4
 1 “ఇశ్రాయేలూ, నీవు తిరిగి వస్తే,  
నా దగ్గరకు తిరిగి రండి” అని యెహోవా ప్రకటిస్తున్నారు.  
“నీ అసహ్యమైన విగ్రహాలను నా దృష్టికి దూరంగా ఉంచితే  
ఇక దారి తొలగకుండా ఉంటే,   
 2 మీరు నిజాయితీ, న్యాయం నీతిగల మార్గంలో ఉండి,  
‘సజీవుడైన యెహోవా మీద’ అని ప్రమాణం చేస్తే,  
అప్పుడు నిన్ను బట్టి దేశాలు ఆశీర్వాదాలు పొందుతాయి,  
వారు యెహోవా పట్ల వారి అభిమానాన్ని చాటుకుంటారు.”   
 3 యూదా వారికి, యెరూషలేముకు యెహోవా ఇలా చెప్తున్నారు:  
“దున్నబడని నీ నేలను పగులగొట్టు  
ముళ్ళ మధ్య విత్తవద్దు.   
 4 మిమ్మల్ని మీరు యెహోవాకు సున్నతి చేసుకోండి,  
మీ హృదయాలను సున్నతి చేసుకోండి,  
యూదా ప్రజలారా, యెరూషలేము నివాసులారా,  
లేకపోతే మీరు చేసిన చెడును బట్టి  
నా కోపం అగ్నిలా మండుతుంది,  
ఆర్పడానికి ఎవరూ ఉండరు.   
ఉత్తర దిక్కునుండి విపత్తు 
  5 “యూదాలో ప్రకటించి, యెరూషలేములో ప్రకటించి ఇలా చెప్పు:  
‘దేశమంతటా బూరధ్వని చేయండి!’  
బిగ్గరగా కేకలువేస్తూ అనండి:  
‘ఒక్క దగ్గరికి రండి!  
కోటలున్న పట్టణాలకు పారిపోదాం!’   
 6 సీయోనుకు కనబడేలా జెండాను ఎత్తండి!  
ఆలస్యం చేయకుండా క్షేమం కోసం పారిపోండి!  
నేను ఉత్తరం నుండి విపత్తును,  
భయంకరమైన నాశనాన్ని కూడా తెస్తున్నాను.”   
 7 ఒక సింహం తన పొద చాటు నుండి బయటకు వచ్చింది;  
దేశాలను నాశనం చేసేవాడు బయలుదేరాడు.  
మీ దేశాన్ని పాడుచేయడానికి  
ఆయన తన స్థలాన్ని విడిచిపెట్టాడు.  
నీ పట్టణాలు  
నివాసులు లేకుండా శిథిలావస్థలో ఉంటాయి.   
 8 కాబట్టి గోనెపట్ట ధరించుకుని,  
విలపించండి, ఏడవండి,  
యెహోవా యొక్క భయంకరమైన కోపం  
మనల్ని విడిచిపెట్టలేదు.   
 9 యెహోవా ఇలా అంటున్నాడు,  
“ఆ రోజు రాజు, అధికారులు ధైర్యం కోల్పోతారు,  
యాజకులు భయపడతారు,  
ప్రవక్తలు ఆశ్చర్యపోతారు.”   
 10 అప్పుడు నేను, “అయ్యో, ప్రభువైన యెహోవా! ఖడ్గం మా గొంతు మీద ఉన్నప్పుడు, ‘మీకు సమాధానం కలుగుతుంది’ అని చెప్పి మీరు ఈ ప్రజలను, యెరూషలేమును ఎంత ఘోరంగా మోసం చేశారు!”   
 11 ఆ సమయంలో ఈ ప్రజలకు, యెరూషలేముకు ఇలా ప్రకటించబడుతుంది: “ఎడారిలో బంజరు కొండల నుండి మండే గాలి నా ప్రజల వైపు వీస్తుంది, కానీ పొట్టు చెరగడానికో లేదా శుభ్రం చేయడానికో కాదు.   12 అంతకంటే బలమైన గాలి నా మీద వీచింది, యెహోవా చెప్పినట్లు వారి మీదికి నా తీర్పులు ప్రకటిస్తున్నాను.”   
 13 చూడు! అతడు మేఘాల్లా ముందుకు సాగిపోతాడు,  
అతని రథాలు సుడిగాలిలా వస్తాయి,  
అతని గుర్రాలు గ్రద్దల కంటే వేగవంతమైనవి.  
అయ్యో మాకు శ్రమ! మేము నాశనం అయ్యాము!   
 14 యెరూషలేమా, నీ హృదయంలోని చెడును కడిగి రక్షించబడు.  
మీరు ఎంతకాలం చెడ్డ ఆలోచనలను కలిగి ఉంటారు?   
 15 దాను నుండి ఒక స్వరం,  
ఎఫ్రాయిం కొండల నుండి కీడు వస్తుందని ప్రకటిస్తుంది.   
 16 “దేశాలకు ఈ విషయం చెప్పండి,  
యెరూషలేము గురించి ఇలా ప్రకటించండి:  
‘దూరదేశం నుండి ముట్టడి చేస్తున్న సైన్యం,  
యూదా పట్టణాలకు వ్యతిరేకంగా యుద్ధ కేకలు వేస్తుంది.   
 17 పొలంలో కాపలా కాస్తున్న మనుష్యుల్లా వారు ఆమెను చుట్టుముట్టారు,  
ఎందుకంటే ఆమె నా మీదికి తిరుగుబాటు చేసింది’ ”  
అని యెహోవా ప్రకటిస్తున్నారు.   
 18 “మీ ప్రవర్తన మీ క్రియలు  
దీన్ని మీపైకి తెచ్చాయి.  
ఇది నీకు శిక్ష.  
ఎంత చేదుగా ఉంది!  
అది హృదయాన్ని ఎలా గ్రుచ్చుతుంది!”   
 19 అయ్యో, నా వేదన, నా వేదన!  
నేను నొప్పితో విలపిస్తున్నాను.  
అయ్యో, నా హృదయ వేదన!  
నా గుండె నాలో కొట్టుకుంటుంది,  
నేను మౌనంగా ఉండలేను.  
నేను బూరధ్వని విన్నాను;  
నేను యుద్ధ కేకలు విన్నాను.   
 20 విపత్తు తర్వాత విపత్తు వస్తున్నాయి;  
దేశం మొత్తం శిథిలావస్థలో ఉంది.  
వెంటనే నా గుడారాలు ధ్వంసమయ్యాయి,  
నా ఆశ్రయం క్షణంలో ధ్వంసమయ్యాయి.   
 21 నేను ఎంతకాలం యుద్ధ పతాక సంకేతాన్ని చూడాలి  
బూరధ్వని వినాలి?   
 22 “నా ప్రజలు మూర్ఖులు;  
వారికి నేను తెలియదు.  
వారు బుద్ధిలేని పిల్లలు;  
వారికి వివేచన లేదు.  
వారు కీడు చేయడంలో నేర్పరులు;  
మంచి చేయడం ఎలాగో వారికి తెలియదు.”   
 23 నేను భూమిని చూశాను,  
అది నిరాకారంగా, శూన్యంగా ఉంది;  
ఆకాశాల వైపు చూశాను,  
వాటి కాంతి పోయింది.   
 24 నేను పర్వతాలను చూశాను,  
అవి వణుకుతున్నాయి.  
కొండలన్నీ ఊగుతున్నాయి.   
 25 నేను చూశాను, అక్కడ మనుష్యులే లేరు;  
ఆకాశంలోని ప్రతి పక్షి ఎగిరిపోయింది.   
 26 నేను చూశాను, ఫలవంతమైన భూమి ఎడారి;  
దాని పట్టణాలన్ని  
యెహోవా ఎదుట, ఆయన ఉగ్రమైన కోపం ముందు శిథిలమైపోయాయి.   
 27 యెహోవా ఇలా అంటున్నాడు:  
“నేను దానిని పూర్తిగా నాశనం చేయనప్పటికీ,  
దేశమంతా పాడైపోతుంది.   
 28 కాబట్టి భూమి దుఃఖిస్తుంది  
పైనున్న ఆకాశం అంధకారం అవుతుంది,  
నేను మాట్లాడాను కాబట్టి పశ్చాత్తాపపడను,  
నేను నిర్ణయించుకున్నాను, కాబట్టి వెనుకకు తిరగను.”   
 29 గుర్రాలు, విలుకాడుల శబ్దానికి  
ప్రతి ఊరు ఎగిరిపోతుంది.  
కొందరు పొదల్లోకి వెళ్తారు;  
కొందరు రాళ్ల మధ్య ఎక్కుతారు.  
పట్టణాలన్ని నిర్జనమైపోయాయి;  
వాటిలో ఎవరూ నివసించరు.   
 30 అన్నీ నాశనమవుతుంటే, నీవు ఏం చేస్తున్నావు?  
ఎర్రని రంగును  
ధరించి బంగారు ఆభరణాలు ఎందుకు ధరించాలి?  
మీ కళ్లను అలంకరించుకుని ఎందుకు ఆకర్షణీయంగా చేస్తారు?  
నిన్ను నీవు వృధాగా అలంకరించుకున్నావు.  
నీ ప్రేమికులు నిన్ను తృణీకరిస్తారు;  
వారు నిన్ను చంపాలనుకుంటున్నారు.   
 31 ప్రసవ వేదనలో ఉన్న స్త్రీ ఏడ్పు,  
తన మొదటి బిడ్డను కంటూ వేదనపడుతున్న స్త్రీ కేకలు,  
ఊపిరి కోసం అల్లాడుతూ,  
సీయోను కుమారి తన చేతులు చాచి,  
“అయ్యో! నేను మూర్ఛపోతున్నాను;  
నా ప్రాణం హంతకులకు అప్పగించబడింది,”  
అంటూ కేకలు వేయడం నాకు వినబడుతుంది.