47
ఫిలిష్తీయుల గురించిన సందేశం
ఫరో ఇంకా గాజా మీద దాడిచేయక ముందు ఫిలిష్తీయుల గురించి యిర్మీయా ప్రవక్తకు వచ్చిన యెహోవా వాక్కు:
 
యెహోవా ఇలా చెప్తున్నారు:
“ఉత్తరాన జలప్రవాహాలు ఎలా ఎగసిపడుతున్నాయో చూడండి;
అవి వరదలా పొంగి పొర్లిపారుతాయి.
అవి దేశం మీద, అందులో ఉన్న వాటన్నిటి మీద,
పట్టణాల మీద, వాటిలో నివసించేవారి మీద పొర్లిపారుతాయి.
కాబట్టి ప్రజలంతా మొరపెడతారు;
దేశంలో నివసించేవారంతా ఏడుస్తారు.
పరుగెత్తే గుర్రాల డెక్కల శబ్దానికి,
శత్రు రథాల శబ్దానికి
వాటి చక్రాల శబ్దానికి వారు రోదిస్తారు.
తల్లిదండ్రులు తమ పిల్లలకు సహాయం చేయరు;
వారి చేతులు బలహీనంగా ఉంటాయి.
ఎందుకంటే ఆ రోజు వచ్చింది,
ఫిలిష్తీయులందరినీ నాశనం చేసే రోజు
తూరు, సీదోనులకు సహాయం చేసేవారందరిని
తొలగించే రోజు తప్పకుండా వస్తుంది.
యెహోవా ఫిలిష్తీయులను,
కఫ్తోరు*అంటే, క్రేతు తీరాల్లో మిగిలి ఉన్నవారిని నాశనం చేయబోతున్నారు.
గాజా దుఃఖంలో తల క్షౌరం చేసుకుంటుంది;
అష్కెలోను నిశ్శబ్దం చేయబడుతుంది.
సమతల మైదానంలో మిగిలి ఉన్నవారలారా,
ఎంతకాలం మిమ్మల్ని మీరు గాయపరచుకుంటారు?
 
“ ‘అయ్యో, యెహోవా ఖడ్గమా,
నీవు ఎంత కాలానికి విశ్రాంతి తీసుకుంటావు?
నీ ఒర లోనికి తిరిగివెళ్లి
ప్రశాంతంగా విశ్రమించు.’
అయితే అష్కెలోను మీదా,
సముద్ర తీర ప్రాంతాల మీద దాడి చేయమని,
యెహోవా దాన్ని ఆజ్ఞాపించినప్పుడు,
అది ఎలా విశ్రమిస్తుంది?”

*47:4 అంటే, క్రేతు