2
ఇశ్రాయేలు దేవుని విడిచిపెట్టుట 
  1 యెహోవా వాక్కు నాకు వచ్చి ఇలా చెప్పింది:   2 “నీవు వెళ్లి యెరూషలేము వింటూ ఉండగా ఇలా ప్రకటించు:  
“యెహోవా ఇలా అంటున్నారు:  
“ ‘నీ యవ్వనంలోని నీ భక్తి నాకు జ్ఞాపకముంది,  
మీ నిశ్చితార్థ కాలం యొక్క ప్రేమ నాకు జ్ఞాపకముంది;  
నీవు అరణ్యంలో నన్ను వెంబడించావు,  
విత్తబడని భూమిలో నన్ను వెంబడించావు.   
 3 ఇశ్రాయేలు యెహోవాకు పరిశుద్ధమైనది,  
వారు ఆయన పంటలోని ప్రథమ ఫలాలు;  
ఇశ్రాయేలీయులను మ్రింగివేసినవారు శిక్షకు పాత్రులు,  
విపత్తు వారి మీదికి వస్తుంది’ ”  
అని యెహోవా ప్రకటిస్తున్నారు.   
 4 యాకోబు సంతానమా, సర్వ ఇశ్రాయేలు వంశస్థులారా,  
యెహోవా మాట వినండి.   
 5 యెహోవా ఇలా చెప్తున్నారు:  
“మీ పూర్వికులు అంతలా దూరమవడానికి,  
వారికి నాలో ఏం తప్పు కనిపించింది?  
వారు విలువలేని విగ్రహాలను పూజించి,  
వారు విలువలేని వారయ్యారు.   
 6 వారు, ‘ఈజిప్టు నుండి మమ్మల్ని రప్పించి,  
నిర్జన అరణ్యం గుండా,  
ఎడారులు, కనుమలు ఉన్న భూమి గుండా,  
కరువు, చీకటి నిండిన భూమి గుండా,  
ఎవరూ ప్రయాణించని, ఎవరూ నివసించని భూమి గుండా  
మమ్మల్ని నడిపించిన యెహోవా ఎక్కడ?’ అని అడిగారు.   
 7 నేను మిమ్మల్ని సారవంతమైన దేశంలోకి,  
దాని ఫలాలను, శ్రేష్ఠమైన వాటిని తినడానికి తీసుకువచ్చాను.  
అయితే మీరు వచ్చి నా దేశాన్ని ఆచారరీత్య అపవిత్రం చేసి  
నా స్వాస్థ్యాన్ని అసహ్యమైనదిగా చేశారు.   
 8 యాజకులు ‘యెహోవా ఎక్కడ ఉన్నారు?’  
అని అడగలేదు.  
ధర్మశాస్త్రాన్ని బోధించే వారికి నేను తెలియదు;  
నాయకులు నా మీదికి తిరుగబడ్డారు.  
ప్రవక్తలు పనికిరాని విగ్రహాలను పూజిస్తూ,  
బయలు పేరిట ప్రవచించారు.   
 9 “కాబట్టి నేను మీమీద మళ్ళీ నేరారోపణ చేస్తాను”  
మీ పిల్లల పిల్లల మీద కూడా నేరారోపణ చేస్తాను,  
“అని యెహోవా ప్రకటిస్తున్నారు.   
 10 కుప్ర*హెబ్రీలో కిత్తీము తీరాల అవతలి వైపుకు వెళ్లి చూడండి,  
కేదారుకు†సిరియా-అరేబియా ఎడారి దూతల్ని పంపి దగ్గరి నుండి గమనించండి;  
ఇలాంటిది ఎప్పుడైనా జరిగి ఉంటుందేమో చూడండి:   
 11 ఏ దేశమైనా తన దేవుళ్ళను ఎప్పుడైనా మార్చుకుందా?  
అయినా అవి దేవుళ్ళే కావు.  
కాని నా ప్రజలు పనికిమాలిన విగ్రహాల కోసం  
తమ మహిమగల దేవున్ని మార్చుకున్నారు.   
 12 ఆకాశమా, దీని గురించి ఆందోళన చెంది,  
భయంతో వణుకు,”  
అని యెహోవా చెప్తున్నారు.   
 13 “నా ప్రజలు రెండు చెడు పాపాలు చేశారు:  
జీవజలపు ఊటనైన నన్ను  
వారు విసర్జించి,  
తమ కోసం సొంత తొట్లు తొలిపించుకున్నారు,  
అవి పగిలిన తొట్లు, వాటిలో నీళ్లు నిలువవు.   
 14 ఇశ్రాయేలు దాసుడా? పుట్టుకతోనే బానిసా?  
అలాంటప్పుడు అతడు దోపుడుసొమ్ము ఎందుకు అయ్యాడు?   
 15 సింహాలు గర్జించాయి;  
అవి అతని మీదికి గుర్రుమన్నాయి.  
వారు అతని దేశాన్ని పాడుచేశారు;  
అతని పట్టణాలు కాలిపోయి నిర్జనమయ్యాయి.   
 16 అలాగే, మెంఫిసు,‡హెబ్రీలో నోఫు తహ్పన్హేసు పట్టణస్థులు,  
నీ పుర్రె పగులగొట్టారు.   
 17 కానీ నీ దేవుడైన యెహోవా మార్గంలో నిన్ను నడిపిస్తున్నప్పుడు,  
నీవు ఆయనను విడిచిపెట్టి,  
నీకు నీవే ఇదంతా నీ మీదికి తెచ్చుకోలేదా?   
 18 నైలు నది§హెబ్రీలో షీహోరు; అంటే, నైలు నది ప్రవహించే ఒక శాఖ నీళ్లు త్రాగడానికి  
ఈజిప్టుకు ఎందుకు వెళ్లాలి?  
యూఫ్రటీసు నుండి నీళ్లు త్రాగడానికి  
అష్షూరుకు ఎందుకు వెళ్లాలి?   
 19 నీ దుర్మార్గం నిన్ను శిక్షిస్తుంది;  
నీ భక్తిహీనత నిన్ను గద్దిస్తుంది.  
నీ దేవుడైన యెహోవాను,  
నీవు విడిచిపెట్టడం,  
నేనంటే భయం లేకపోవడం,  
నీకు ఎంత బాధ శ్రమ కలిగిస్తుందో ఆలోచించు, గ్రహించు”  
అని సైన్యాల అధిపతియైన యెహోవా ప్రకటిస్తున్నారు.   
 20 “చాలా కాలం క్రితమే నేను నీ కాడిని విరగ్గొట్టాను,  
నీ బంధకాలను తెంపివేశాను;  
అయినా నీవు, ‘నేను నీ సేవ చేయను!’ అన్నావు  
కాని నిజానికి, ప్రతీ ఎత్తైన కొండమీద,  
ప్రతీ పచ్చని చెట్టు క్రింద  
నీవు వేశ్యలా పడుకుంటున్నావు.   
 21 నేను నిన్ను శ్రేష్ఠమైన ద్రాక్షవల్లిగా  
మంచి, నమ్మదగిన మొక్కగా నాటాను.  
అలాంటప్పుడు నీవు నాకు వ్యతిరేకంగా  
చెడిపోయిన అడవి ద్రాక్షవల్లిగా ఎలా మారావు?   
 22 నీవు సబ్బుతో నిన్ను నీవు కడుక్కున్నా  
శుభ్రం చేయడానికి వాడే చూర్ణం వాడినా,  
నీ అపరాధపు మరక ఇంకా కనిపిస్తుంది,”  
అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.   
 23 “నీవు, ‘నేను అపవిత్రం కాలేదు;  
నేను బయలు విగ్రహాల వెంట పరుగెత్తలేదు’ అని ఎలా అనగలవు?  
లోయలో నీవు ఎలా ప్రవర్తించావో చూడు;  
నీవు ఏమి చేశావో కాస్త గమనించు.  
నీవు ఇటు అటు వేగంగా  
పరుగెత్తే ఆడ ఒంటెవు,   
 24 ఎడారికి అలవాటు పడిన అడవి గాడిదవు,  
అది కామంతో గాలిని పసిగడుతుంది,  
అది తాపంలో ఉన్నప్పుడు దానిని ఎవరు అడ్డుకోగలరు?  
దాన్ని వెంటాడే మగ గాడిదలకు అలసట రాదు;  
అది కలుసుకునే సమయంలో అది వారికి కనబడుతుంది.   
 25 నీ పాదాల చెప్పులు అరిగిపోయే వరకు,  
నీ గొంతు ఆరిపోయే వరకు నీవు పరదేశి దేవుళ్ళ వెంట పరుగెత్తకు.  
అయితే మీరు ఇలా అన్నారు, ‘మాకు నీవు చెప్పి ప్రయోజనం లేదు!  
మేము పరదేశి దేవుళ్ళను ప్రేమిస్తున్నాము,  
మేము వారి వెంట వెళ్లాలి.’   
 26 “దొంగ పట్టుబడినప్పుడు అవమానించబడినట్లు,  
ఇశ్రాయేలు ప్రజలు అవమానించబడ్డారు;  
వారు వారి రాజులు వారి అధికారులు,  
వారి యాజకులు వారి ప్రవక్తలు అవమానించబడ్డారు.   
 27 వారు చెక్కతో, ‘నీవు మా తండ్రివి’ అని,  
రాయితో, ‘నీవు మాకు జన్మనిచ్చావు’ అంటున్నారు  
వారు నావైపు వారి ముఖాలు త్రిప్పకుండ,  
నాకు వెన్ను చూపారు;  
అయినప్పటికీ వారు కష్టంలో ఉన్నప్పుడు,  
‘వచ్చి మమ్మల్ని రక్షించండి!’ అని అంటారు.   
 28 అయితే మీరు మీ కోసం చేసుకున్న దేవుళ్ళు ఎక్కడున్నారు?  
మీరు కష్టాల్లో ఉన్నప్పుడు  
మిమ్మల్ని కాపాడగలిగితే రానివ్వండి!  
యూదా, నీకు ఎన్ని పట్టణాలున్నాయో,  
అంతమంది దేవుళ్ళు ఉన్నారు.   
 29 “నా మీద ఎందుకు ఆరోపణలు చేస్తున్నావు?  
మీరందరూ నాకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు”  
అని యెహోవా ప్రకటిస్తున్నారు.   
 30 “నేను వ్యర్థంగా నీ పిల్లలను శిక్షించాను;  
వారు దిద్దుబాటుకు స్పందించలేదు.  
నీ ఖడ్గం నీ ప్రవక్తలను,  
బాగా ఆకలిగా ఉన్న సింహంలా చంపింది.   
 31 “ఈ తరం వారలారా! యెహోవా మాటలు శ్రద్ధగా వినండి:  
“నేను ఇశ్రాయేలుకు ఎడారిగా  
మహా చీకటి దేశంగా ఉన్నానా?  
ఎందుకు నా ప్రజలు, ‘మేము స్వేచ్ఛగా తిరుగుతాము;  
ఇకపై మేము మీ దగ్గరకు రాము’ అని ఎందుకు అంటున్నారు?   
 32 ఒక యువతి తన నగలు,  
ఒక వధువు తన పెళ్ళి ఆభరణాలు మరచిపోతుందా?  
అయినా నా ప్రజలు లెక్కలేనన్ని రోజులు,  
నన్ను మరచిపోయారు.   
 33 ప్రేమను వెదకడంలో నీవు ఎంత నేర్పరివో!  
నీచమైన స్త్రీలు నీ నుండి నేర్చుకుంటారు.   
 34 నిర్దోషుల ప్రాణాధారమైన రక్తపు మరక  
నీ బట్టలపైన ఉంది.  
వారు లోపలికి చొచ్చుకొని వస్తూ ఉంటే నీవు వారిని పట్టుకోలేదు.  
ఇంత జరిగినా,   
 35 నీవు, ‘నేను నిర్దోషిని;  
ఆయనకు నా మీద కోపం రాదు’ అంటున్నావు.  
‘నేను పాపం చేయలేదు’ అని అంటున్నావు,  
కాబట్టి నేను నీ మీద తీర్పు ప్రకటిస్తాను.   
 36 నీ మార్గాలను మార్చుకుంటూ,  
ఎందుకు అంతలా తిరుగుతున్నావు?  
నీవు అష్షూరులో నిరాశచెందినట్టుగా  
ఈజిప్టు విషయంలో కూడా నీవు నిరాశ చెందుతావు.   
 37 నీ తలపై చేతులు పెట్టుకుని  
ఆ స్థలం నుండి వెళ్లిపోతావు,  
ఎందుకంటే నీవు నమ్మేవారిని యెహోవా తిరస్కరించారు;  
నీవు వారి ద్వారా సహాయం పొందలేవు.