11
జోఫరు 
  1 అప్పుడు నయమాతీయుడైన జోఫరు ఇలా జవాబిచ్చాడు:   
 2 “ఈ మాటలన్నిటికి జవాబు చెప్పాలి కదా?  
ఈ వదరుబోతు నిర్దోషిగా గుర్తించబడాలా?   
 3 నీ వ్యర్థమైన మాటలు విని ఇతరులు మౌనంగా ఉండాలా?  
నీవు ఎగతాళి చేసినప్పుడు నిన్నెవరు మందలించరా?   
 4 నీవు దేవునితో, ‘నా నమ్మకాలు నిర్దోషమైనవి,  
మీ దృష్టికి నేను పవిత్రుడను’ అని చెప్తున్నావు.   
 5 అయితే దేవుడు నీతో మాట్లాడాలని,  
ఆయన నీతో వాదించాలని,   
 6 జ్ఞాన రహస్యాలు ఆయనే నీకు తెలియజేయాలని నేను ఎంతో కోరుతున్నాను,  
ఎందుకంటే, నిజమైన జ్ఞానం నీ ఆలోచనకు మించింది.  
నీ పాపాల్లో కొన్నిటిని దేవుడు మరచిపోయారని తెలుసుకో.   
 7 “దేవుని రహస్యాలను నీవు గ్రహించగలవా?  
సర్వశక్తిమంతుడైన దేవుని గురించి పూర్తిగా తెలుసుకోగలవా?   
 8 అవి పైనున్న ఆకాశాలకన్నా ఉన్నతమైనవి, నీవు ఏమి చేయగలవు?  
అవి పాతాళం కంటే లోతైనవి, నీవు ఏమి తెలుసుకోగలవు?   
 9 అవి భూమి కంటే పొడవైనవి,  
సముద్రం కంటే విశాలమైనవి.   
 10 “ఆయన వచ్చి, నిన్ను చెరసాలలో బంధిస్తే  
న్యాయసభను ఏర్పాటుచేస్తే, ఆయనను ఎవరు అడ్డగించగలరు?   
 11 మోసగాళ్లు ఎవరో ఆయనకు తెలుసు;  
చెడుతనాన్ని చూసిప్పుడు, ఆయన దానిని గమనించడా?   
 12 అడవి గాడిదపిల్ల మనిషిగా పుడుతుందేమో కాని,  
తెలివిలేనివాడు తెలివైనవానిగా మారడం కష్టము.   
 13 “నీవు నీ హృదయాన్ని సమర్పించుకొని,  
నీ చేతులు ఆయన వైపు చాపితే,   
 14 నీ చేతిలో ఉన్న పాపాన్ని నీవు విడిచిపెడితే  
నీ గుడారంలో చెడుకు చోటివ్వకపోతే,   
 15 అప్పుడు నిర్దోషిగా నీ ముఖాన్ని పైకెత్తుతావు;  
భయం లేకుండా స్థిరంగా నిలబడతావు.   
 16 నీ కష్టాన్ని తప్పకుండా నీవు మరచిపోతావు.  
పారుతూ దాటిపోయిన నీటిలా మాత్రమే నీవు దాన్ని గుర్తుచేసుకుంటావు.   
 17 అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్నకాల ప్రకాశం కన్నా ఎక్కువ ప్రకాశిస్తుంది.  
చీకటి ఉన్నా అది ఉదయపు వెలుగులా ఉంటుంది.   
 18 అప్పుడు నిరీక్షణ ఉంటుంది కాబట్టి నీవు భద్రత కలిగి ఉంటావు.  
నీ ఇంటిని పరిశోధించి సురక్షితంగా పడుకుంటావు.   
 19 ఎవరి భయం లేకుండా నీవు విశ్రమిస్తావు.  
చాలామంది నీ సహాయాన్ని కోరుకుంటారు.   
 20 కాని దుర్మార్గుల చూపు మందగిస్తుంది.  
తప్పించుకొనే చోటు వారికి దొరకదు;  
ప్రాణం ఎప్పుడు పోతుందా అని ఎదురుచూస్తారు.”