20
ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులను శిక్షించుట
అప్పుడు ఇశ్రాయేలీయులందరు, దాను నుండి బెయేర్షేబ వరకు ఉన్నవారు, గిలాదు ప్రదేశంలో ఉన్నవారు, అంతా ఏకమై మిస్పా దగ్గర యెహోవా సన్నిధిలో సమావేశమయ్యారు. ఇశ్రాయేలు గోత్రాలన్నిటి నాయకులు, నాలుగు లక్షలమంది ఆయుధాలు కలిగి దేవుని ప్రజల సమావేశానికి హాజరయ్యారు. ఇశ్రాయేలీయులు మిస్పాకు వెళ్లారని బెన్యామీనీయులు విన్నారు. అప్పుడు ఇశ్రాయేలీయులు, “ఈ నీచమైన పని ఎలా జరిగిందో మాకు చెప్పండి” అన్నారు.
చంపబడిన స్త్రీ భర్తయైన లేవీయుడు మాట్లాడుతూ అన్నాడు, “నేను, నా ఉంపుడుగత్తె రాత్రి గడుపుదామని బెన్యామీనులోని గిబియాకు వచ్చాము. రాత్రివేళ గిబియా నాయకులు నా వెంటపడి నన్ను చంపాలనుకొని ఇంటిని చుట్టుముట్టారు. వారు నా ఉంపుడుగత్తెను మానభంగం చేయగా ఆమె చనిపోయింది. ఇశ్రాయేలులో ఇలాంటి దుర్మార్గం, అవమానకరమైన పనివారు చేశారు కాబట్టి నా ఉంపుడుగత్తెను తీసుకెళ్లి ఆమెను ముక్కలుగా చేసి ఒక్కొక్క ముక్కను ఇశ్రాయేలీయుల వారసత్వ ప్రాంతాలకు పంపాను. ఇప్పుడు, ఇశ్రాయేలీయులైన మీరంతా మాట్లాడి ఏమి చేయాలని నిర్ణయించారో చెప్పండి” అన్నాడు.
అప్పుడు ప్రజలంతా ఏకమై లేచి, “మనలో ఎవ్వరూ తమ గుడారానికి గాని ఇళ్ళకు గాని తిరిగి వెళ్లరు. అయితే గిబియాకు మనం చేసేది ఇది: చీట్లు వేసి దాని ప్రకారం మనం గిబియా మీద దాడి చేద్దాము. 10 ఆహారం తీసుకురావడానికి ఇశ్రాయేలు గోత్రాలన్నిటి నుండి వందమందికి పదిమందిని, వెయ్యిమందికి వందమందిని, పదివేలమందికి వెయ్యిమందిని ఎన్నుకుందాము. అప్పుడు సైన్యం బెన్యామీనులోని గెబాకు*కొ.ప్ర.లలో గిబియా చేరుకుంటారు, ఇశ్రాయేలులో వారు చేసిన అవమానకరమైన పనిని బట్టి వారిని శిక్షిస్తారు” అని అన్నారు. 11 కాబట్టి ఇశ్రాయేలీయులందరు ఏకమై లేచి పట్టణానికి వ్యతిరేకంగా కూడుకున్నారు.
12 ఇశ్రాయేలు గోత్రాల వారు బెన్యామీను గోత్రమంతటికి దూతలను పంపి అన్నారు, “మీ మధ్య జరిగిన ఈ నీచమైన నేరం సంగతి ఏమిటి? 13 ఇప్పుడు గిబియాలో ఉన్న ఆ దుష్టులను అప్పగించండి, మేము వారిని చంపి ఇశ్రాయేలులో ఈ దుష్టత్వం లేకుండా చేస్తాము.”
కాని బెన్యామీనీయులు తమ తోటి ఇశ్రాయేలీయుల మాట వినలేదు. 14 ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయడానికి, బెన్యామీనీయులు తమ పట్టణాల నుండి గిబియా దగ్గరకు కలిసి వచ్చారు. 15 ఆ రోజు గిబియాలో నివసిస్తున్న ఏడువందలమంది శూరులకు అధనంగా బెన్యామీనీయులు తమ పట్టణాల నుండి కత్తియుద్ధం చేయగలిగే ఇరవై ఆరు వేలమందిని పోగుచేసుకున్నారు. 16 వీరందరిలో ఎడమచేతి వాటంగల వారు ఏడువందలమంది ప్రత్యేకమైన వారున్నారు, ఒక్కొక్కరు వడిసెలలో రాయి పెట్టి, తల వెంట్రుకలనైనా గురి తప్పకుండా కొట్టగలరు.
17 బెన్యామీను వారు కాకుండా, ఇశ్రాయేలు వారు కత్తియుద్ధం చేయగలిగే, అనుభవజ్ఞులైన నాలుగు లక్షల మందిని పోగుచేసుకున్నారు.
18 ఇశ్రాయేలీయులు బేతేలుకు వెళ్లి దేవుని దగ్గర విచారణ చేస్తూ, “బెన్యామీనీయుల మీద యుద్ధానికి మాలో ఎవరు ముందు వెళ్లాలి?” అని అడిగారు.
యెహోవా జవాబిస్తూ, “యూదా వారే ముందు వెళ్లాలి” అన్నారు.
19 మరుసటిరోజు ఉదయం ఇశ్రాయేలీయులు లేచి గిబియా దగ్గర మకాం వేశారు. 20 ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులతో యుద్ధం చేయడానికి గిబియా దగ్గర వారికి ఎదురుగా బారులు తీరారు. 21 ఆ రోజు బెన్యామీనీయులు గిబియాలో నుండి బయటకు వచ్చి, యుద్ధభూమిలో ఇరవైరెండువేలమంది ఇశ్రాయేలీయులను హతం చేశారు. 22 అయితే ఇశ్రాయేలీయులు ఒకరిని ఒకరు ప్రోత్సహించుకొని మొదట రోజున ఉన్న చోటనే మళ్ళీ యుద్ధానికి బారులు తీరారు. 23 ఇశ్రాయేలీయులు వెళ్లి యెహోవా ఎదుట సాయంత్రం వరకు ఏడ్చి, “మా తోటి ఇశ్రాయేలీయులైన బెన్యామీనీయుల మీదికి మళ్ళీ యుద్ధానికి వెళ్లాలా?” అని అడిగారు.
యెహోవా జవాబిస్తూ, “వారి మీదికి వెళ్లండి” అన్నారు.
24 అప్పుడు రెండవ రోజు ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులను సమీపించారు. 25 ఈసారి వారిని ఎదుర్కోడానికి గిబియా నుండి వచ్చిన బెన్యామీనీయులు పద్దెనిమిదివేలమందిని ఇశ్రాయేలీయులను, హతం చేశారు, వారంతా ఆయుధాలు కలవారు.
26 అప్పుడు ఇశ్రాయేలీయులందరు, సైన్యమంతా బేతేలుకు వెళ్లి అక్కడ యెహోవా సన్నిధిలో కూర్చుని ఏడ్చారు. వారు సాయంత్రం వరకు ఉపవాసం ఉండి దహనబలులు సమాధానబలులు యెహోవాకు అర్పించారు. 27 ఇశ్రాయేలీయులు యెహోవా దగ్గర విచారణ చేశారు. (ఆ రోజుల్లో దేవుని నిబంధన మందసం అక్కడ ఉండేది, 28 అహరోను కుమారుడు ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసు దాని ముందు నిలబడి సేవ చేసేవాడు.) వారు అడిగారు, “మేము వెళ్లి మా తోటి ఇశ్రాయేలీయులైన బెన్యామీనీయుల మీద యుద్ధానికి వెళ్లాల వద్దా?”
యెహోవా జవాబిస్తూ, “వెళ్లండి, రేపు వారిని మీ చేతికి అప్పగిస్తాను” అన్నారు.
29 ఆ తర్వాత ఇశ్రాయేలు వారు గిబియా చుట్టూ మాటు వేశారు. 30 మూడవ రోజు ఇశ్రాయేలీయులు బెన్యామీనీయుల మీదికి వెళ్లి, మునుపటిలా గిబియాను ఎదురుగా యుద్ధానికి బారులు తీరారు. 31 వారిని ఎదిరించడానికి బెన్యామీనీయులు బయటకు వచ్చి వారిని తరుముతూ పట్టణం నుండి దూరంగా వెళ్లారు. మునుపటిలా వారు ఇశ్రాయేలీయులలో గాయపడిన వారిని చంపడం మొదలుపెట్టి, బేతేలుకు గిబియాకు వెళ్లే రహదారుల్లో, మైదానాల్లో సుమారు ముప్పైమంది ఇశ్రాయేలీయులు చనిపోయారు. 32 “మునుపటిలా మనం వారిని ఓడిస్తున్నాం” అని బెన్యామీనీయులు అనేటప్పుడు ఇశ్రాయేలీయులు, “మనం పరుగెత్తి వారు తమ పట్టణం నుండి బయటకు వచ్చేలా చేద్దాం” అని చెప్పుకున్నారు.
33 ఇశ్రాయేలు వారందరు తామున్న చోట్ల నుండి బయలుదేరి బయల్-తామారు దగ్గర బారులు తీరారు. అప్పుడు మాటున ఉన్న ఇశ్రాయేలీయులు తమ స్థలం నుండి గెబాకుహెబ్రీలో గెబాకు అనేది గిబియాకు మరో పేరు పడమటి వైపు నుండి దాడి చేశారు. 34 అప్పుడు ఇశ్రాయేలీయులలో పదివేలమంది శూరులైన యువకులు గిబియా ఎదురుగా వచ్చి దాడి చేశారు. యుద్ధం ఎంతో తీవ్రంగా ఉండడంతో బెన్యామీనీయులు తమకు ఆపద రాబోతుందని గ్రహించలేదు. 35 యెహోవా ఇశ్రాయేలీయుల చేతిలో బెన్యామీనీయులను ఓడించారు. ఆ రోజు ఇశ్రాయేలీయులు 25,100 మంది బెన్యామీనీయులను చంపారు. వారంతా కత్తి పట్టినవారే. 36 అప్పుడు తాము ఓటమి పాలయ్యామని బెన్యామీనీయులు తెలుసుకున్నారు.
ఇశ్రాయేలీయులు తాము గిబియా మీద పెట్టిన మాటుగాండ్రను నమ్మి బెన్యామీనీయులకు దారి ఇచ్చారు. 37 మాటులో ఉన్నవారు గిబియాలో అకస్మాత్తుగా చొరబడి వారు పట్టణంలోని వారందరిని ఖడ్గంతో చంపారు. 38 పట్టణంలో నుండి పెద్ద మేఘంలా పొగను రాజేయాలని మాటున దాక్కున్న వారికి ఇశ్రాయేలీయులకు మధ్య సంకేతం ఏర్పాటు చేసుకున్నారు, 39 అప్పుడు ఇశ్రాయేలీయులు తిరిగి యుద్ధం చేశారు.
బెన్యామీనీయులు ఇశ్రాయేలీయులకు (దాదాపు ముప్పైమందిని) ప్రాణనష్టం కలిగిస్తూ, “మొదటి యుద్ధంలా మనం వారిని ఓడిస్తున్నాం” అని అన్నారు. 40 అయితే పట్టణంలో నుండి పొగ పైకి లేవడం ఆరంభమైనప్పుడు, బెన్యామీనీయులు పట్టణమంతా ఆకాశం వైపు వెళ్తున్న పొగను చూశారు. 41 అప్పుడు ఇశ్రాయేలీయులు ఎదురు దాడి చేశారు, విపత్తు తమను సమీపించిందని తెలుసుకొని బెన్యామీనీయులు హడలిపోయారు. 42 కాబట్టి వారు ఇశ్రాయేలీయుల నుండి అరణ్యం వైపు పారిపోయారు, కానీ వారు యుద్ధం తప్పించుకోలేకపోయారు. పట్టణాల్లో నుండి వచ్చిన ఇశ్రాయేలీయులు వారిని అక్కడ హతం చేశారు. 43 వారు బెన్యామీనీయులను చట్టుముట్టి ఆగకుండా వారిని తరిమి గిబియాకు తూర్పుదిక్కు ప్రాంతం దగ్గర ఓడించారు. 44 పద్దెనిమిది వేలమంది బెన్యామీనీయులు పడిపోయారు, వారంతా యుద్ధవీరులు. 45 మిగిలిన వారు అరణ్యం వైపు, రిమ్మోను బండ వైపు పారిపోతున్నప్పుడు, ఇశ్రాయేలీయులు రహదారుల వెంట అయిదువేల మందిని హతం చేశారు. వారింకా బెన్యామీనీయులను గిదోము వరకు తరుముతూ ఇంకొక రెండువేలమందిని హతం చేశారు.
46 ఆ రోజు ఇరవై అయిదువేల బెన్యామీనీయులు కూలారు. వారంతా యుద్ధవీరులు. 47 అయితే వారిలో ఆరువందలమంది మాత్రం తప్పించుకు వెళ్లి అరణ్యంలో ఉన్న రిమ్మోను బండ దగ్గరకు పారిపోయి అక్కడ నాలుగు నెలలు ఉండిపోయారు. 48 ఇశ్రాయేలీయులు బెన్యామీను ప్రదేశానికి తిరగి వెళ్లి పట్టణాల మీద పడి పశువులను, కనిపించిన దాన్నంతా ఖడ్గంతో హతం చేశారు. వారికి కనబడిన ప్రతి పట్టణాన్ని తగుల బెట్టారు.

*20:10 కొ.ప్ర.లలో గిబియా

20:33 హెబ్రీలో గెబాకు అనేది గిబియాకు మరో పేరు