9
యోబు
1 అప్పుడు యోబు ఇలా జవాబిచ్చాడు:
2 “అవును, ఇదంతా నిజమని నాకు తెలుసు.
అయితే నశించే మానవులు దేవుని ఎదుట తమ నిర్దోషత్వాన్ని ఎలా నిరూపించుకోగలరు?
3 వారు ఆయనతో వాదించాలనుకుంటే,
వేయి ప్రశ్నలలో ఒక్కదానికైనా వారు ఆయనకు జవాబు చెప్పలేరు.
4 ఆయన అత్యంత జ్ఞానవంతుడు మహాబలవంతుడు.
ఆయనతో పోరాడి సురక్షితంగా వచ్చినవారు ఎవరు?
5 ఆయన పర్వతాలను వాటికి తెలియకుండానే కదిలిస్తారు,
కోపంతో వాటిని తలక్రిందులు చేస్తారు.
6 ఆయన భూమిని దాని స్థలంలో నుండి కదిలించి
దాని స్తంభాలు అదిరేలా చేస్తారు.
7 ఆయన సూర్యుని ఉదయించవద్దని ఆజ్ఞాపిస్తే సూర్యుడు ఉదయించడు.
ఆయన నక్షత్రాల కాంతిని కనబడకుండ చేస్తారు.
8 ఆయనే ఆకాశాన్ని విశాలపరుస్తారు
సముద్రపు అలలను అణచివేస్తారు.
9 స్వాతి, మృగశీర్ష, కృతిక అనే నక్షత్రాలను
దక్షిణ నక్షత్రరాసులను ఆయన సృజించారు.
10 ఆయన ఎవరు గ్రహించలేని మహాకార్యాలను
లెక్కలేనన్ని అద్భుతాలను చేస్తారు.
11 ఆయన నా ప్రక్కన నుండే వెళ్తారు కాని నేను ఆయనను చూడలేను,
ఆయన వెళ్తున్నప్పుడు ఆయనను గమనించలేను.
12 ఆయన లాక్కుంటే ఎవరు ఆయనను ఆపగలరు?
‘మీరు ఏమి చేస్తున్నారు?’ అని ఆయనను ఎవరు అడగగలరు?
13 దేవుడు తన కోపాన్ని అణచుకోరు;
రాహాబు*రాహాబు పురాతన సాహిత్యంలో గందరగోళాన్ని సూచించే పౌరాణిక సముద్ర రాక్షసుడి పేరు. సహాయకులు ఆయన పాదాల దగ్గర లొంగిపోయారు.
14 “కాబట్టి దేవునికి నేను ఎలా జవాబివ్వగలను?
ఆయనతో వాదించడానికి ఎలాంటి పదాలను నేను ఉపయోగించగలను?
15 నేను నిర్దోషినైనప్పటికి ఆయనకు బదులు చెప్పలేను.
కరుణించమని మాత్రమే నా న్యాయమూర్తిని వేడుకుంటాను.
16 నేను పిలిచినప్పుడు ఆయన సమాధానం ఇచ్చిన కూడా,
ఆయన నా మాట వింటారని నేను నమ్మలేను.
17 తుఫానుతో ఆయన నన్ను నలుగగొడతారు,
ఏ కారణం లేకుండా నా గాయాలను ఎక్కువ చేస్తారు.
18 ఆయన నన్ను ఊపిరి తీసుకోనివ్వరు
కాని చేదైన వాటిని నాకు తినిపిస్తారు.
19 బలం విషయానికొస్తే, ఆయన మహాబలవంతుడు!
న్యాయం విషయానికొస్తే, ఆయనకు ప్రతివాదిగా ఎవరు ఉండగలరు?
20 నేను నిర్దోషినైనా కూడా నా నోరే నన్ను నిందిస్తుంది;
నేను నిర్దోషినైనా అదే నన్ను దోషిగా ప్రకటిస్తుంది.
21 “నేను నిర్దోషినినైనా
నా గురించి నాకు శ్రద్ధ లేదు.
నా ప్రాణాన్ని నేను తృణీకరిస్తున్నాను.
22 ఏమి చేసినా ఒక్కటే; అందుకే నేను,
దేవుడు నిర్దోషులని దుర్మార్గులని ఏ తేడా లేకుండ నాశనం చేస్తారు అని అంటున్నాను.
23 ఉపద్రవం అకస్మాత్తుగా వచ్చి నాశనం చేస్తే,
నిర్దోషుల దురవస్థను చూసి దేవుడు వెక్కిరిస్తారు.
24 భూమి దుష్టుల చేతికి ఇవ్వబడినప్పుడు,
ఆయన దాని న్యాయాధిపతుల కళ్లను మూసివేస్తారు.
ఆయన కాక ఈ పని ఇంకెవరు చేస్తారు?
25 “పరుగెత్తేవాని కంటే నా రోజులు వేగంగా పరుగెడుతున్నాయి;
ఏ సంతోషం లేకుండానే అవి ఎగిరిపోతున్నాయి.
26 రెల్లు పడవలు దాటిపోతున్నట్లు,
గ్రద్ద తన ఎరను తన్నుకుపోయినట్లు అవి గడిచిపోతున్నాయి.
27 నా ఫిర్యాదు మరచిపోయి, నా విచారం విడిచిపెట్టి
సంతోషంగా ఉంటానని నేను అనుకుంటే,
28 నా బాధలన్నిటికి భయపడతాను
ఎందుకంటే మీరు నన్ను నిర్దోషిగా ప్రకటించరని నాకు తెలుసు.
29 నేను దోషినని తేలినప్పుడు,
నాకెందుకు ఈ వృధా ప్రయాస?
30 సబ్బుతో నన్ను నేను కడుక్కున్నా,
శుభ్రం చేసే పొడితో నా చేతులు కడుక్కున్నా,
31 మీరు నన్ను బురద గుంటలో ముంచుతారు,
అప్పుడు నా బట్టలే నన్ను అసహ్యించుకుంటాయి.
32 “నేను జవాబివ్వడానికి, ఒకరిపై ఒకరం న్యాయస్థానంలో పోరాడడానికి
దేవుడు నాలాంటి మనిషి కాదు.
33 మా మధ్య మధ్యవర్తిత్వం చేసేవారు,
మమ్మల్ని కలపగల వారు మాకు లేరు,
34 దేవుని దండాన్ని నా మీద నుండి తీసివేయగలిగిన వారు ఉంటే బాగుండేది,
అప్పుడు ఆయన భయం నన్ను ఇక బెదిరించదు.
35 అప్పుడు నిర్భయంగా నేను ఆయనతో మాట్లాడగలను,
కాని ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో నేను అలా చేయలేను.