18
కుమ్మరి ఇల్లు 
  1 యెహోవా నుండి యిర్మీయాకు వచ్చిన వాక్కు:   2 “నీవు లేచి, కుమ్మరి ఇంటికి వెళ్లు, అక్కడ నేను నీతో మాట్లాడతాను” అని ఆదేశించింది.   3 కాబట్టి నేను కుమ్మరి ఇంటికి వెళ్లాను, అక్కడ కుమ్మరి చక్రంపై పని చేయడం చూశాను.   4 అయితే బంకమట్టితో చేస్తున్న కుండ అతని చేతిలో విడిపోయింది; అతడు దాన్ని మళ్ళీ ముద్ద చేసి తనకు ఇష్టమైన ఆకారంలో మరో కుండను చేశాడు.   
 5 అప్పుడు యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది.   6 ఆయన, “ఇశ్రాయేలూ, ఈ కుమ్మరి చేసినట్టు నేను నీకు చేయకూడదా?” అని యెహోవా ప్రకటిస్తున్నారు. “కుమ్మరి చేతిలోని మట్టిలా, ఇశ్రాయేలూ, నీవు నా చేతిలో ఉన్నావు.   7 ఏదైనా ఒక దేశాన్ని లేదా రాజ్యాన్ని పెళ్లగిస్తానని, కూల్చివేస్తానని, నాశనం చేస్తానని నేను ఎప్పుడైనా ప్రకటిస్తే,   8 దానికి ఆ దేశం దాని చెడు గురించి పశ్చాత్తాపపడితే నేను జాలిపడి, పంపాలనుకున్న విపత్తును పంపకుండ నిలిపివేస్తాను.   9 ఏదైనా ఒక దేశాన్ని గాని రాజ్యాన్ని గాని కడతానని, స్థిరపరుస్తానని నేను ప్రకటిస్తే,   10 ఒకవేళ అది నా దృష్టిలో చెడు చేసి, నాకు లోబడకపోతే, నేను దానికి చేయాలని ఉద్దేశించిన మంచి చేయకుండా ఆపివేస్తాను.   
 11 “కాబట్టి ఇప్పుడు యూదా ప్రజలతోను, యెరూషలేము నివాసులతోను ఇలా చెప్పు, ‘యెహోవా ఇలా అంటున్నారు: చూడండి! నేను మీ కోసం ఒక విపత్తును రప్పిస్తున్నాను, మీకు వ్యతిరేకంగా ఒక ఆలోచన చేస్తున్నాను. కాబట్టి మీలో ప్రతి ఒక్కరు మీ చెడు మార్గాలను విడిచిపెట్టి, మీ ప్రవర్తనను సరిచేసుకోండి.’   12 అయితే వారంటారు, ‘మీరు చెప్పినా ప్రయోజనం లేదు. మేము మా ఆలోచనల ప్రకారమే నడుచుకుంటాం; మేమందరం మా దుష్ట హృదయాల మొండితనాన్ని అనుసరిస్తాము.’ ”   
 13 కాబట్టి యెహోవా ఇలా చెప్తున్నారు:  
“కన్యయైన ఇశ్రాయేలు  
అత్యంత ఘోరమైన పని చేసింది.  
ఇలాంటిది ఎవరైనా ఎప్పుడైనా విన్నారా?  
అన్ని దేశాలను అడిగి తెలుసుకోండి.   
 14 లెబానోను మంచు  
దాని రాతి బండల నుండి ఎప్పుడైనా మాయమవుతుందా?  
సుదూర ప్రాంతాల నుండి వచ్చే దాని చల్లని జలాలు  
ప్రవహించడం ఆగిపోతాయా?   
 15 అయినా నా ప్రజలు నన్ను మరచిపోయారు;  
పనికిమాలిన విగ్రహాలకు ధూపం వేస్తున్నారు,  
వాటివలన వారు తమ జీవితాల్లో తడబడ్డారు  
పురాతనమైన మార్గాలను వదిలిపెట్టి,  
సరిగా లేని అడ్డదారుల్లో  
నడవాలి అనుకున్నారు.   
 16 వారి దేశం పాడైపోయి  
నిత్యం హేళన చేయబడేదిగా ఉంటుంది;  
దారిన వెళ్లేవారంతా  
నివ్వెరపోయి వారి తలలాడిస్తారు.   
 17 తూర్పు గాలి చెదరగొట్టినట్లు,  
నేను వారి శత్రువుల ముందు వారిని చెదరగొడతాను;  
వారి మీదకు విపత్తు వచ్చిన రోజున  
నేను వారిపై దయ చూపను.”   
 18 వారు, “రండి, యిర్మీయా మీద కుట్ర చేద్దాం; యాజకుడు ధర్మశాస్త్రాన్ని బోధించక మానడు, జ్ఞానులు సలహాలు ఇవ్వడం మానరు, ప్రవక్తలు వాక్కును ప్రకటింపక మానరు. కాబట్టి రండి, అతడు చెప్పేదేదీ పట్టించుకోకుండా మన మాటలతో అతనిపై దాడి చేద్దాం” అంటారు.   
 19 యెహోవా, నా మాట వినండి;  
నాపై నేరాలు మోపేవారు చెప్పేది వినండి!   
 20 మేలుకు ప్రతిగా కీడు చేయాలా?  
అయినా వారు నా కోసం గొయ్యి త్రవ్వారు.  
నేను నీ ఎదుట నిలబడి  
వారి మీది నుండి మీ కోపం తొలగించమని  
వారి పక్షాన నేను మిమ్మల్ని వేడుకున్నానని జ్ఞాపకం తెచ్చుకోండి.   
 21 కాబట్టి వారి పిల్లలను కరువుకు అప్పగించండి;  
ఖడ్గానికి వారిని అప్పగించండి.  
వారి భార్యలు సంతానం లేనివారుగా, విధవరాండ్రుగా ఉండాలి;  
వారి మనుష్యులు చంపబడాలి,  
వారి యువకులు యుద్ధంలో కత్తివేటుతో చంపబడాలి.   
 22 మీరు అకస్మాత్తుగా వారిపైకి దండెత్తే వారిని రప్పించినప్పుడు,  
వారి ఇళ్ళలో నుండి కేకలు వినబడాలి,  
ఎందుకంటే వారు నన్ను పట్టుకోవడానికి గొయ్యి త్రవ్వారు,  
నా పాదాలకు రహస్య ఉచ్చులు బిగించారు.   
 23 అయితే యెహోవా,  
నన్ను చంపడానికి వారు పన్నిన కుట్రలన్నీ మీకు తెలుసు.  
వారి నేరాలను క్షమించకండి  
మీ దృష్టి నుండి వారి పాపాలను తుడిచివేయకండి.  
వారిని మీ ఎదుట కూలనివ్వండి;  
మీరు కోపంలో ఉన్నప్పుడే వారికి తగిన శాస్తి చేయండి.