62
సీయోను యొక్క క్రొత్త పేరు
సీయోను నీతి ఉదయకాంతిలా ప్రకాశించే వరకు,
దాని రక్షణ కాగడాలా వెలిగే వరకు,
సీయోను పక్షంగా నేను మౌనంగా ఉండను.
యెరూషలేము పక్షంగా నేను ఊరుకోలేను.
దేశాలు నీ నీతిని చూస్తాయి.
రాజులందరూ నీ మహిమను చూస్తారు.
యెహోవా నీకు ఇవ్వబోయే
క్రొత్త పేరుతో నీవు పిలువబడతావు.
నీవు యెహోవా చేతిలో వైభవ కిరీటంగా,
నీ దేవుని చేతిలో రాజకిరీటంగా ఉంటావు.
ఇకపై నీవు విడిచిపెట్టబడిన దానివని పిలువబడవు,
నీ దేశం పాడైపోయిందని పిలువబడదు.
అయితే నీవు హెఫ్సీబా*హెఫ్సీబా అంటే నా ఆనందం ఆమెలో ఉంది అని
నీ దేశం బ్యూలాబ్యూలా అంటే పెళ్ళి అయ్యింది అని పిలువబడుతుంది;
యెహోవా నీలో ఆనందిస్తారు
నీ దేశానికి పెళ్ళి అవుతుంది.
యువకుడు యువతిని పెళ్ళి చేసుకున్నట్లు
నిన్ను కట్టేవాడు నిన్ను చేసుకుంటాడు;
పెళ్ళికుమారుడు పెళ్ళికుమార్తెను చూసి సంతోషించినట్లు,
నీ దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తారు.
 
యెరూషలేమా! నీ గోడల మీద నేను కావలివారిని నియమించాను;
పగలు గాని రాత్రి గాని వారు మౌనంగా ఉండరు.
యెహోవాకు మొరపెట్టే వారలారా
విశ్రాంతి తీసుకోకండి,
యెరూషలేమును స్థాపించే వరకు
భూమి మీద దానికి ప్రసిద్ధి కలుగజేసే వరకు ఆయనకు విశ్రాంతి ఇవ్వకండి.
 
యెహోవా తన కుడిచేతితో
తన బలమైన హస్తంతో ఇలా ప్రమాణం చేశారు:
“ఇకనుండి ఎప్పుడూ నీ ధాన్యాన్ని
నీ శత్రువులకు ఆహారంగా నేనివ్వను.
నీవు కష్టపడి తీసిన ద్రాక్షారసాన్ని
విదేశీయులు ఇక ఎన్నడు త్రాగరు;
అయితే పంట పండించిన వారే దానిని తిని
యెహోవాను స్తుతిస్తారు.
ద్రాక్షలను సమకూర్చిన వారే
నా పరిశుద్ధాలయ ఆవరణాల్లో దాని త్రాగుతారు.”
 
10 రండి, గుమ్మాల ద్వారా రండి!
ప్రజలకు మార్గం సిద్ధపరచండి.
నిర్మించండి, రహదారిని నిర్మించండి!
రాళ్లను తొలగించండి.
దేశాలు చూసేలా జెండాను ఎత్తండి.
 
11 భూమి అంచుల వరకు
యెహోవా చేస్తున్న ప్రకటన:
“ ‘ఇదిగో నీ రక్షకుడు వస్తున్నాడు!
ఆయన ఇచ్చే బహుమానం ఆయన దగ్గరే ఉంది
ఆయన ఇచ్చే జీతం ఆయన దగ్గరే ఉంది’ అని
సీయోను కుమార్తెతో చెప్పండి.”
12 వారు పరిశుద్ధ ప్రజలని,
యెహోవా విడిపించినవారని పిలువబడతారు;
నీవు అందరికి కావలసిన దానివని
పాడుబడని పట్టణమని పిలువబడతావు.

*62:4 హెఫ్సీబా అంటే నా ఆనందం ఆమెలో ఉంది

62:4 బ్యూలా అంటే పెళ్ళి అయ్యింది