25
డెబ్బై సంవత్సరాల చెర 
  1 యూదా రాజైన యోషీయా కుమారుడైన యెహోయాకీము ఏలుబడి నాల్గవ సంవత్సరంలో అంటే బబులోను రాజైన నెబుకద్నెజరు ఏలుబడి మొదటి సంవత్సరంలో యూదా ప్రజలందరి గురించి యిర్మీయాకు యెహోవా వాక్కు వచ్చింది.   2 కాబట్టి యిర్మీయా ప్రవక్త యూదా ప్రజలందరితో, యెరూషలేములో నివసిస్తున్న వారందరితో ఇలా అన్నాడు:   3 యూదా రాజైన ఆమోను కుమారుడైన యోషీయా పాలనలో పదమూడవ సంవత్సరం నుండి ఈ రోజు వరకు ఇరవై మూడు సంవత్సరాలు యెహోవా వాక్కు నాకు వస్తూ ఉండింది. నేను మీతో పదే పదే మాట్లాడాను కానీ మీరు వినలేదు.   
 4 యెహోవా తన సేవకులైన ప్రవక్తలందరినీ మీ దగ్గరకు మళ్ళీ మళ్ళీ పంపినా మీరు వినలేదు లేదా పట్టించుకోలేదు.   5 వారు మీతో, “మీలో ప్రతి ఒక్కరు మీ చెడు మార్గాలను, మీ చెడు ఆచారాలను ఇప్పటికైనా విడిచిపెట్టండి, యెహోవా మీకు, మీ పూర్వికులకు ఇచ్చిన దేశంలో మీరు శాశ్వతంగా ఉండగలరు.   6 ఇతర దేవుళ్ళ విగ్రహాలను మీరు సేవించవద్దు, పూజించవద్దు, వాటిని అనుసరించవద్దు; మీ చేతిపనుల వలన మీరు నాకు కోపం రేపవద్దు; అప్పుడు నేను మీకు హాని చేయను” అని చెప్పారు.   
 7 “కాని మీరు నా మాట వినలేదు, మీ చేతులు చేసిన వాటితో మీరు నా కోపాన్ని రేపి, మీకే హాని తెచ్చుకున్నారు” అని యెహోవా ప్రకటిస్తున్నారు.   
 8 కాబట్టి సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: “మీరు నా మాటలు వినలేదు కాబట్టి,   9 నేను ఉత్తరాది జనాంగాలను, నా సేవకుడైన బబులోను రాజు నెబుకద్నెజరును పిలిపిస్తాను” అని యెహోవా అంటున్నారు. నేను వారిని ఈ దేశం మీదికి, దాని నివాసుల మీదికి, చుట్టుప్రక్కల ఉన్న అన్ని దేశాల మీదికి తీసుకువస్తాను. నేను ఈ ప్రజలను పూర్తిగా నాశనం*ఇక్కడ హెబ్రీ పదం వస్తువులను లేదా వ్యక్తులను తిరిగి మార్చుకోలేని విధంగా యెహోవాకు అప్పగించడాన్ని సూచిస్తుంది, తరచుగా వాటిని పూర్తిగా నాశనం చేయడమే. చేస్తాను. వారిని భయానకంగా, హేళనగా శాశ్వతమైన నాశనంగా చేస్తాను.   10 నేను సంతోష ధ్వనులను, వధూవరుల స్వరాలను, తిరుగటిరాళ్ల శబ్దాన్ని దీపపు వెలుగును వారి నుండి దూరం చేస్తాను.   11 ఈ దేశమంతా నిర్జనమైన బంజరుగా మారుతుంది, ఈ దేశాలు డెబ్బై సంవత్సరాలు బబులోను రాజుకు సేవ చేస్తాయి.   
 12 “అయితే డెబ్బై సంవత్సరాలు పూర్తయినప్పుడు, నేను బబులోను రాజును, అతని ప్రజలను, బబులోనీయుల దేశాన్ని వారి దోషాన్ని బట్టి శిక్షిస్తాను” అని యెహోవా ప్రకటిస్తున్నారు, “దానిని శాశ్వతంగా నిర్జనం చేస్తాను.   13 నేను ఆ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడిన వాటన్నిటిని, ఈ పుస్తకంలో వ్రాసి ఉన్నవాటన్నిటిని, యిర్మీయా ప్రవచించిన ప్రకారం ఆ దేశం మీదికి రప్పిస్తాను.   14 వారే అనేక దేశాలకు, గొప్ప రాజులకు బానిసలుగా ఉంటారు; వారి క్రియలనుబట్టి వారి చేతి పనులను బట్టి నేను వారికి ప్రతిఫలమిస్తాను.”   
దేవుని ఉగ్రత పాత్ర 
  15 ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నాతో ఇలా అన్నాడు: “నా ఉగ్రత అనే ద్రాక్షరసంతో నిండిన ఈ గిన్నెను నా చేతిలో నుండి తీసివేసి, నేను నిన్ను పంపే దేశాలన్నిటిని త్రాగనివ్వు.   16 వారు దానిని త్రాగినప్పుడు, నేను వారి మధ్యకు పంపబోయే ఖడ్గాన్ని చూసి వారు తడబడి పిచ్చివారైపోతారు.”   17 కాబట్టి నేను యెహోవా చేతిలో నుండి గిన్నె తీసుకుని, ఆయన నన్ను పంపిన దేశాలన్నిటిని త్రాగేలా చేశాను:   
 18 అవి నేడు ఉన్నట్లుగా నాశనం చేయడానికి వాటిని నిర్జనంగా ఎగతాళిగా ఒక శాపంగా మార్చడానికి యెరూషలేముకు, యూదా పట్టణాలకు, దాని రాజులకు అధికారులకు దానిని త్రాగించాను;   
 19 ఈజిప్టు రాజు ఫరో, అతని పరిచారకులు, అధికారులు, అతని ప్రజలందరూ,   20 అక్కడున్న విదేశీయులందరు అనగా  
ఊజు రాజులందరూ;  
ఫిలిష్తీయ పట్టణాలైన అష్కెలోను, గాజా, ఎక్రోను రాజులందరూ అష్డోదులో మిగిలిన ప్రజలు;   
 21 ఎదోము, మోయాబు, అమ్మోను;   
 22 తూరు సీదోను రాజులందరూ;  
సముద్ర తీర ప్రాంతాల రాజులు;   
 23 దేదాను, తేమా, బూజీయులు దూర ప్రాంతాల్లో ఉన్నవారందరు;   
 24 అరేబియా రాజులందరూ అరణ్యంలో నివసించే పరదేశి ప్రజల రాజులందరూ;   
 25 జిమ్రీ, ఏలాము, మాదీయుల రాజులందరూ;   
 26 ఉత్తరాన ఉన్న రాజులందరూ, సమీపంలో దూరంగా, ఒకదాని తర్వాత ఒకటి భూమిపై ఉన్న అన్ని రాజ్యాలు త్రాగుతారు.  
వారందరి తర్వాత షేషకు రాజు కూడా దానిని త్రాగుతాడు.   
 27 “అప్పుడు వారితో, ‘ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: నేను మీ మధ్యకు పంపే ఖడ్గాన్ని బట్టి ఇకపై లేవకుండా పడిపోండి, త్రాగండి, త్రాగి వాంతులు చేసుకోండి.’   28 అయితే వారు మీ చేతిలో నుండి పాత్ర తీసుకుని త్రాగడానికి నిరాకరిస్తే, నీవు వారితో ఇలా చెప్పు, ‘మీరు దీన్ని త్రాగాలి అని సైన్యాల యెహోవా చెప్తున్నారు.   29 ఇదిగో, నా పేరు ఉన్న పట్టణం మీదికి నేను విపత్తు రప్పించబోతున్నాను, మీరు నిజంగా శిక్షించబడరా? మీరు శిక్షించబడకుండా ఉండరు, ఎందుకంటే నేను భూమిపై నివసించే వారందరిపై ఖడ్గాన్ని రప్పిస్తున్నాను, అని సైన్యాల యెహోవా ప్రకటిస్తున్నారు.’   
 30 “ఇప్పుడు నీవు వారికి ఈ మాటలన్నీ ప్రవచించి వారితో ఇలా చెప్పు:  
“ ‘యెహోవా పైనుండి గర్జిస్తారు;  
ఆయన తన పవిత్ర నివాసం నుండి ఉరుముతారు;  
ఈ దేశానికి వ్యతిరేకంగా బలంగా గర్జిస్తారు.  
ద్రాక్షపండ్లను త్రొక్కేవారి మీద ఆయన గట్టిగా అరుస్తారు,  
భూమిపై నివసించే వారందరికి వ్యతిరేకంగా కేకలు వేస్తారు.   
 31 భూదిగంతముల వరకు ఆ సందడి ప్రతిధ్వనిస్తుంది,  
ఎందుకంటే యెహోవా దేశాల మీద ఆరోపణలు చేస్తాడు;  
అతడు సమస్త మానవాళికి  
తీర్పు తెచ్చి, దుర్మార్గులను ఖడ్గానికి గురి చేస్తాడు’ ”  
అని యెహోవా ప్రకటిస్తున్నారు.   
 32 సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు:  
“ఇదిగో! దేశం నుండి దేశానికి  
విపత్తు విస్తరిస్తుంది;  
పెను తుఫాను  
భూమి అంచుల నుండి ఎగసిపడుతుంది.”   
 33 ఆ సమయంలో యెహోవాచేత చంపబడినవారు భూమి ఈ చివర నుండి ఆ చివర వరకు ప్రతిచోటా ఉంటారు. వారి కోసం ఎవరూ దుఃఖించరు, వారి మృతదేహాలను సేకరించి పాతిపెట్టరు, అవి నేలమీద పెంటలా పడి ఉంటాయి.   
 34 కాపరులారా, ఏడవండి రోదించండి;  
మంద నాయకులారా, దుమ్ములో దొర్లండి.  
ఎందుకంటే మీరు వధించబడే సమయం ఆసన్నమైంది;  
మీరు శ్రేష్ఠమైన పొట్టేళ్లలా పడిపోతారు.†కొ.ప్ర. లలో పడి, చక్కటి కుండల్లా పగిలిపోతారు   
 35 గొర్రెల కాపరులకు పారిపోవడానికి చోటు ఉండదు,  
మందలోని నాయకులు తప్పించుకోవడానికి స్థలం ఉండదు.   
 36 గొర్రెల కాపరుల మొర,  
మంద నాయకుల ఏడ్పులు వినబడుతున్నాయి,  
యెహోవా వారి పచ్చికను నాశనం చేస్తున్నారు.   
 37 నెమ్మదిగల పచ్చికభూములు  
యెహోవా కోపాగ్నికి పాడవుతాయి.   
 38 సింహం తన గుహలో నుంచి వచ్చినట్లు ఆయన వస్తారు,  
అణచివేసే వారి ఖడ్గం‡కొ.ప్ర.లలో కోపం యిర్మీయా 46:16; 50:16కూడా చూడండి కారణంగా  
యెహోవా తీవ్రమైన కోపం కారణంగా  
వారి భూమి నిర్జనమైపోతుంది.