12
యిర్మీయా ఫిర్యాదు 
  1 యెహోవా, నేను మీ ముందు ఎప్పుడు వాదన వినిపించినా  
మీరెప్పుడూ నీతిమంతునిగానే ఉంటారు.  
అయినా మీ న్యాయం గురించి నేను మీతో మాట్లాడతాను:  
దుష్టులు ఎందుకు అభివృద్ధి చెందుతున్నారు?  
నమ్మకద్రోహులంతా ఎందుకు సుఖంగా జీవిస్తున్నారు?   
 2 మీరు వారిని నాటారు, వారు వేర్లు పాదుకున్నారు;  
వారు పెరిగి ఫలిస్తున్నారు.  
వారెల్లప్పుడూ మీ గురించి మాట్లాడతారు  
కానీ వారి హృదయాలు మీకు దూరంగా ఉంటాయి.   
 3 అయినా యెహోవా, నేను మీకు తెలుసు;  
మీరు నన్ను చూస్తున్నారు,  
మిమ్మల్ని గురించిన నా ఆలోచనలను మీరు పరీక్షిస్తున్నారు.  
వధకు గొర్రెలు లాగివేయబడునట్లు వారిని లాగివేయండి!  
వధ దినం కోసం వారిని వేరు చేయండి!   
 4 ఎంతకాలం భూమి ఎండిపోయి ఉండాలి?  
ఎంతకాలం పొలంలో గడ్డి ఎండిపోతూ ఉండాలి?  
అందులో నివసించేవారు దుర్మార్గులు కాబట్టి  
జంతువులు, పక్షులు నశించాయి.  
“మనకు ఏమి జరుగుతుందో యెహోవా చూడడు”  
అని ప్రజలు అంటున్నారు.   
దేవుని జవాబు 
  5 “మీరు కాలినడకన వెళ్తున్న వారితో పరుగెడితేనే  
వారు నిన్ను అలసిపోయేలా చేశారు,  
అలాంటప్పుడు గుర్రాలతో ఎలా పోటీపడతావు?  
భద్రతగల దేశం అని మీరనుకునే దేశంలోనే మీరు క్షేమంగా ఉండనప్పుడు,  
యొర్దాను ఒడ్డున ఉన్న దట్టమైన పొదల్లో ఎలా?   
 6 నీ బంధువులు, నీ సొంత కుటుంబ సభ్యులు కూడా,  
నీకు నమ్మకద్రోహం చేశారు;  
వారు నీ మీద పెద్దగా అరుస్తూ మాట్లాడారు.  
కాబట్టి వారు నీ గురించి మంచిగా మాట్లాడినా  
వారిని నమ్మవద్దు.   
 7 “నా ఇంటిని విడిచిపెడతాను,  
నా వారసత్వాన్ని వదిలివేస్తాను;  
నేను ప్రేమించిన దానిని  
తన శత్రువుల చేతికి అప్పగిస్తాను.   
 8 నా వారసత్వం నాకు  
అడవిలోని సింహంలా మారింది.  
అది నా మీదికి గర్జిస్తుంది;  
కాబట్టి నేను దానిని ద్వేషిస్తున్నాను.   
 9 నా వారసత్వం నాకు  
మచ్చలున్న క్రూరపక్షిలా కాలేదా?  
దాన్ని ఇతర పక్షులు చుట్టుముట్టి దాడి చేస్తాయి  
వెళ్లి క్రూర మృగాలన్నిటిని పోగు చేయండి;  
మ్రింగివేయడానికి వాటిని తీసుకురండి.   
 10 చాలామంది కాపరులు నా ద్రాక్షతోటను నాశనం చేశారు  
నా పొలాన్ని త్రొక్కివేశారు;  
వారు నాకు ఇష్టమైన పొలాన్ని  
నిర్జనమైన బంజరు భూమిలా మార్చారు.   
 11 అది నా ఎదుట బంజరు భూమిలా,  
ఎండిపోయి పాడైపోయింది;  
పట్టించుకునే వారు లేక  
దేశమంతా వృధా అవుతుంది.   
 12 ఎడారిలో ఉన్న బంజరు కొండలపైకి  
నాశనం చేసేవారు గుంపుగా వస్తున్నారు,  
యెహోవా ఖడ్గం  
భూమి ఈ చివర నుండి ఆ చివర వరకు హతం చేస్తుంది;  
ఎవరూ క్షేమంగా ఉండరు.   
 13 వారు గోధుమలు విత్తుతారు కాని ముళ్ళ పంట కోస్తారు;  
వారు పనితో అలసిపోతారు కాని లాభం ఉండదు.  
యెహోవా కోపం కారణంగా  
కోయడానికి పంట లేక మీరు సిగ్గుపడతారు.”   
 14 యెహోవా ఇలా అంటున్నారు: “నా ప్రజలైన ఇశ్రాయేలీయులకు నేను ఇచ్చిన స్వాస్థ్యాన్ని స్వాధీనం చేసుకున్న నా చెడ్డ పొరుగువారిని వారి దేశాల నుండి పెళ్లగిస్తాను, యూదా ప్రజలను వారి మధ్య నుండి పెళ్లగిస్తాను.   15 కానీ నేను వారిని పెళ్లగించిన తర్వాత, మళ్ళీ వారి మీద కనికరపడి, వారి వారసత్వాలకు వారి దేశాలకు వారిని తిరిగి రప్పిస్తాను.   16 వారు ఒకప్పుడు బయలుపై ప్రమాణం చేయడం నా ప్రజలకు బోధించినట్లే, ఇప్పుడు ‘సజీవుడైన యెహోవా పేరిట’ అని నా పేరు మీద ప్రమాణం చేయడానికి నా ప్రజల మార్గాలను బాగా నేర్చుకుంటే వారు నా ప్రజలమధ్య స్థిరపడతారు.   17 అయితే ఒకవేళ ఏ దేశమైనా నా మాట వినకపోతే, నేను ఆ జనాన్ని వేళ్లతో సహా పెళ్లగించి నిర్మూలం చేస్తాను” అని యెహోవా ప్రకటిస్తున్నారు.