49
అమ్మోనీయుల గురించిన సందేశం 
  1 అమ్మోనీయుల గురించి:  
యెహోవా ఇలా చెప్తున్నారు:  
“ఇశ్రాయేలుకు కుమారులు లేరా?  
ఇశ్రాయేలుకు వారసుడు లేడా?  
మోలెకు*లేదా వారి రాజు; 3 వచనంలో కూడా గాదును ఎందుకు స్వాధీనం చేసుకున్నాడు?  
అతని ప్రజలు దాని పట్టణాల్లో ఎందుకు నివసిస్తున్నారు?   
 2 అయితే ఆ రోజులు రాబోతున్నాయి”  
అంటూ యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు,  
“అమ్మోనీయుల రబ్బాకు వ్యతిరేకంగా  
నేను యుద్ధధ్వని చేసినప్పుడు;  
అది శిథిలాల దిబ్బ అవుతుంది,  
దాని చుట్టుప్రక్కల గ్రామాలు అగ్నికి ఆహుతి అవుతాయి.  
అప్పుడు ఇశ్రాయేలు  
దాన్ని వెళ్లగొట్టిన వారిని వెళ్లగొడుతుంది,”  
అని యెహోవా అంటున్నారు.   
 3 “హెష్బోనూ, ఏడువు. ఎందుకంటే హాయి నాశనం చేయబడింది!  
రబ్బా నివాసులారా, బిగ్గరగా ఏడవండి!  
గోనెపట్ట కట్టుకుని దుఃఖించండి;  
గోడల లోపల ఇటు అటు పరుగెత్తండి,  
ఎందుకంటే మోలెకు దేవుడు తన యాజకులు, అధికారులతో పాటు  
బందీగా వెళ్తాడు.   
 4 మీ లోయలు చాలా ఫలవంతమైనవి,  
అని మీరు మీ లోయల గురించి ఎందుకు గొప్పలు చెప్పుకుంటారు?  
అమ్మోనూ, నమ్మకద్రోహియైన కుమార్తె,  
నీవు నీ సంపదపై నమ్మకం ఉంచి,  
‘నాపై ఎవరు దాడి చేస్తారు?’ అని అంటున్నావు.   
 5 నీ చుట్టూ ఉన్న వారందరి నుండి  
నీకు భయం పుట్టిస్తాను”  
అని సైన్యాల అధిపతియైన యెహోవా ప్రకటిస్తున్నారు.  
“మీలో ప్రతి ఒక్కరు తరిమివేయబడతారు,  
పారిపోయినవారిని ఎవరూ సమకూర్చరు.   
 6 “అయితే, నేను అమ్మోనీయులను చెర నుండి తిరిగి రప్పిస్తాను,”  
అని యెహోవా ప్రకటిస్తున్నారు.   
ఎదోము గురించిన సందేశం 
  7 ఎదోము గురించి:  
సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు:  
“తేమానులో ఇక జ్ఞానం లేదా?  
వివేకవంతులు సలహా ఇవ్వడం మానివేశారా?  
వారి జ్ఞానం తగ్గిపోయిందా?   
 8 దేదానులో నివసించేవారలారా,  
వెనక్కి తిరిగి పారిపోయి లోతైన గుహల్లో దాక్కోండి,  
నేను ఏశావు మీదికి విపత్తు రప్పించి  
వారిని శిక్షిస్తాను.   
 9 ద్రాక్షలు పోగుచేసుకునేవారు మీ దగ్గరకు వస్తే,  
వారు కొన్ని ద్రాక్షలు వదిలేయరా?  
రాత్రివేళ దొంగలు వస్తే,  
వారికి కావలసినంత వారు దొంగిలించరా?   
 10 అయితే నేను ఏశావును నగ్నంగా చేస్తాను;  
అతడు దాక్కునే స్థలాలను బయటపెడతాను,  
అప్పుడతడు ఎక్కడా దాక్కోలేడు.  
అతని సాయుధ పురుషులు నాశనానికి గురవుతారు,  
అతని సోదరులు పొరుగువారు కూడా నాశనమవుతారు. కాబట్టి,   
 11 ‘తండ్రిలేని నీ పిల్లలను వదిలేయండి; నేను వారిని చూసుకుంటాను.  
నీ విధవరాండ్రు కూడా నన్ను నమ్ముకోవచ్చు’  
అని చెప్పడానికి ఎవ్వరూ ఉండరు.”   
 12 యెహోవా ఇలా అంటున్నారు: “పాత్రలోనిది త్రాగడానికి అర్హత లేనివారు కూడా దానిని త్రాగినప్పుడు మీరు శిక్షించబడకుండ ఎందుకు ఉండాలి? మీరు శిక్షించబడేలా దానిని మీరు త్రాగాలి.”   13 యెహోవా, “నా జీవం తోడు, బొస్రా నాశనంగా, శాపంగా మారుతుందని, భయానకంగా, నిందలకు గురి అవుతుందని నా మీద నేను ప్రమాణం చేస్తున్నాను. దాని పట్టణాలన్ని శాశ్వతంగా శిథిలావస్థలో ఉంటాయి” అని ప్రకటిస్తున్నారు.   
 14 నేను యెహోవా నుండి ఒక సందేశం వచ్చింది;  
“దానిపై దాడి చేయడానికి మీరంతా కలిసి రండి!  
లెండి! యుద్ధానికి వెళ్దాం” అని చెప్పడానికి,  
దేశాలకు ఒక దూత పంపబడ్డాడు.   
 15 “ఇప్పుడు నేను నిన్ను దేశాల్లో అల్పమైన దానిగా,  
మనుష్యులు నిన్ను తృణీకరించేలా చేస్తాను.   
 16 నీవు రేపిన భయాందోళనలు,  
నీ హృదయ గర్వం నిన్ను మోసం చేశాయి,  
బండ సందుల్లో నివసించేదానా,  
కొండ శిఖరాల మీద నివాసం ఏర్పరచుకున్నదానా,  
నీవు గ్రద్దలా ఎత్తైన చోట నీ గూడు కట్టుకున్నా  
అక్కడినుండి నేను నిన్ను క్రిందికి పడవేస్తాను”  
అని యెహోవా చెప్తున్నారు.   
 17 “ఎదోము నాశనం అవుతుంది;  
దారిన వెళ్లేవారంతా నివ్వెరపోతారు,  
దాని గాయాలన్నిటిని చూసి ఎగతాళి చేస్తారు.   
 18 సొదొమ గొమొర్రాలను వాటి చుట్టూ ఉన్న పట్టణాలతో  
పాటు పడగొట్టినట్లు వీటిని కూడా పడగొట్టిన తర్వాత  
అక్కడ ఎవరూ నివసించనట్లే;  
ఇక్కడ కూడా ప్రజలు నివసించరు” అని యెహోవా అంటున్నారు.   
 19 “యొర్దాను పొదల్లో నుండి సింహం  
సమృద్ధిగా ఉన్న పచ్చిక బయళ్లకు వస్తున్నట్లుగా,  
నేను ఎదోమును దాని దేశం నుండి క్షణాల్లో తరిమివేస్తాను.  
దీని కోసం నేను నియమించిన వ్యక్తి ఎవరు?  
నాలాంటివారు ఎవరున్నారు, ఎవరు నన్ను సవాలు చేయగలరు?  
ఏ కాపరి నాకు వ్యతిరేకంగా నిలబడగలడు?”   
 20 కాబట్టి ఎదోమును వ్యతిరేకంగా యెహోవా ఏమి ప్రణాళిక వేశారో వినండి,  
తేమానులో నివసించేవారికి ఆయన ఏమి ఉద్దేశించారో వినండి:  
మందలోని చిన్న పిల్లలు బయటకు ఈడ్చివేయబడతాయి;  
వారు చేసిన దానికి వారి పచ్చికబయళ్లు పాడుచేయబడతాయి.   
 21 వారు పతనమైనప్పుడు భూమి కంపిస్తుంది;  
వారి మొర ఎర్ర సముద్రం వరకు వినిపిస్తుంది.   
 22 చూడండి! శత్రువు తన రెక్కలు బొస్రా మీదుగా విప్పి  
గ్రద్దలా దూసుకుపోతాడు.  
ఆ రోజున ఎదోము యోధులు  
ప్రసవ వేదనలో ఉన్న స్త్రీలా వేదనలో ఉంటారు.   
దమస్కు గురించిన సందేశం 
  23 దమస్కు గురించి:  
“హమాతు, అర్పదు చెడువార్త విని  
భయంతో క్రుంగిపోయారు.  
వారు హృదయంలో కలవరపడ్డారు,  
నెమ్మది లేని సముద్రంలా ఆందోళన పడుతున్నారు.   
 24 దమస్కు బలహీనమైపోయింది,  
పారిపోవడానికి అది వెనుకకు తిరిగింది,  
భయం దాన్ని పట్టుకుంది;  
ప్రసవ వేదనలో ఉన్న స్త్రీలా  
దానికి వేదన, బాధ కలిగాయి.   
 25 పేరు పొందిన పట్టణం,  
నేను ఆనందించే పట్టణం ఎందుకు వదల్లేదు?   
 26 నిశ్చయంగా, దాని యువకులు వీధుల్లో కూలిపోతారు;  
ఆ రోజున దాని సైనికులందరూ మూగబోతారు,”  
అని సైన్యాల యెహోవా ప్రకటించారు.   
 27 “నేను దమస్కు గోడలకు నిప్పు పెడతాను;  
అది బెన్-హదదు కోటలను దహించివేస్తుంది.”   
కేదారు, హాసోరును గురించిన సందేశం 
  28 బబులోను రాజైన నెబుకద్నెజరు దాడి చేసిన కేదారు, హాసోరు రాజ్యాల గురించి:  
యెహోవా ఇలా అంటున్నారు:  
“లేవండి, లేచి కేదారు మీద దాడి చేసి  
తూర్పు ప్రజలను నాశనం చేయండి.   
 29 వారి గుడారాలు, వారి మందలు స్వాధీనం చేసుకోబడ్తాయి;  
వారి ఒంటెలు, వారి మొత్తం సామాగ్రితో పాటు,  
వారి గుడారాలను తీసుకెళ్తారు.  
‘అన్నివైపులా భయమే!’  
అని ప్రజలు వారితో అంటారు.   
 30 “త్వరగా పారిపోండి!  
హాసోరులో నివసించేవారలారా, లోతైన గుహల్లో దాక్కోండి”  
అని యెహోవా ప్రకటిస్తున్నారు.  
“బబులోను రాజైన నెబుకద్నెజరు నీకు వ్యతిరేకంగా కుట్రపన్నాడు.  
అతడు నీకు వ్యతిరేకంగా ఒక పథకం వేశాడు.   
 31 “మీరు లేచి, నిర్భయంగా జీవిస్తూ,  
ద్వారాలు గాని అడ్డు గడియలు గాని లేకుండ  
ప్రజలు క్షేమంగా ఉంటున్న,  
దేశం మీద దాడి చేయండి,”  
అని యెహోవా ప్రకటిస్తున్నారు.   
 32 “వారి ఒంటెలు దోచుకోబడతాయి,  
వారి విస్తారమైన మందలు యుద్ధంలో కొల్లగొట్టబడతాయి.  
సుదూర ప్రాంతాలకు నలువైపులా వారిని చెదరగొట్టి  
వారి మీదికి అన్నివైపులా విపత్తు తెస్తాను,”  
అని యెహోవా ప్రకటిస్తున్నారు.   
 33 “హాసోరు నక్కలకు నిలయంగా,  
ఎప్పటికీ నిర్జన ప్రదేశంగా మారుతుంది.  
అక్కడ ఎవరూ నివసించరు;  
దానిలో ఏ ప్రజలు నివసించరు.”   
ఏలాము గురించిన సందేశం 
  34 యూదా రాజైన సిద్కియా పాలనలో ఏలామును గురించి యిర్మీయా ప్రవక్తకు వచ్చిన యెహోవా వాక్కు ఇది:   
 35 సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు:  
“చూడండి, నేను ఏలాము బలానికి మూలమైన  
విల్లును విరగ్గొడతాను.   
 36 నేను ఏలాముకు వ్యతిరేకంగా  
ఆకాశంలోని నాలుగు దిక్కుల నుండి నాలుగు గాలులను రప్పిస్తాను;  
నేను వారిని నాలుగు గాలులకు చెదరగొడతాను,  
చెదిరిపోయిన ఏలాము వారు వెళ్లని  
దేశమే ఉండదు.   
 37 నేను ఏలామును వారి శత్రువుల ఎదుట,  
వారిని చంపాలనుకున్న వారి ఎదుట వారిని చెదరగొడతాను.  
నేను వారి మీదికి విపత్తును,  
నా కోపాగ్నిని కూడా రప్పిస్తాను,”  
అని యెహోవా ప్రకటిస్తున్నారు.  
“నేను వారిని అంతం చేసే వరకు  
ఖడ్గంతో వారిని వెంటాడుతాను.   
 38 ఏలాములో నా సింహాసనాన్ని స్థాపించి,  
దాని రాజును, అధికారులను నాశనం చేస్తాను,”  
అని యెహోవా ప్రకటిస్తున్నారు.   
 39 “అయినప్పటికీ నేను రాబోయే రోజుల్లో  
ఏలాముకు చెందిన వారిని చెర నుండి తిరిగి రప్పిస్తాను,”  
అని యెహోవా ప్రకటిస్తున్నారు.