59
పాపం, ఒప్పుకోలు, విమోచన 
  1 నిజంగా రక్షించలేనంతగా యెహోవా చేయి కురుచకాలేదు,  
వినలేనంతగా ఆయన చెవులు మందం కాలేదు.   
 2 కాని మీ పాపాలు మిమ్మల్ని  
మీ దేవుని నుండి వేరు చేశాయి;  
మీ పాపాలు ఆయన ముఖాన్ని మీకు కనబడకుండా చేశాయి,  
కాబట్టి ఆయన వినడం లేదు.   
 3 మీ చేతులు రక్తంతో  
మీ వ్రేళ్లు దోషంతో మలినమయ్యాయి.  
మీ పెదవులు అబద్ధాలు పలికాయి,  
మీ నాలుక చెడ్డ మాటలు మాట్లాడింది.   
 4 న్యాయం గురించి ఎవరూ పట్టించుకోరు;  
ఎవరూ నిజాయితితో వాదించరు.  
వారు వట్టి వాదనలను నమ్ముకుని అబద్ధాలు చెప్తారు;  
వారు హింసను గర్భం దాల్చి చెడును కంటారు.   
 5 వారు మిడునాగుల గుడ్లను పొదుగుతారు  
సాలెగూడు నేస్తారు.  
వారి గుడ్లు తిన్నవారు చనిపోతారు,  
ఒక గుడ్డు పగిలితే విషపాము పుడుతుంది.   
 6 వారి సాలెగూళ్లు దుస్తులకు పనికిరావు  
వారు తయారుచేసిన వాటితో తమను తాము కప్పుకోలేరు.  
వారి పనులు చెడుపనులు.  
వారి చేతులతో హింసాత్మక క్రియలు ఉన్నాయి.   
 7 వారి కాళ్లు పాపంలోకి పరుగెత్తుతాయి;  
నిరపరాధుల రక్తాన్ని చిందించడానికి వారు త్వరపడతారు.  
వారు దుష్ట పథకాలు అనుసరిస్తారు.  
హింస క్రియలు వారి మార్గాల్లో ఉన్నాయి.   
 8 సమాధాన మార్గం వారికి తెలియదు;  
వారి మార్గాల్లో న్యాయం ఉండదు.  
వాటిని వారు వంకర దారులుగా చేశారు;  
వాటిలో నడిచే వారెవరికి సమాధానం ఉండదు.   
 9 కాబట్టి న్యాయం మనకు దూరంగా ఉంది,  
నీతి మనకు అందడం లేదు.  
మేము వెలుగు కోసం చూస్తున్నాం కాని అంతా చీకటే ఉంది;  
ప్రకాశం కోసం చూస్తున్నాం కాని కటిక చీకటిలోనే నడుస్తున్నాము.   
 10 గ్రుడ్డివారిలా గోడ కోసం తడుముకుంటున్నాము,  
కళ్లులేని వారిలా తడుముకుంటున్నాము.  
సంధ్య చీకటి అన్నట్టు మధ్యాహ్నం కాలుజారి పడుతున్నాము.  
బలవంతుల మధ్యలో చచ్చిన వారిలా ఉన్నాము.   
 11 మేమంతా ఎలుగుబంట్లలా కేకలు వేస్తున్నాము;  
పావురాల్లా దుఃఖంతో మూలుగుతున్నాము.  
మేము న్యాయం కోసం చూస్తున్నాం కాని అది దొరకడం లేదు.  
రక్షణ కోసం చూస్తున్నాం కాని అది మాకు దూరంగా ఉంది.   
 12 మా అపరాధాలన్నీ మా ఎదుట ఉన్నాయి  
మా పాపాలు మామీద సాక్ష్యం ఇస్తున్నాయి.  
మా అపరాధాలన్నీ ఎల్లప్పుడు మాతో ఉన్నాయి,  
మా దోషాలు మాకు తెలుసు.   
 13 తిరుగుబాటు చేసి యెహోవాకు ద్రోహం చేశాం,  
మా దేవునికి విరుద్ధంగా ఉంటూ,  
తిరుగుబాటును ప్రేరేపించడం బాధపెట్టడం,  
మా హృదయంలో ఆలోచించుకుని, అబద్ధాలు చెప్పడము.   
 14 కాబట్టి న్యాయం వెనుకకు నెట్టబడింది,  
నీతి దూరంగా నిలబడింది.  
సత్యం వీధుల్లో పడి ఉంది.  
నిజాయితీ లోపలికి రాలేకపోతుంది.   
 15 సత్యం ఎక్కడా కనిపించడం లేదు,  
చెడును విడిచిపెట్టేవాడు దోచుకోబడుతున్నాడు.  
న్యాయం జరగకపోవడం చూసి  
యెహోవా అసంతృప్తి చెందారు.   
 16 ఎవరూ లేరని ఆయన చూశారు,  
మధ్యవర్తి ఎవరూ లేకపోవడం చూసి ఆయన ఆశ్చర్యపోయారు;  
కాబట్టి ఆయన చేయి ఆయనకు సహాయం చేసింది,  
ఆయన నీతి ఆయనను నిలబెట్టింది.   
 17 ఆయన నీతిని తన కవచంగా ధరించారు,  
రక్షణను తన తలమీద శిరస్త్రాణంగా ధరించారు;  
ఆయన ప్రతీకార వస్త్రాలను ధరించారు  
పై వస్త్రం ధరించినట్లు ఆయన తనను తాను ఆసక్తితో చుట్టుకున్నారు.   
 18 వారు చేసిన దానిని బట్టి  
ఆయన ప్రతిఫలం ఇస్తారు  
తన శత్రువులకు కోపం చూపిస్తారు  
తన విరోధులకు ప్రతీకారం చేస్తారు;  
ఆయన ద్వీపాలకు తగిన ప్రతిఫలాన్ని చెల్లిస్తారు.   
 19 పశ్చిమలో ఉన్నవారు యెహోవా నామానికి భయపడతారు.  
సూర్యోదయ దిక్కున ఉన్నవారు ఆయన మహిమను గౌరవిస్తారు.  
యెహోవా ఊపిరి తీసుకువచ్చే ఉధృతమైన  
వరదలా ఆయన వస్తారు.   
 20 “సీయోను దగ్గరకు, యాకోబులో తమ పాపాలకు పశ్చాత్తాపం చెందినవారి దగ్గరకు  
విమోచకుడు వస్తాడు,”  
అని యెహోవా తెలియజేస్తున్నారు.   
 21 “నేను వారితో చేసే నా నిబంధన ఇదే” అని యెహోవా చెప్తున్నారు. “మీమీద ఉన్న నా ఆత్మ మీ నుండి తొలిగిపోదు, నేను మీ నోటిలో ఉంచిన నా మాటలు, మీ పెదవుల నుండి, మీ పిల్లల పెదవుల నుండి, వారి వారసుల పెదవుల నుండి, ఇప్పటినుండి ఎప్పటికీ తొలగిపోవు” అని యెహోవా తెలియజేస్తున్నారు.