భూమిని తడిపి
విత్తువానికి విత్తనాన్ని తినేవానికి ఆహారాన్ని ఇవ్వడానికి
భూమిని తడిపి
విత్తువానికి విత్తనాన్ని తినేవానికి ఆహారాన్ని ఇవ్వడానికి
అది చిగురించి ఫలించేలా చేస్తాయో,
11 అలాగే నా నోటి నుండి వచ్చిన నా మాట ఉంటుంది:
అది వట్టిగా నా దగ్గరకు తిరిగి రాకుండా
నేను కోరుకున్న ప్రకారం చేసి
నేను దానిని పంపిన ఉద్దేశాన్ని నెరవేరుస్తుంది.
12 మీరు సంతోషంగా బయటకు వెళ్తారు,
మీరు సమాధానంగా తీసుకెళ్తారు.
మీ ఎదుట పర్వతాలు కొండలు
పాటలు పాడడం ప్రారంభిస్తాయి,
పొలం లోని చెట్లన్నీ
తమ చేతులతో చప్పట్లు కొడతాయి.
13 ముండ్ల చెట్లకు బదులు సరళ వృక్షాలు పెరుగుతాయి,
దురదగొండి చెట్లకు బదులు గొంజిచెట్లు ఎదుగుతాయి.
ఇది యెహోవా కీర్తిగా నిత్యమైన గుర్తుగా
ఎప్పటికీ నిలిచి ఉంటుంది.”