39
1 యూదా రాజైన సిద్కియా ఏలుబడిలో తొమ్మిదవ సంవత్సరం పదవ నెలలో, బబులోను రాజైన నెబుకద్నెజరు తన సైన్యమంతటితో వచ్చి యెరూషలేమును ముట్టడించాడు. 2 సిద్కియా పాలనలో పదకొండవ సంవత్సరం నాలుగవ నెల తొమ్మిదవ రోజు పట్టణ ప్రాకారం విరగ్గొట్టబడింది. 3 అప్పుడు బబులోను రాజు అధికారులు శమ్గరుకు చెందిన నెర్గల్-షారెజెరు, ముఖ్య అధికారియైన నెబో-శర్సెకీము,*లేదా శమ్గర్-నెబో వచ్చి మధ్య ద్వారంలో కూర్చున్నారు. నెర్గల్-షారెజెరు ఒక ఉన్నతాధికారి, మిగిలినవారు బబులోను రాజు ఇతర అధికారులు. 4 యూదా రాజైన సిద్కియా, అతని సైనికులందరు వారిని చూసి పారిపోయారు; రాత్రివేళ వారు రాజు తోటలోని మార్గం నుండి రెండు గోడల మధ్య ఉన్న ద్వారం గుండా పట్టణాన్ని విడిచిపెట్టి, అరాబా†లేదా యొర్దాను లోయ వైపు బయలుదేరి వెళ్లారు.
5 అయితే బబులోను‡లేదా కల్దీయుల సైన్యం వారిని వెంటాడి యెరికో సమతల మైదానంలో ఉన్న సిద్కియాను పట్టుకుంది. వారు అతన్ని పట్టుకుని హమాతు దేశంలోని రిబ్లాలో ఉన్న బబులోను రాజైన నెబుకద్నెజరు దగ్గరకు తీసుకెళ్లారు, అక్కడ రాజు అతనికి శిక్ష విధించాడు. 6 అక్కడ బబులోను రాజు రిబ్లాలో సిద్కియా కుమారులను, అలాగే యూదా పెద్దలందరినీ అతని కళ్లముందే చంపేశాడు. 7 అప్పుడు అతడు సిద్కియా కళ్లు ఊడదీసి, అతన్ని ఇత్తడి సంకెళ్ళతో బంధించి బబులోనుకు తీసుకెళ్లాడు.
8 బబులోనీయులు§లేదా కల్దీయులు రాజభవనాలన్నిటిని ప్రజల ఇళ్ళను తగలబెట్టి యెరూషలేము గోడలను పడగొట్టారు. 9 రాజ రక్షక దళాధిపతియైన నెబూజరదాను పట్టణంలో మిగిలి ఉన్నవారిని, ద్రోహులై తమ రాజును విడిచి అతనితో చేరిన వారిని, మిగిలిన ప్రజలందరినీ బబులోనుకు బందీలుగా తీసుకెళ్లాడు. 10 అయితే రాజ రక్షక దళాధిపతియైన నెబూజరదాను నిరుపేదలను యూదా దేశంలో విడిచిపెట్టి వారికి ద్రాక్షతోటలు పొలాలు ఇచ్చాడు.
11 ఇప్పుడు బబులోను రాజైన నెబుకద్నెజరు యిర్మీయా గురించి రాజ రక్షక దళాధిపతియైన నెబూజరదానుకు ఇలా ఆజ్ఞాపించాడు: 12 “అతన్ని తీసుకెళ్లి జాగ్రత్తగా చూసుకోవాలి; అతనికి హాని చేయవద్దు, అతడు ఏమి అడిగినా అతని కోసం చేయాలి.” 13 కాబట్టి రాజ రక్షక దళాధిపతియైన నెబూజరదాను, ముఖ్య అధికారి నెబూషజ్బాను, ఉన్నతాధికారియైన నెర్గల్-షారెజెరు, బబులోను రాజు ఇతర అధికారులందరూ, 14 మనుష్యులను పంపి యిర్మీయాను కావలివారి ప్రాంగణం నుండి బయటకు తీసుకువచ్చారు. అతన్ని తిరిగి తన ఇంటికి తీసుకెళ్లమని షాఫాను కుమారుడైన అహీకాము, అతని కుమారుడైన గెదల్యాకు అప్పగించారు. కాబట్టి యిర్మీయా తన సొంత ప్రజల మధ్యనే ఉండిపోయాడు.
15 యిర్మీయా కావలివారి ప్రాంగణంలో బంధించబడి ఉన్నప్పుడు, అతనికి యెహోవా వాక్కు వచ్చి: 16 “వెళ్లి కూషీయుడైన ఎబెద్-మెలెకుతో ఇలా చెప్పు, ‘ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: నేను ఈ పట్టణానికి వ్యతిరేకంగా చెప్పిన నా మాటలను అనగా మేలు గురించి కాదు కాని కీడు గురించి చెప్పిన మాటలను నేను నెరవేర్చబోతున్నాను. ఆ సమయంలో అవి మీ కళ్లముందు నెరవేరుతాయి. 17 అయితే ఆ రోజు నేను నిన్ను రక్షిస్తాను అని యెహోవా ప్రకటిస్తున్నారు; నీవు భయపడేవారి చేతికి నీవు అప్పగించబడవు. 18 నేను నిన్ను రక్షిస్తాను; నీవు నన్ను నమ్మావు కాబట్టి నీవు ఖడ్గానికి బలి కాకుండ, నీవు ప్రాణంతో తప్పించుకుంటావు అని యెహోవా ప్రకటిస్తున్నారు.’ ”